
వైసీపీ నేత జోగి రమేష్ నివాసంపై దాడి
వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి ఘటన ఇంకా చల్లారకముందే రాష్ట్రంలో మరో మాజీ మంత్రి ఇంటిపై దాడి జరగడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. కృష్ణ జిల్లా ఇబ్రహీంపట్నంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంపై ఆదివారం టీడీపీ కార్యకర్తలు దాడి చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఘటనతో కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం ప్రాంతం గంటల తరబడి ఉద్రిక్తంగా మారింది.
స్థానిక సమాచారం ప్రకారం మంత్రి నారా లోకేష్‌పై జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ టీడీపీ శ్రేణులు ఆయన ఇంటి వద్ద ఆందోళన చేపట్టాయి. ఈ క్రమంలో పరిస్థితి అదుపు తప్పి, కొందరు ఆందోళనకారులు ఇంటిపై రాళ్లు రువ్వడంతో పాటు ఇంటి భాగాలకు నిప్పంటించినట్లు తెలుస్తోంది. ఈ ఘటన సమయంలో జోగి రమేష్ ఇంట్లో లేరని, ఆయన తిరుపతిలో ఉన్నారని సమాచారం. అయితే ఆయన భార్య, తండ్రి ఇంట్లోనే ఉన్నారు.
వివాదానికి ఆ సవాలే కారణమా?
దాడి అనంతరం ఇబ్రహీంపట్నంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా సమాచారం అందుకున్న పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.ఇదిలా ఉండగా శనివారం ఇబ్రహీంపట్నంలోని ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం జోగి రమేష్ మీడియాతో మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. “తెదేపా కల్తీ నాయకత్వంలో నడుస్తోంది. తిరుపతి లడ్డూ కల్తీ అన్నారు, పరకామణి కేసు అన్నారు, కల్తీ మద్యం అంటూ కేసులు పెట్టారు. కల్తీ మద్యం విషయంపై మాట్లాడాలంటే చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ ముందుకు రావాలి” అంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలే వివాదానికి దారి తీసినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
తిరుపతి నుంచి జోగి రమేష్ కౌంటర్
మరోవైపు ఇంటి మీద దాడి అనంతరం తిరుపతిలో విలేకరుల సమావేశం నిర్వహించిన జోగి రమేష్ తన నివాసంపై దాడిని తీవ్రంగా ఖండించారు. “నేను ఏం తప్పు చేశానని నా ఇంటిపై దాడి చేయించాలి?” అని ప్రశ్నించిన ఆయన బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్‌ను పంపించి ఉద్దేశపూర్వకంగా దాడి చేయించారని ఆరోపించారు. ఇలాంటి దాడులకు తాను భయపడనని రాజకీయాల్లో పిల్ల చేష్టలు మానుకోవాలని నారా లోకేష్‌కు సూచించారు.
అయితే ఈ ఘటనకు ముందు రోజు గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై కూడా టీడీపీ శ్రేణులు దాడి చేయగా అనంతరం పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబుపై హత్యాయత్నం జరిగిందని వైఎస్సార్‌సీపీ ప్రకటించిన మరుసటి రోజే జోగి రమేష్ ఇంటిపై దాడి జరగడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
