Let's talk: editor@tmv.in
వ్యక్తిగత కక్షలు వదిలి.. ఎన్నికల హామీలు నెరవేర్చండి: కేటీఆర్ హితవు

వ్యక్తిగత కక్షలు వదిలి.. ఎన్నికల హామీలు నెరవేర్చండి: కేటీఆర్ హితవు

Gaddamidi Naveen
27 డిసెంబర్, 2025

తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. ముఖ్యమంత్రి ఏ. రేవంత్‌రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఘాటుగా స్పందించారు. కేసీఆర్‌ కుటుంబాన్ని అధికారానికి దూరంగా ఉంచుతానని ముఖ్యమంత్రి ప్రతిజ్ఞ చేయడాన్ని తప్పుబట్టిన కేటీఆర్‌, వ్యక్తిగత కక్షలకంటే ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టాలని సూచించారు.

శుక్రవారం హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కేటీఆర్‌ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఉపయోగిస్తున్న భాష, చేస్తున్న ఆరోపణలు ఒక సీఎంకి తగినవిగా లేవని విమర్శించారు. రాజకీయ విమర్శలు చేయొచ్చు కానీ అసభ్య పదజాలం వాడటం సరైన పద్ధతి కాదు. ముఖ్యమంత్రి స్థాయికి తగిన హుందాతనం అవసరం అని అన్నారు.

రేవంత్‌రెడ్డి కేసీఆర్‌ను తిరిగి అధికారంలోకి రానివ్వబోనని ప్రతిజ్ఞ చేయడంపై స్పందిస్తూ, మీకు అంత సామర్థ్యం ఉంటే, కేసీఆర్‌ను అడ్డుకోవాలనే ప్రతిజ్ఞ కాదు… పేద మహిళలకు ఒక తులం బంగారం ఇస్తామన్న ఎన్నికల హామీని 2026 జనవరి 1 నుంచే అమలు చేస్తానని ప్రతిజ్ఞ చేయండి అని కేటీఆర్‌ సవాల్‌ విసిరారు. 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీ ఈ హామీని ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

డిసెంబర్‌ 24న జరిగిన మాటల యుద్ధం నేపథ్యంలో తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆ రోజు సీఎం రేవంత్‌రెడ్డి, కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలకు ప్రతిగా బీఆర్‌ఎస్‌ను తిరిగి అధికారంలోకి రానివ్వబోనని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే రాజకీయ ఉద్రిక్తత మరింత పెరిగిందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

వ్యక్తిగత కక్షలు వదిలి.. ఎన్నికల హామీలు నెరవేర్చండి: కేటీఆర్ హితవు - Tholi Paluku