Let's talk: editor@tmv.in
వోల్వో కు భారత్ ఇక ‘హోమ్ మార్కెట్’

వోల్వో కు భారత్ ఇక ‘హోమ్ మార్కెట్’

Laaheerie P
3 నవంబర్, 2025

భారత మార్కెట్‌లో 25 ఏళ్లకు పైగా కార్యకలాపాలు కొనసాగించిన అనంతరం, స్వీడన్‌కు చెందిన వోల్వో గ్రూప్ భారత్‌ను ఇప్పుడు తన “హోమ్ మార్కెట్”గా ప్రకటించింది. LeadIT (Leadership Group for Industry Transition) ఫ్రేమ్‌వర్క్ కింద వోల్వో గ్రూప్ ఇండియా టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్‌తో MoU సంతకం చేసింది. దీని ప్రధాన లక్ష్యం: భారత హేవీ డ్యూటీ ట్రాన్స్‌పోర్ట్ రంగాన్ని సస్టైనబుల్, డికార్బనైజ్‌డ్ దిశగా తీసుకెళ్లడం.

వోల్వో గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ & మేనేజింగ్ డైరెక్టర్ కమల్ బాలి మాట్లాడుతూ - భారత్ ఇప్పుడిక వోల్వోకు విదేశీ మార్కెట్ కాదు, స్వదేశ మార్కెట్ స్థాయికి చేరిందని చెప్పారు. భారత్ ఇప్పుడు వోల్వో గ్లోబల్ స్ట్రాటజీలో అత్యంత కీలకమైన ప్రాంతాల్లో ఒకటిగా మారిందని ఆయన స్పష్టం చేశారు. భారత్‌లో కంపెనీ నాల్గవ అంతర్జాతీయ తయారీ కేంద్రం ఏర్పాటవుతుండటం కూడా దీనికి సాక్ష్యమని తెలిపారు.

టాటా మోటార్స్‌తో ఈ ఒప్పంద పత్రం ద్వారా పరిశ్రమలోని పెద్ద ప్లేయర్లు కలిసి హేవీ కమర్షియల్ ట్రక్కింగ్ రంగంలో క్లీన్ ఎనర్జీ, నెట్-జీరో ఎమిషన్స్ వైపు వేగంగా ముందుకు తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పోటీ కొనసాగించినా సస్టైనబుల్ ఇండస్ట్రీకి కలసికట్టుగా పనిచేయడం ఈ MoU ప్రధాన ఉద్దేశ్యం.

కమల్ బాలి సూచించిన అంశాలలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి, పాలసీ అలోయ్‌మెంట్, టాలెంట్ అప్‌స్కిల్లింగ్, ఫ్యూయల్ ఎకోసిస్టమ్, ఛార్జింగ్ నెట్‌వర్క్ బలోపేతం ప్రధాన విభాగాలుగా పేర్కొన్నారు. పరిశ్రమ సహకారం పెరిగితే భారతదేశం క్లీన్ హేవీ-డ్యూటీ ట్రాన్స్‌పోర్ట్ వైపు వేగంగా అడుగు వేసే అవకాశం ఉందన్నారు.

భారత రోడ్డు రవాణా రంగంలో మొత్తం ఎమిషన్స్‌లో సుమారు 37% హేవీ-డ్యూటీ కమర్షియల్ సెగ్మెంట్ నుంచే వస్తున్నాయని ఇండస్ట్రీ డేటా చెబుతోంది. కాబట్టి ఈ రంగంలో సస్టైనబిలిటీ సాధించడం జాతీయ ప్రాధాన్యతగా గుర్తించబడింది.

స్వీడన్ రాష్ట్ర కార్యదర్శి సారా మోడిగ మాట్లాడుతూ — టాటా మోటార్స్, వోల్వో భాగస్వామ్యం ఫాసిల్-ఫ్రీ కమర్షియల్ ట్రాన్స్‌పోర్ట్ దిశలో పరిశ్రమ ఎలా ముందుండి మార్పు నడిపించగలదో చూపుతున్న మోడల్ అని పేర్కొన్నారు. ఈ ప్రయత్నం భావితరాల కోసం స్కేలబుల్ టెక్నాలజీ, పాలసీ సపోర్ట్, బలమైన లోజిస్టిక్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణానికి దారి తీసే దిశగా ఉందని ఆమె వ్యాఖ్యానించారు.

గత రెండు దశాబ్దాల్లో వోల్వో భారత మార్కెట్‌లో ట్రక్కులు, బస్సులు, కన్‌స్ట్రక్షన్ ఎక్విప్‌మెంట్, మెరైన్ పవర్ సొల్యూషన్స్, ఇండస్ట్రియల్ పవర్ సొల్యూషన్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్ వంటి విభాగాల్లో విస్తృతంగా ఎదిగింది. భారత్‌లోనే స్వీడన్ వెలుపల వోల్వోకు అతిపెద్ద R&D, IT హబ్ పనిచేస్తోంది. ఐచర్ మోటార్స్‌తో జాయింట్ వెంచర్ ద్వారా మధ్యతరగతి ఇంజన్ల విభాగంలో ప్రపంచ ప్రమాణాలు నిలబెట్టింది. ఈ JV వోల్వో ప్రీమియం బ్రాండ్ పొజిషనింగ్‌ను సంపూర్ణంగా కొనసాగించగలిగింది. ఐచర్ మార్కెట్ ఇన్‌సైట్స్ ఈ కాంబినేషన్‌ను మరింత బలపరిచాయి.

సస్టైనబిలిటీ, టెక్నాలజీ ఆధారిత ఇన్నోవేషన్, దీర్ఘకాలిక పెట్టుబడులతో, భారత్‌లో వోల్వో వ్యూహం కేవలం బిజినెస్ విస్తరణకు మాత్రమే పరిమితం కాకుండా క్లిన్ మొబిలిటీ ఫ్యూచర్‌లో లీడర్‌షిప్ వైపు దృష్టి పెట్టింది. టాటా మోటార్స్‌తో తాజా భాగస్వామ్యం భారత క్లీన్ ట్రాన్స్‌పోర్ట్ ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రయాణంలో కీలక మైలురాయిగా నిలిచే నిర్ణయాత్మక అడుగు అని ఇండస్ట్రీ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.