
వైసీపీ ఇన్చార్జి కూతురికి టీడీపీ.. ఇన్‌ఛార్జి?
అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని రాజకీయం ఆసక్తికరంగా మారింది. తండ్రి వైసీపీ ఇంచార్జీగా ఉంటే..కూతురికి టీడీపీ ఇంచార్జీ పదవి కట్టబెట్టడంతో జనం ముక్కున వేలేసుకుంటున్నారు. ఇదెక్కడి రాజకీయం అని నోరెళ్లబెడుతున్నారు. ఇది సినిమానా .. నిజ జీవితమా అన్న అయోమయంలో ప్రజలు ఉన్నారు. ఇంతకీ వైసీపీ ఇంచార్జీ కూతురికి టీడీపీ.. ఇంచార్జీ పదవి ఎందుకు కట్టబెట్టింది ?. కారణం ఏంటి ?. రాజోలు నియోజకవర్గంలో ఏం జరుగుతోంది ?.
గొల్లపల్లి సూర్యారావు.. రాజోలు నియోజకవర్గంలో చిరపరిచితుడు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు. 2024 ఎన్నికల ముందు వరకు టీడీపీలోనే ఉన్నారు. టీడీపీ టికెట్ వస్తుందని ఆశించారు. భావించారు. కానీ పొత్తులో భాగంగా జనసేనకు వెళ్లింది. దీంతో పార్టీ మీద అలిగి.. వైసీపీలో చేరారు. వైసీపీ నుంచి 2024 ఎన్నికల్లో పోటీ చేశారు. ఓడిపోయారు. రాజోలు నియోజకవర్గం నుంచి జనసేన గెలిచింది. అప్పటి నుంచి వైసీపీ ఇంచార్జీగా గొల్లపల్లి సూర్యారావే కొనసాగుతున్నారు. ఇప్పటికీ ఆయనే ఇంచార్జీ. గొల్లపల్లి సూర్యారావు వైసీపీలోకి వెళ్లిన తర్వాత టీడీపీకి ఇంచార్జీ కరువయ్యారు.
గత ఎన్నికల్లో ఇంచార్జీ లేకుండానే టీడీపీ నాయకులు, కార్యకర్తలు జనసేన గెలుపు కోసం నియోజకవర్గంలో పనిచేశారు. అధికారంలోకి వచ్చాక ఇంచార్జీని ప్రకటిస్తారని తెలుగు తమ్ముళ్లు ఆశించారు. కానీ 16 నెలలుగా ఊరించి ఊరించి.. ఇంచార్జీని నియమించారు. ఇంచార్జీని నియమించినందుకు సంతోషపడాలో బాధపడాలో అర్థం కాలేదట రాజోలు నియోజకవర్గంలోని తెలుగు తమ్ముళ్లకు. ఎందుకుంటే రాజోలు వైసీపీ ఇంచార్జీ గొల్లపల్లి సూర్యారావు కూతురు గొల్లపల్లి అమూల్యను రాజోలు టీడీపీ ఇంచార్జీగా ప్రకటించారు. అటు తండ్రి ఇటు కూతురు.. ఇద్దరూ వైసీపీ, టీడీపీ ఇంచార్జీలు. వీరి రాజకీయం అర్థం కాక అటు టీడీపీ, ఇటు వైసీపీ కార్యకర్తలు తలలుపట్టుకుంటున్నారట.
వైసీపీ ఇంచార్జీ కూతురికి టీడీపీ ఇంచార్జీ పదవి ఇవ్వడమేంటని తెలుగు తమ్ముళ్లు పార్టీ అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నారు. ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు వైసీపీ కార్యకర్తలు కూడా ఇదేంటని గొల్లపల్లి సూర్యారావును ప్రశ్నిస్తే ..తనకు ఏం తెలియదు. తనకు తెలియకుండా తన కూతురు నడిపిన వ్యవహారం అంటూ కొట్టిపారేస్తున్నారట. కానీ తండ్రీ కూతుళ్లకు అన్నీ తెలుసు కార్యకర్తల్నే అమాయకుల్ని చేస్తున్నారంటూ రాజోలు జనం మాట్లాడుకుంటున్నారట.
ఎందుకంటే గొల్లిపల్లి సూర్యారావు రాజకీయాల్ని దగ్గరిగా గమనించిన ప్రజలు..ఆయన తదుపరి అడుగు ఏంటో ఇట్టే పసిగట్టేస్తున్నారు. 2024లో టీడీపీలో టికెట్ రాదని తెలిసాక.. వెంటనే వైసీపీతో కమిట్ అయ్యారు. వైసీపీ నుంచి పోటీ చేశారు. ఇప్పుడు టీడీపీతో కమిట్ అయి..కూతుర్ని టీడీపీ ఇంచార్జీగా ప్రకటించేలా వ్యూహం పన్నారు. త్వరలో టీడీపీ గూటికి వెళ్తారు అంటూ రాజోలు నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. గొల్లపల్లి సూర్యరావు రాజకీయం తెలియని వారికి టీడీపీ నిర్ణయం ఆశ్చర్యకరంగా ఉన్నప్పటికీ.. ఆయన రాజకీయం తెలిసిన వారు ఆయన నెక్ట్స్ స్టెప్ ఇదే అంటూ చెబుతున్నారు. త్వరలో గొల్లపల్లి సూర్యారావు టీడీపీ గూటికి వెళ్తారు అన్నది రాజోలు టాక్.
