
వైసీపీ కార్యకర్తల కోసం డిజిటల్ బుక్!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎదుర్కొంటున్న అన్యాయాలపై స్పందిస్తూ, వారిని సహాయంగా నిలిచేందుకు పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా రూపొందించిన డిజిటల్ బుక్‌కు సంబంధించిన క్యూ ఆర్ కోడ్‌ను పార్టీ నేతలు ఆదివారం కడపలో ఆవిష్కరించారు. మాజీ డిప్యూటీ సీఎం ఎస్బీ అంజాద్ బాషా, ఇంచార్జ్ మేయర్ ముంతాజ్ బేగం ఆధ్వర్యంలో కడప నగరంలోని మాజీ డిప్యూటీ క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం హామీలను అమలు చేయకపోవడంతో పాటు వైసీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నదని ఆరోపించారు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉన్న వారిని లక్ష్యంగా చేసుకుంటూ దొంగ కేసులు పెట్టారని, కడపలో కూడా పలువురిపై కేసులు నమోదయ్యాయని తెలిపారు. అలాంటి పరిస్థితుల్లో పార్టీ కార్యకర్తలు, అభిమానులు తమ అనుభవాలను, ఎదురవుతున్న ఇబ్బందులను ఈ డిజిటల్ బుక్‌లో నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించామని చెప్పారు. దీనివల్ల బాధితుల వివరాలు కేంద్రంగా చేరి, ఆయా కేసులపై పార్టీ నేతలు స్పందించేందుకు వీలవుతుందని వివరించారు. ఇది కార్యకర్తలకు 'శ్రీరామ రక్ష' లాంటిదని, అధికారంలోకి వచ్చాక బాధితులకు న్యాయం చేస్తామని తెలిపారు. ఇక శాసనసభలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై నేతలు తీవ్రంగా స్పందించారు. చిరంజీవిని, జగన్‌ను "వాడు", "వీడు" అనే పదాలతో సంభోదించడం అభ్యంతరకరమని, ఇలాంటి వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి తగదని వ్యాఖ్యానించారు. శాసనసభ దేవాలయం లాంటి ప్రదేశమని, ఇలాంటి స్థలాల్లో సభ్యులు మర్యాదగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, మహిళా నేతలు, విభాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
గతంలో టీడీపీ నేత, మంత్రి నారా లోకేష్ తీసుకొచ్చిన “రెడ్ బుక్” రాజకీయంగా సంచలనం సృష్టించింది. వైసీపీ ప్రభుత్వ పరిపాలనలో చోటుచేసుకున్న అన్యాయాలు, అవినీతిని ప్రజల దృష్టికి తీసుకురావడమే ఉద్దేశంగా దీన్ని రూపొందించినట్లు నారా లోకేష్ వెల్లడించారు. కానీ, టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెడ్ బుక్ ఆధారంగా వైసీపీ కార్యకర్తలను వేధిస్తున్నారంటూ ఆరోపణలు వచ్చాయి. కానీ, లోకేష్ మాత్రం రెడ్ బుక్ తన పని తాను చేసుకుంటూ పోతుందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక దీనికి ప్రతిగా వైసీపీ “డిజిటల్ బుక్” రూపొందించింది. కూటమి పాలనలో ఇబ్బందులు పడుతున్న తమ కార్యకర్తలకు ఇది భరోసాగా ఉంటుందని వైయస్ జగన్ ప్రకటించారు. ఈ డిజిటల్ బుక్ క్యూ ఆర్ కోడ్ ద్వారా తాము ఎదుర్కొంటున్న వేధింపులు, అక్రమ కేసుల వివరాలను నేరుగా పార్టీలోకి చేరవేయవచ్చని చెప్పారు. ఎక్కడా లేని విధంగా ఏపీలో ఈ పుస్తకాల రూపకల్పన ఆసక్తికరంగా మారింది. కానీ, ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపులకే ఏర్పాటు చేస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
