
వ్యవసాయమే సైన్స్.. పరిశోధనే భవిష్యత్తు: గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ
వ్యవసాయ రంగానికి ఆధునిక సాంకేతికత, పరిశోధనలను జోడించినప్పుడే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆకాంక్షించారు. శుక్రవారం ఆయన సూర్యాపేట జిల్లాలోని మట్టపల్లి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రాన్ని దర్శించుకుని, అనంతరం సుమారు రూ. 800 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి, విద్యా ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు.
మట్టపల్లి ప్రాంతాన్ని ఆధ్యాత్మికంగా మాత్రమే కాకుండా విద్యా, వ్యవసాయ కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని గవర్నర్ పేర్కొన్నారు. హుజూర్‌నగర్ సమీపంలో 100 ఎకరాల విస్తీర్ణంలో రూ.150 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న వ్యవసాయ కళాశాలకు శంకుస్థాపన చేశారు. ఇది భవిష్యత్‌లో పరిశోధన ఆధారిత వ్యవసాయానికి కేంద్రంగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే కోదాడ సమీపంలో రూ.50 కోట్లతో నిర్మించనున్న జవహర్ నవోదయ విద్యాలయానికి కూడా శంకుస్థాపన జరిగింది. ఈ విద్యాలయం గ్రామీణ ప్రాంత ప్రతిభావంతులైన విద్యార్థులకు మెరుగైన విద్యా అవకాశాలు అందించనుంది.
మట్టపల్లి ఆలయ అభివృద్ధిలో భాగంగా యాత్రికుల సౌకర్యాల కోసం రూ.2 కోట్లతో యాత్రిక సదనం, కిచెన్ షెడ్, మరో రూ.2 కోట్లతో డార్మిటరీ భవనాల నిర్మాణానికి గవర్నర్ శంకుస్థాపన చేశారు. భక్తులకు సౌకర్యవంతమైన వసతులు కల్పించడమే లక్ష్యంగా ఈ పనులు చేపడుతున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రైతులకు రూ.2.47 కోట్ల విలువైన వ్యవసాయ యంత్రాలను పంపిణీ చేశారు. అలాగే స్వయం సహాయక సంఘాలకు రూ.504 కోట్ల బ్యాంక్ లింకేజ్, రూ.89 కోట్ల జీవనోపాధి సహాయాన్ని అందించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఇది కీలకంగా మారుతుందని గవర్నర్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ దేశ నినాదం ఇప్పుడు “జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్, జై అనుసంధాన్”గా మారిందని చెప్పారు. వ్యవసాయాన్ని శాస్త్రంగా చూడాలి, పరిశోధనతోనే రైతుల ఆదాయం పెరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.
సభలో పాల్గొన్న సాగునీటి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం వరి ఉత్పత్తిలో దేశంలో అగ్రస్థానంలో ఉందని తెలిపారు. రాష్ట్ర జనాభాలో 85 శాతం మందికి ఉచిత సన్నబియ్యం సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని చెప్పారు. మట్టపల్లి ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.
వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ భవిష్యత్‌లో వ్యవసాయం కృత్రిమ మేధస్సును కూడా మించిపోతుందని వ్యాఖ్యానించారు. వరి, ఆయిల్ పామ్ ఉత్పత్తిలో తెలంగాణ దేశంలో ముందంజలో నిలిచిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
