
వైసీపీ హయాంలో అనర్హులకు ఫించన్లు
అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో రూ. 22.75 కోట్ల ఫించన్లు పంపిణీ చేస్తున్నామని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గపాటి వెంకటేశ్వరప్రసాద్ అన్నారు. ఉదయం 9 గంటలకే 55శాతం పించన్లు పంపిణీ చేసినట్టు తెలిపారు. వేగం,చిత్తశుద్ధి, పారదర్శకత ఇవి మూడు కలిస్తే చంద్రబాబు అంటూ ఎమ్మెల్యే దగ్గుపాటి వ్యాఖ్యానించారు. గతంలో వాలంటీర్ వ్యవస్థ ఉన్నా.. ఫించన్ల పంపిణీకి మూడు రోజులు పట్టేదని అన్నారు. ఇప్పుడు తాము మూడు గంటల్లో పంపిణీ చేస్తున్నామని చెప్పారు.
గత ప్రభుత్వం అర్హత లేనివారికి ఇష్టానుసారంగా ఫించన్లు పంపిణీ చేశారని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆరోపించారు. అలాంటి అవకతవకలకు చెక్ పెడుతూ కొత్త ఫించన్లు పంపిణీ చేశామని తెలిపారు. ఈరోజు కూడా 304 కొత్త ఫించన్లు పంపిణీ చేసినట్టు చెప్పారు. రేషన్, ఫించన్ల పంపిణీ అత్యంత పారదర్శకంగా జరుగుతోందని అన్నారు. ప్రజలు కూడా తమ పాలనపై హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.
అనంతపురం నగరంలోని బుడ్డప్ప నగర్ లో జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ చేతుల మీదుగా ఫించన్లు పంపిణీ చేశారు. జిల్లాలో 2లక్షల 79వేల మందికి ఫించన్లు పంపిణీ చేస్తున్నామని కలెక్టర్ ఓ. ఆనంద్ తెలిపారు. ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా పారదర్శకంగా పంపిణీ ప్రక్రియ చేపట్టామని అన్నారు. సాయంత్రం 6గంటల లోపు 99 శాతం ఫించన్లు పంపిణీ చేస్తామని తెలిపారు.
