Let's talk: editor@tmv.in
వైసిపి, టిడిపి కలిసి కట్టుగా మద్యం మాఫియా

వైసిపి, టిడిపి కలిసి కట్టుగా మద్యం మాఫియా

Gangadhar Veerla
14 అక్టోబర్, 2025

ఆంధ్రప్రదేశ్ లో వైసిపి, టిడిపిలు కలిసికట్టుగా మద్యం మాఫియాను నడుపుతున్నాయని బిసివై పార్టీ అధినేత బోడె రామచంద్రయాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన మంగళగిరిలోని బిసివై పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సాధారణంలో ఏదైనా రాష్ట్రం గురించి మాట్లాడాలంటే అభివృద్ధి, సంక్షేమం గురించి చర్చిస్తారని, కానీ ఎపి గురించి మాత్రం ఎక్కడికి వెళ్లినా నకిలీ మద్యం, మద్యం కుంభకోణాల గురించి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం నకిలీ మద్యం ద్వారా ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటోందన్నారు. చంద్రబాబు నాయుడు రెండు రోజుల క్రితం శాంతి భద్రతలు, నకిలీ మద్యం గురించి మాట్లాడారన్నారు. చంద్రబాబు మాటలు విన్న ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వంలో జరుగుతున్న అన్ని అంశాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. చంద్రబాబు మాటలకు, చేతలకు సంబంధం లేదని విమర్శించారు. అధికారంలోకి వచ్చాక డ్రగ్స్ అరికట్టామని చెబుతున్న చంద్రబాబు... ఎన్నికల ముందు విశాఖలో డ్రగ్స్ కంటైనర్ పట్టుబడిందని నానా హండామా చేశారని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చాక ఆ కంటైనర్ ఏమైందో కనీసం పట్టించుకోలేదన్నారు. దానికి సమాధానం కూడా చెప్పలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గంజాయి విచ్చలవిడిగా దొరుకుతోందని, ఆయుర్వేదం చాక్లెట్ల రూపంలో అమ్ముతున్నా పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.

ఐక్యరాజ్య సమితి ఎంపిల బృందంలో మిధున్ రెడ్డి... చంద్రబాబు సహకారం

ఐక్యరాజ్య సమితికి వెళ్లే ఎంపిల బృందంతో పెద్దిరెడ్డి మిధున్ రెడ్డిని పంపడం వెనుక చంద్రబాబు సహకారం ఉందని రామచంద్రయాదవ్ విమర్శించారు. ఓ లిక్క స్కామ్ లో అరెస్టయి జైలుకు వెళ్లి వచ్చిన వ్యక్తిని ఐక్యరాజ్యసమితికి వెళ్లేందుకు ఎలా అనుమతిస్తారన్నారు. కేంద్రంలో కీలకంగా ఉన్న చంద్రబాబే మిధున్ రెడ్డిని పంపడంలో కీలకపాత్ర పోషించారన్నారు. నిజంగా చంద్రబాబుకు చిత్తశుద్ది ఉంటే మిధున్ రెడ్డి యుఎన్ కు వెళ్లకుండా ఆపాలని సవాల్ విసిరారు. మిధున్ రెడ్డిని తప్పని సరి పరిస్థితిల్లో అరెస్ట్ చేయాల్సి వచ్చిందని, లేకపోతే ఆ అరెస్ట్ కూడా జరిగేది కాదన్నారు. అరెస్ట్ చేసినందుకు ప్రతిఫలంగా మిధున్ రెడ్డిని ఎంపిల బ్రుందంతో కలిపి ఐక్యరాజ్యసమితికి పంపడానికి చంద్రబాబు సహకరించారని దుయ్యబట్టారు.

పెద్దిరెడ్డితో చంద్రబాబుకు రహస్య మిత్రత్వం

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో చంద్రబాబు నాయుడికి రహస్య మిత్రత్వం ఉందని రామచంద్రయాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఏదో ఒక రూపంలో తన మిత్రుడు పెద్దిరెడ్డికి మేలు చేస్తూనే ఉంటాడన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక భూ కబ్జాలు, మదనపల్లి ఫైల్స్ ఇలాంటి ఎన్నో ఆరోపణలు వచ్చినా పెద్దిరెడ్డిపై కేసు నమోదు చేయలేదన్నారు. మిధున్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసే ఆలోచన లేదని, పార్టీ నుంచి ఒత్తిడి పెరగడంతోనే అరెస్ట్ చేశారన్నారు. పెద్దిరెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చేసిన అవినీతి, అరాచకాలపై చర్యలు తీసుకోకపోవడానికి కారణం అదేనన్నారు. పెద్దిరెడ్డి, చంద్రబాబు ఇద్దరూ రహస్య స్నేహితులని ఎద్దేవా చేశారు.

బిసిల రక్షణ చట్టం గుర్తుందా? చంద్రబాబు

అధికారంలోకి వచ్చిన ప్రతి సారీ బిసిలను మోసం చేయడంలో చంద్రబాబు నాయుడు చరిత్ర స్రుష్టించారని రామచంద్రయాదవ్ ఎద్దేవా చేశారు. బిసిలకు రక్షణ చట్టం కల్పిస్తామని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎందుకు చట్టం తీసుకురాలేదని ప్రశ్నించారు. బిసిలకు 44 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని 1983లో ఎన్టీ రామారావు ఏర్పాటు చేసిన మురళీధరన్ కమిషన్ ఇచ్చిన నివేదికను ఎందుకు బయట పెట్టడం లేదన్నారు. బిసిలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారే తప్ప బిసిలకు టిడిపితో ఒరిగిందేమీ లేదన్నారు. చంద్రబాబుకు బిసి పట్ల చిత్తశుద్ది ఉంటే వెంటనే బిసి రక్షణ చట్టం తీసుకురావాలని సవాల్ విసిరారు. కూటమి అధికారంలోకి వచ్చాక ప్రతి రోజూ ఏదో ఒక చోట బిసిలపై దాడులు జరుగుతూనే ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

చాగంటి వారితో టిడిపి ఎమ్మెల్యేలు, మంత్రులకు నైతిక విలువలు నేర్పించండి

విద్యార్ధుల్లో నైతిక విలువలను పెంచడం కోసం చాగంటి కోటేశ్వరరావును ప్రభుత్వ సలహాదారుగా నియమించారని, విద్యార్ధుల కంటే ముందు టిడిపి ఎమ్మెల్యేలు, మంత్రులకు నైతిక విలువలు నేర్పించాలని రామచంద్రయాదవ్ సూచించారు. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు నైతిక విలువలను మరిచి ప్రవర్తిస్తున్నారని వారికి చాగంటి వారి చేత నైతిక విలువల పాఠాలు చెప్పించాలన్నారు. నైతిక విలువలు నేర్చుకుంటే ప్రజా సమస్యలు తెలుస్తాయని ముందు ఆ పని చేయండిని చంద్రబాబుకు సూచించారు రామచంద్రయాదవ్.

వైసిపి, టిడిపి కలిసి కట్టుగా మద్యం మాఫియా - Tholi Paluku