
వైసీపీ ఆశలు అడియాసలు !
ఏపీలో మెడికల్ కాలేజీలను పిపిపి విధానంలో నిర్మించడాన్ని వైసీపీ వ్యతిరేకిస్తోంది. టీడీపీ కూటమి ప్రభుత్వం మాత్రం తమ నిర్ణయాన్ని సమర్థించుకుంటోంది. ఇటీవల కొందరు ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. కానీ హైకోర్టులో వారికి చుక్కెదురైంది. టీడీపీ కూటమి ప్రభుత్వ వాదనకు మద్దతు దొరికింది. ప్రభుత్వ నిర్ణయంపై ప్రజల్లోకి వెళ్లి లబ్ధి పొందాలన్న వైసీపీ ఆలోచనకు ఆదిలోనే గండి పడింది.
ఏపీలో మెడికల్ కాలేజీలు పిపిపిలో విధానంలో నిర్మిస్తే తప్పేంటన్నది హైకోర్టు ధర్మాసనం వాదన. ప్రభుత్వ నిర్ణయాన్ని ఎలా తప్పుపడతామని వాఖ్యానించింది. చట్ట వ్యతిరేకంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నప్పుడు మాత్రమే జోక్యం చేసుకోగలము. కానీ చట్టరీత్యా నిర్ణయాలు ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని ఎలా తప్పు పడతాం అన్నది హైకోర్టు వాదన. ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బంది ఉన్నప్పుడు ప్రైవేటు భాగస్వామ్యంలో నిర్మించడం తప్పు కాదని వ్యాఖ్యానించింది. దీంతో ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్డుకోవాలన్న వారి ఆశలు అడియాసలు అయ్యాయి. ప్రభుత్వ వాదనకు కొండంత అండ దొరికింది. వైసీపీ విమర్శలను తిప్పికొట్టడానికి హైకోర్టు వ్యాఖ్యలు ఆసరాగా మారాయి. తమ విధానాన్ని సమర్థించుకోవడానికి మరింత బలం చేకూరింది.
ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి లబ్ధిపొందాలన్న వైసీపీకి ఎదురుదెబ్బ. ఎందుకంటే హైకోర్టు ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పట్టి ఉంటే.. వైసీపీ ఆ వ్యాఖ్యలను ఆసరాగా చేసుకుని టీడీపీని మరింత విమర్శించేది. హైకోర్టు వ్యతిరేకించినా ముందుకు వెళ్తున్నారంటూ ప్రజల్లోకి తీసుకువెళ్లేది. ప్రజాక్షేత్రంలో మరింత దూకుడుగా పోరాటం నిర్వహించేది. కానీ హైకోర్టు వ్యాఖ్యలు ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాయి. వాస్తవంగా ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టుకు వెళ్లింది వైసీపీ మద్దతుదారులే. తమకు అనుకూలంగా హైకోర్టు వ్యాఖ్యానిస్తే.. ఆ వ్యాఖ్యలతో ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టాలన్నది వైసీపీ వ్యూహం. కానీ ఆదిలోని ఆ వ్యూహం బెడిసికొట్టింది.
ఇప్పుడు ప్రభుత్వం తమ నిర్ణయం విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గదు. వైసీపీపై ఎదురుదాడికి హైకోర్టు వ్యాఖ్యలను వాడుకుంటుంది. వైసీపీ మాత్రం ప్రజాక్షేత్రంలో ఉద్యమం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. ప్రజల్లో వ్యతిరేకత వస్తే ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందని ఆశిస్తోంది. కానీ ప్రజల్లో ఆ స్థాయి వ్యతిరేకత వస్తుందా అన్నది ప్రశ్న. ఒకవేళ ఉన్నా ఇప్పుడు బహిర్గతం కాదు. ఎన్నికలప్పుడే బయటికొస్తుంది. అంత వరకు ప్రజాపోరాటాలు నిర్వహించడమే వైసీపీ కర్తవ్యం. అటు టీడీపీ, ఇటు వైసీపీ ఎవరి ప్రయోజనాలు వారికి ఉన్నప్పటికీ ప్రజాప్రయోజనాలే పరమావధి కావాలి. రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయి. కానీ ప్రజల జీవితాలను ప్రభావితం చేసే అంశాలపై ఆచితూచి వ్యవహరించాల్సిన బాధ్యత ప్రభుత్వ, ప్రతిపక్షాలపై ఉందన్నది వాస్తవం.
