Let's talk: editor@tmv.in
వైసీపీ నేత అంబటి రాంబాబు అరెస్ట్

వైసీపీ నేత అంబటి రాంబాబు అరెస్ట్

Panthagani Anusha
2 ఫిబ్రవరి, 2026

ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును శనివారం పోలీసులు అరెస్టు చేశారు. ఈ పరిణామంతో గుంటూరు జిల్లా రాజకీయంగా ఒక్కసారిగా వేడెక్కింది.

అంబటి వద్ద నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం

అరెస్టుకు ముందు గుంటూరు నగరంలోని పలు ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అంబటి రాంబాబు నివాసం వద్దకు చేరుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయన సీఎం పై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చేపట్టారు. దీంతో అక్కడ గందరగోళ పరిస్థితులు ఏర్పడగా పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన అంబటి రాంబాబును శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు ముందస్తు చర్యగా అదుపులోకి తీసుకున్నామని గుంటూరు జిల్లా పోలీసు అధికారులు తెలిపారు. అనంతరం ఆయనను నల్లపాడు పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ ప్రారంభించినట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా అంబటి రాంబాబుపై హత్యాయత్నం జరిగిందంటూ వైఎస్సార్‌సీపీ తీవ్ర ఆరోపణలు చేసింది. తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు కార్యకర్తలు కర్రలు, రాడ్లతో దాడికి యత్నించారని ఈ ఘటనతో రాంబాబు ప్రాణాలకు ముప్పు ఏర్పడిందని పార్టీ నేతలు నిరసనలు చేపట్టారు.

అడవి రాజ్యం దిశగా ఏపీ: జగన్ ధ్వజం

అంబటి రాంబాబు అరెస్టుపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, రాజకీయ ప్రతీకార చర్యలు పరాకాష్టకు చేరాయని విమర్శించారు. ప్రశ్నించే గొంతులను నొక్కేయడమే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం అడవి రాజ్యంలా మారుతోంది అని ఆయన మండిపడ్డారు.

కేంద్రానికి ఫిర్యాదులు

ఇదిలా ఉండగా రాష్ట్రంలో శాంతిభద్రతలు ప్రమాదకరంగా విఫలమయ్యాయని ఆరోపిస్తూ తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరుతూ వైఎస్‌ఆర్‌సిపి పార్లమెంటరీ పార్టీ నాయకుడు వైవి సుబ్బారెడ్డి కేంద్ర హోం కార్యదర్శికి, జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్‌పర్సన్‌కు వేర్వేరుగా లేఖలు రాశారు.

పోలీసుల కథనం ప్రకారం టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు చట్టప్రకారమే తాము కేసులు నమోదు చేశామని ముఖ్యమంత్రిని ఉద్దేశించి అసభ్య పదజాలం వాడటం, శాంతిభద్రతలకు భంగం కలిగించేలా ప్రవర్తించడం వంటి ఆరోపణలపై అంబటి రాంబాబుపై రెండు వేర్వేరు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు వెల్లడించారు. అదేవిధంగా అంబటి రాంబాబు నివాసం వద్ద దాడి జరిగిందన్న ఆరోపణలపైనా విచారణ కొనసాగుతోందని పోలీసులు స్పష్టం చేశారు.

వివాదానికి కేంద్రమైన 'మహాపాపం' ఫ్లెక్సీలు

తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారంలో వైసీపీ నేతలను విమర్శిస్తూ తెదేపా నాయకులు గోరంట్లలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద 'మహాపాపం' పేరుతో భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. వీటిని తొలగించాలని అంబటి రాంబాబు ముందుగానే హెచ్చరించారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం ఆయన గోరంట్ల వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం నేరుగా ఫ్లెక్సీల వద్దకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న తెదేపా కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి అంబటి వాహనాన్ని అడ్డుకున్నారు. కాగా అంబటి రాంబాబు సీఎం చంద్రబాబను విమర్శించడమేకాక ఆయన గురించి గుర్బాషలాడుతూ అనుచిత పదజాలం ఉపయోగించి తిట్టడంతో ఈ పరిణామ కాస్త పెద్ద రాజకిదూమారంగమారి అంబటి రాంబాబును అరెస్ట్ చేయడానికి ప్రధాన కారణంగా మారింది.