Let's talk: editor@tmv.in
వైష్ణో దేవి ఆలయ బోర్డు భేటీ - భద్రతా చర్యలపై సమీక్ష

వైష్ణో దేవి ఆలయ బోర్డు భేటీ - భద్రతా చర్యలపై సమీక్ష

Dantu Vijaya Lakshmi Prasanna
19 నవంబర్, 2025

శ్రీ మాతా వైష్ణో దేవి ఆలయ బోర్డు ఇటీవల ఒక సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించింది. మాతా వైష్ణో దేవి యాత్రకు సంబంధించిన భద్రత, విపత్తు నిర్వహణపై ఈ సమావేశం లో చర్చించారు.

మాతా వైష్ణో దేవి యాత్ర సంవత్సరంలో నిరంతరం (అన్ని రోజులూ) భక్తుల కోసం తెరిచే ఉంటుంది. అయితే, కొన్నిసార్లు వాతావరణ పరిస్థితులు (ముఖ్యంగా భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటం లేదా మంచు) అనుకూలించనప్పుడు, భక్తుల భద్రత కోసం యాత్రను తాత్కాలికంగా నిలిపివేసి తిరిగి ప్రారంభిస్తారు. ఇటీవల జమ్ము కాశ్మీర్ లో ఉగ్ర చర్యల నేపద్యం లో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.

సమావేశ వివరాలు

సచిన్ కుమార్ వైష్ణ్య,శ్రీ మాతా వైష్ణో దేవి ఆలయ బోర్డు ముఖ్య కార్యనిర్వహణాధికారి ఈ సమావేశానికి అద్యక్షత వహించారు. ఈ సమావేశం స్పిరిట్యువల్ గ్రోత్ సెంటర్, కత్రా (జమ్మూ కాశ్మీర్) లో జరిగింది. ఈ సమావేశంలో బోర్డు సీనియర్ అధికారులు, పోలీసులు, పారామిలిటరీ డై. కమాండెంట్, సిఆర్ పిఎఫ్, విపత్తు, అత్యవసర సిబ్బంది (ఎన్ డిఆర్ఎఫ్ ప్రతినిధులు, ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్, ఇతర అనుబంధ సంస్థలు)పాల్గొన్నారు.

ముఖ్య ఆదేశాలు, నిర్ణయాలు

భద్రతా సిబ్బంది, అత్యవసర ప్రతిస్పందనను అందించడంపై దృష్టి సారించాలని సచిన్ కుమార్ వైష్ణ్య ఈ సమావేశంలో చెప్పారు. అలాగే అనేక ముఖ్యమైన సూచనలు జారీ చేశారు

నిరంతర మాక్ డ్రిల్స్

క్రమం తప్పకుండా మాక్ డ్రిల్స్ నిర్వహించడం యొక్క ప్రాముఖ్యతను చెప్పారు. ఈ యాత్రలో భాగంగా సంధర్శకులకు, భక్తులకు ఏమైనా అసౌకర్యం కలిగినా, ఆ ప్రదేశంలో అసాంఘిక కార్యకలాపాలు జరిగినా త్వరిత, సమర్థవంతమైన ప్రతిస్పందన, మెరుగైన ఏజెన్సీల మధ్య సమన్వయం కోసం మాక్ డ్రిల్ ను తరచుగా నిర్వహించాలని జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం ఎన్ డిఆర్ఎఫ్ ను ఆదేశించారు. మొత్తం ఏరియా ట్రాక్, ఆలయ ప్రాంతం సమగ్ర అగ్నిమాపక భద్రత తనిఖీ నిర్వహించాలని ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ ను ఆదేశించారు. ప్రస్తుత అగ్నిమాపక, భద్రతా వ్యవస్థలను బలోపేతం చేయడమే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. విపత్తు సంసిద్ధత అన్ని అంశాలలో నిర్దేశించిన ఎస్ఓపి లను ఖచ్చితంగా పాటించడం, నిశితంగా అనుసరించాల్సిన అవసరాన్ని ఆయన పునరుద్ఘాటించారు.

ట్రాక్‌లో బాగంగా వైష్ణో దేవి ఆలయ ప్రాంతంలో ఉన్న విపత్తు నిర్వహణ స్టోర్ ల సమగ్ర ఇన్వెంటరీ ఆడిట్‌ను (నిల్వల తనిఖీని) చేయాలన్నారు. . ఈ స్టోర్ లను అవసరమైన చోట పునరుద్ధరించాలని, అలాగే ఆధునీకరించాలని, అన్ని పరికరాలను కార్యాచరణ సంసిద్ధత కోసం కఠినంగా పరిశీలించాలని ఆదేశించారు. ట్రాక్‌లో కత్రా పట్టణంలో పనిచేస్తున్న స్థానిక దుకాణాలలో పనిచేసే వ్యక్తుల ధృవీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని సంబంధిత ఏజెన్సీలను కోరారు. ఆలయ బోర్డు, విపత్తు నిర్వహణ బృందాలు, అన్ని బాహ్య వాటాదారులతో సమన్వయం చేసుకుని, ఏదైనా అత్యవసర పరిస్థితికి త్వరగా, సమర్థవంతంగా స్పందించడానికి పూర్తిగా సిద్ధంగా ఉండాలని మాతా వైష్ణో దేవి యాత్ర మొత్తం భద్రతను బలోపేతం చేయాలని ఆయన అన్నారు.