
వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్
వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు న్యాయస్థానంలో భారీ ఊరట లభించింది. పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో గుంటూరు కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. గతంలో వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్వహించిన నిరసనలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలపై ఈ కేసు నమోదైంది. ఈ కేసులో ఆయనను విచారించేందుకు పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌ను కూడా న్యాయమూర్తి తోసిపుచ్చారు.
అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పది వేల రూపాయల విలువైన రెండు పూచీకత్తులను సమర్పించాలని స్పష్టం చేసింది. ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే కేసులో గుంటూరు స్పెషల్ జూనియర్ సివిల్ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా పట్టాభిపురం కేసులోనూ ఊరట లభించడంతో ఆయన విడుదలకు మార్గం సుగమమైంది.
అంతకుముందు, సీఎం చంద్రబాబుపై వ్యాఖ్యల కేసులో అరెస్టయిన అంబటిని పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఆ కేసులో బెయిల్ వచ్చినప్పటికీ, పట్టాభిపురం పోలీసులు పీటీ వారెంట్‌పై ఆయనను గుంటూరు కోర్టులో హాజరుపరిచారు. అక్కడ న్యాయస్థానం రిమాండ్ విధించడంతో ఆయన మళ్ళీ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు వరుసగా రెండు ప్రధాన కేసుల్లోనూ బెయిల్ రావడంతో అంబటి వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది.
ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న అంబటి రాంబాబు, కోర్టు ఉత్తర్వులు అందిన వెంటనే విడుదలయ్యే అవకాశం ఉంది. అన్ని ఫార్మాలిటీలు పూర్తయితే ఆయన నేడు జైలు నుంచి బయటకు రానున్నారు. అయితే, సత్తెనపల్లికి సంబంధించిన పాత కేసుల్లో పోలీసులు పీటీ వారెంట్లు కోరే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుండటంతో, ఆయన విడుదలపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.
కాగా, దౌర్జన్యాలు,దాడులు, చెరసాలలు వెలుగుని బంధించలేవు ! అంటూ అంబటి తన సోషల్ మీడియా ఎక్స్ లో పోస్ట్ చేశారు. అలాగే అంబటి బెయిలు పై స్పందిస్తూ, దేవుడు మాయందు ఉండి అంబటి రాంబాబుకి బెయిలు వచ్చింది. ఆ వేంకటేశ్వర స్వామి అన్నీ గమనిస్తున్నారు. మా ఇంటిపై దాడి చేసిన వారికి స్టేషన్ బెయిల్ ఇచ్చి బయటకు వదిలేశారు. కానీ, మా నాన్న అంబటి రాంబాబుపై మాత్రం తప్పుడు కేసులు, పీటీ వారెంట్‌లతో రిమాండ్‌కు పంపించారు అంటూ అంబటి రాంబాబు కుమార్తె అంబటి మౌనిక, ఎక్స్ వేదికగా స్పందించారు.
