Let's talk: editor@tmv.in
"వ్యర్థాలే ఆయుధంగా.. సృజనే లక్ష్యంగా: బీసీ గురుకులాల ‘వావ్’ సక్సెస్ స్టోరీ!"

"వ్యర్థాలే ఆయుధంగా.. సృజనే లక్ష్యంగా: బీసీ గురుకులాల ‘వావ్’ సక్సెస్ స్టోరీ!"

Dantu Vijaya Lakshmi Prasanna
12 ఫిబ్రవరి, 2026

చదువు, క్రీడలతో పాటు పర్యావరణ పరిరక్షణలోనూ తాము ఎవరికీ తీసిపోమని ఏపీలోని బీసీ గురుకుల విద్యార్థులు నిరూపిస్తున్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ సంక్షేమ గురుకులాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘వేస్ట్ అవుట్ ఆఫ్ వెల్త్’ (వావ్) కార్యక్రమం అద్భుత ఫలితాలను ఇస్తోంది. ప్లాస్టిక్ బాటిళ్లు, పాత ఇనుము, వస్త్రాలు వంటి వ్యర్థాలతో విద్యార్థులు తయారు చేసిన కళాకృతులు అందరినీ ‘వావ్’ అనిపిస్తున్నాయి.

సృజనాత్మకతకు వేదికగా 'వావ్' కార్యక్రమం

ప్లాస్టిక్, వాడి పడేసిన ఇతర వ్యర్థాలు పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పరిసరాలు కూడా అపరిశుభ్రంగా మారుతూ, దోమలు, ఇతర కీటకాలు వృద్ధి చెందుతూ మానవ ఆరోగ్యం ప్రమాదంలో పడుతోంది. ఈ నేపథ్యంలో పర్యావరణానికి హాని కలుగకుండా వ్యర్థాలతో పునర్వినియోగ వస్తువుల తయారీపై బీసీ సంక్షేమ శాఖ దృష్టి సారించింది.

వావ్ కార్యక్రమంలో భాగంగా బీసీ గురుకుల విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసేలా పునర్వినియోగ వస్తువుల తయారీని ప్రోత్సహించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా బీసీ గురుకుల విద్యార్థుల అద్భుతమైన, అబ్బుర పరిచే రీతిలో పునర్వినియోగ వస్తువులు తయారు చేశారు. వాడిపడేసిన ప్లాస్టిక్ వ్యర్ఠాలు, పాత ఇనుము, కలప, వస్త్రాలతో ఇంటి ఆలంకరణ కళాకృతులు, వాటర్ బాటిళ్లతో డ్రిప్ ఇరిగేషన్, స్టడీ టేబుల్, కుర్చీలు రూపొందించి ఔరా అనిపించారు

విద్యార్థుల్లో సామాజిక స్పృహను పెంపొందించడమే కాకుండా పర్యావరణ పరిరక్షణపై అవగాహన, ఐక్యత, సృజనాత్మకత, జట్టు స్ఫూర్తి, ఆత్మవిశ్వాసాన్నిపెంపొందించడమే ప్రధాన లక్ష్యంగా బీసీ సంక్షేమ శాఖ ఈ వినూత్న కార్యక్రమం ‘వావ్’ కి శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 109 గురుకుల పాఠశాలల్లో ఈ ప్రాజెక్టును అమలు చేస్తున్నారు. గతంలో పరిసరాల్లో పడి ఉండే చిక్కీల రేపర్లు, ప్లాస్టిక్ వ్యర్థాలు ఇప్పుడు అందమైన గృహాలంకరణ వస్తువులుగా, నిత్యావసరాలుగా మారుతుండడం విశేషం . వీరు ప్లాస్టిక్, పాత ఇనుము, కలపతో వివిధ రకాల కళాకృతులు, నిచ్చెనలు, కబోర్డులు, బ్యాగ్ లు, ఎండిన పువ్వుల రెక్కలతో ధూప్ స్టిక్స్, పాత దుస్తులతో ఫ్లోర్ మ్యాట్స్ వంటి వస్తువులను తయారు చేస్తున్నారు.

ఒక్కో స్కూల్.. ఒక్కో అద్భుతం

ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి పాఠశాల తనదైన ప్రత్యేకతను చాటుకుంది. సింహాచలం బీసి పాఠశాల విద్యార్థులు, ఎగ్ ట్రేలు, పాత బట్టలతో స్టడీ టేబుళ్లు, కుర్చీలు చేస్తే, పెనుకొండ విద్యార్థులు, ప్లాస్టిక్ బాటిళ్లతో బర్డ్ ఫీడర్లు చేశారు. పెద్దాపురం, కొత్తవలస విద్యార్ధులు కొబ్బరి వ్యర్థాలతో పెన్ స్టాండ్లు, బాటిళ్లతో స్వాన్ మోడల్ గార్డెన్లు చేసి అలరిస్తే, లేపాక్షి విద్యార్ధులు ఎలక్ట్రిక్ వేస్ట్‌తో అలంకరణ లైట్లు (షాండేలియర్) చేసి వారి ప్రతిభతో ‘వావ్’ అనిపించారు.

నీటి పొదుపులో నార్పల విద్యార్థుల మార్క్

ముఖ్యంగా నార్పల గురుకుల విద్యార్థులు తయారు చేసిన 'డ్రిప్ ఇరిగేషన్' వ్యవస్థ అందరినీ ఆకట్టుకుంటోంది. వాడి పారేసిన ప్లాస్టిక్ బాటిళ్లను ఉపయోగించి, తక్కువ ఖర్చుతో మొక్కలకు చుక్క చుక్క నీరు అందేలా వీరు రూపొందించిన విధానం రైతులకు ఎంతో మేలు చేస్తుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల ప్లాస్టిక్ వ్యర్థాల నిర్మూలనతో పాటు జల సంరక్షణ కూడా సాధ్యమవుతోంది.

ప్లాస్టిక్ రహిత క్యాంపస్‌లే లక్ష్యం

ఈ కార్యక్రమం వల్ల విద్యార్థుల్లో జట్టు స్ఫూర్తి, ఆత్మవిశ్వాసం పెరగడమే కాకుండా గురుకులాలన్నీ ప్లాస్టిక్ రహితంగా మారుతున్నాయి. పరిసరాలు శుభ్రంగా ఉండడం వల్ల విద్యార్థుల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వ్యర్థాలను సంపదగా మార్చే ఈ అలవాటు విద్యార్థుల భవిష్యత్తుకు పునాదిగా మారుతోంది.

సమాజ హితానికి బీసీ బిడ్డలే వెన్నెముక: మంత్రి సవిత

బీసీ బిడ్డలు పర్యావరణ పరిరక్షకులుగా ముందు నిలవడం గర్వకారణమని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత కొనియాడారు. "సరైన ప్రోత్సాహం అందిస్తే మన విద్యార్థులు అద్భుతాలు చేస్తారని వీరు నిరూపించారు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం వీరు వేసిన పునాదులు అభినందనీయం" అని ఆమె పేర్కొన్నారు. బీసీ సంక్షేమ శాఖ తరపున విద్యార్థుల నైపుణ్యాలకు ఎప్పుడూ అండగా ఉంటామని ఆమె హామీ ఇచ్చారు.