
వైరాలో యంగ్ ఇండియా స్కూల్‌కు శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం
వైరా నియోజకవర్గంలో 20 ఎకరాల విస్తీర్ణంలో రూ. 200 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ, ఈ ప్రాజెక్ట్ రాష్ట్రంలో విద్యారంగంలో ఒక 'గేమ్‌ఛేంజర్' గా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యవస్థ అభివృద్ధిని అత్యున్నత ప్రాధాన్యతగా తీసుకుంటూ, అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణను విద్యా రంగంలో ముందుకు తీసుకెళ్లే దిశగా కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఒక యంగ్ ఇండియా స్కూల్ ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ఈ క్రమంలో వైరాలో తీసుకెళ్తున్న ప్రాజెక్ట్ భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా, తెలంగాణ విద్యా రంగంలో గేమ్‌చేంజర్‌గా నిలుస్తుందన్న నమ్మకం వ్యక్తమైందని, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, సమగ్ర విద్యా విధానంతో విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించడమే ఈ సంస్థ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
స్కూల్ నిర్మాణానికి అవసరమైన నిధులలో ఇప్పటికే రూ.30 కోట్లు విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. పనులు నిరంతరంగా వేగంగా సాగేందుకు ప్రతి 15 రోజులకు నిధులు విడుదల చేసే విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు క్యాంపస్‌లోనే నివసించే విధంగా ప్రత్యేక వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నామని. విద్యతో పాటు క్రీడలు, వ్యక్తిత్వ వికాసం, నైపుణ్యాల అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు వివరించారు.
దేశంలో ఎక్కడా లేని ఈ సమగ్ర ఇంటిగ్రేటెడ్ స్కూల్ మోడల్ తెలంగాణ ప్రభుత్వ దూరదృష్టికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. విద్యార్థుల ఆరోగ్యభద్రత, సౌకర్యాల పరంగా నాణ్యతను పెంచే దిశగా ప్రభుత్వం ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకుందని, కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన వెంటనే డైట్ చార్జీలను 40శాతం వరకు, కాస్మెటిక్ చార్జీలను 200శాతం వరకు పెంచినట్లు ఆయన తెలిపారు. దీని ద్వారా విద్యార్థులకు మరింత మెరుగైన ఆహారం, అవసరమైన వస్తువులు అందేలా చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు.
అలాగే, ప్రజా ప్రతినిధులు, అధికారులు విద్యార్థులతో కలిసి భోజనం చేసి వారి అవసరాలు, సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునే విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ చర్య పారదర్శకత పెంచడమే కాకుండా, విద్యార్థులకు అవసరమైన సేవలు సమయానికి అందేలా చేయడంలో కీలక పాత్ర పోషిస్తోందని ఆయన తెలిపారు. విద్యతోనే సమాజం ఎదుగుతుందని, విద్యార్థుల భవిష్యత్‌ను బలోపేతం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు. తెలంగాణలో నాణ్యమైన ప్రభుత్వ విద్యను ప్రతీ కుటుంబానికి చేరేలా ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం తెలిపారు.
అక్టోబర్ 2024లో, ప్రభుత్వంగా 28 యంగ్ ఇండియా స్కూల్స్‌ను మొదటిసారి ప్రారంభ దశగా తీసుకున్నారు.ఈ స్కూల్స్ ఒక్కో స్కూల్ కోసం సుమారు 20 నుంచి 25 ఎకరాల భూభాగం కేటాయించినట్లు తెలిపారు. ఒక్కో స్కూల్ కు 200కోట్లతో నిర్మాణం చేపట్టుతున్నారు. తరువాత దశకు 55 అసెంబ్లీ నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా స్కూల్స్‌ను స్థాపించడానికి ప్రభుత్వం రూ. 11,000 కోట్లు మంజూరు చేసింది.ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది 119 నియోజకవర్గానికి ఒక్క స్కూల్ నిర్మించానున్నారు.
రూ.400 కోట్లతో పలు ప్రాజెక్ట్‌లు ప్రారంభం
వైరా నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక కార్యక్రమాలకు శంకుస్థాపనను నిర్వహిస్తూ, ఒకే రోజున రూ.400 కోట్ల నిధులను సమకూర్చి ముందడుగు వేసినట్టు డిప్యూటీ సీఎం తెలిపారు. నాయకుడు చెప్పినట్లు, వైరా ప్రాంతం తన రాజకీయ జీవితానికి పునాది కావడం వలన ఈ భూభాగంపై ప్రత్యేక బంధం ఉన్నట్టు ఆయన తెలిపారు.
ప్రస్తుతం వైరాలోని లెఫ్ట్–రైట్ కెనాల్ లైనింగ్ పనులు 42 కోట్ల రూపాయలతో తిరిగి ప్రారంభించబడ్డాయని. ఈ చర్య ద్వారా నీటి సరఫరా, పంటల అభివృద్ధి, వ్యవసాయరంగానికి అనుకూలమైన మౌలిక సదుపాయాలు మెరుగుపడతాయన్నారు. అలాగే, గిరిజన రైతులకు 5,000 బోర్లు, కరెంటు సోలార్ యూనిట్లను అందించడం ప్రారంభమయ్యిందని, ఇది గ్రామీణ ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలను పెంచే కీలక చర్యగా ఆయన పేర్కొన్నారు.
వైరాలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం కూడా వేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే రెండు స్లాబులు పూర్తి అయ్యాయని, తద్వారా ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించే మార్గం సులభమవుతుందన్నారు. ఈ అన్ని కార్యక్రమాల ద్వారా ప్రజల సంక్షేమమే ప్రభుత్వం ప్రధాన ధ్యేయం అని ఆయన తెలిపారు.
వైరా అభివృద్ధికి ఇదే ప్రారంభం మాత్రమే భవిష్యత్తులో ఇంకా పలు ముఖ్యమైన ప్రాజెక్ట్‌లు అమలు చేయబడ్డాయని. ప్రజల ఆశీస్సులు, ఆదరణ ఎల్లప్పుడూ ఉండాలని, అందరి సహకారంతో వైరా ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయగలమని ఆయన పేర్కొన్నారు. ఈ భారీ పథకాలు, సమగ్ర మౌలిక సదుపాయాలు ప్రాంత ప్రజలకు ప్రత్యక్ష లాభాలను అందించనున్నాయని ఆయన తెలిపారు.
