
వైసీపీ కార్యకర్తల్ని వేధిస్తున్నారు
అనంతపురం జల్లా ఉరవకొండ నియోజకవర్గంలోని కూడేరు సీఐ రాజు ఏకపక్షంగా వ్యవహరిస్తూ వైసీపీ కార్యకర్తల్ని వేధిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సీఐ రాజు అరాచకాలు పెరిగిపోయాయని అన్నారు. సీఐ రాజును సస్పెండ్ చేయాలని కోరుతూ అనంతపురం నగరంలోని మున్సిపల్ కార్యాలయం నుంచి ఎస్పీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉరవకొండ నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున వైసీపీ కార్యకర్తలు తరలివచ్చారు. సీఐ రాజును సస్పెండ్ చేయాలని మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు.
ఎస్పీ జగదీష్ అందుబాటులో లేకపోవడంతో డీఎస్పీ శ్రీనివాసరావును కలిసి వినతి పత్రం అందించారు. వైసీపీ కార్యకర్తల్ని కేసులతో వేధిస్తున్నారని ఫిర్యాదు చేశారు. సీఐ రాజుపై చర్యలు తీసుకోవాలని కోరారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక సీఐ అక్రమాలపై విచారణ జరిపిస్తామని విశ్వేశ్వరరెడ్డి హెచ్చరించారు. మంత్రి పయ్యావుల కేశవ్ ఆదేశాల మేరకు పనిచేస్తున్నారని ఆరోపించారు. ఉరవకొండ నియోజకవర్గంలో టీడీపీ అక్రమాలకు సీఐ రాజు అండగా నిలుస్తున్నారని ఆరోపించారు. బ్లాక్ గ్రానైట్ అక్రమంగా తరలించడంలో, ఇతర అసాంఘిక కార్యకలాపాల్లో టీడీపీకి సీఐ రాజు సహకరిస్తున్నారని విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తారన్న అనుమానం ఉన్న నేతల్ని టార్గెట్ చేసి కేసులు నమోదు చేస్తున్నారని అన్నారు. ఎలాంటి కారణాలు లేకపోయినా అక్రమ కేసులతో వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ యూనిఫాంకు చెరగని మరకలా సీఐ రాజు మారారని వాపోయారు. తక్షణమే సీఐ రాజును సస్పెండ్ చేసి, అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని కోరారు. సీఐ రాజు వైఖరి మారకపోతే పోరాటం నిర్వహిస్తామని హెచ్చరించారు. మంత్రి పయ్యావుల కేశవ్ మాటలు వింటే భవిష్యత్తులో సీఐ రాజుకు ఇబ్బందులు తప్పవని వైసీపీ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి హెచ్చరించారు.
