
వైరముత్తుకు జ్ఞానపీఠ్ అవార్డు ఎలా ఇచ్చారు? రచయితల మండిపాటు
ప్రముఖ సాహిత్య పురస్కారం అయిన జ్ఞానపీఠ్ అవార్డును ప్రముఖ గేయరచయిత వైరముత్తుకు ప్రకటించిన నేపథ్యంలో తమిళ సాహిత్య వర్గాల్లో తీవ్ర వివాదం చెలరేగింది. పలువురు రచయితలు, మేధావులు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రసిద్ధ రచయిత జేయమోహన్ ఈ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జ్ఞానపీఠ్ కమిటీకి రాసిన లేఖలో వైరముత్తు నిజమైన కవి, రచయిత కాదని, ఆయన కేవలం ‘హాస్యాస్పదమైన సినిమా గేయరచయిత’ మాత్రమేనని విమర్శించారు. సినిమా పాటలు రాయడం సాహిత్యానికి చేసిన గొప్ప సేవగా పరిగణించలేమని ఆయన అభిప్రాయపడ్డారు.
2018లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన మీటూ మూవ్‌మెంట్ సమయంలో వైరముత్తుపై పలువురు మహిళలు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ముఖ్యంగా గాయని చిన్మయి శ్రీపాద సహా మొత్తం 17 మంది మహిళలు ఆయనపై ఆరోపణలు చేయడం కూడా ఈ వివాదానికి కారణమైంది. ఈ నేపథ్యంలో ఇటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి ప్రతిష్ఠాత్మక సాహిత్య పురస్కారం ఇవ్వడం సాహిత్య ప్రపంచ గౌరవాన్ని దెబ్బతీస్తుందని జేయమోహన్ పేర్కొన్నారు. ఇదే అభిప్రాయాన్ని తమిళ సాహిత్య వర్గాల్లోని పలు ప్రముఖులు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రముఖ రచయిత చారు నివేదిత కూడా ఈ నిర్ణయాన్ని విమర్శించారు. రాజకీయ ప్రభావం ఉన్నందునే వైరముత్తుకు ఈ గౌరవం లభించిందని ఆయన ఆరోపించారు. సమాజంలో శక్తి, రాజకీయ అనుబంధాల ఆధారంగా వ్యక్తులను గొప్ప కవులుగా కొనియాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
ఇదే సమయంలో గాయని చిన్మయి శ్రీపాద సోషల్ మీడియాలో స్పందిస్తూ, పలువురు మహిళలు ఆరోపణలు చేసిన వ్యక్తిని ఇంకా సాహిత్య వర్గాలు, ప్రభుత్వాలు గౌరవించడం బాధాకరమని పేర్కొన్నారు. అలాగే ప్రముఖ నటులు కమల్‌హసన్, పవన్‌కల్యాణ్ వంటి సినీ ప్రముఖులు ఈ అంశంపై మౌనం పాటించడంపై కూడా ఆమె విమర్శించారు. గతంలో మీటూ ఆరోపణల నేపథ్యంలో వైరముత్తు 2021లో ప్రకటించిన ఓఎన్‌వీ లిటరిరీ ప్రైజ్‌ను కూడా స్వీకరించకుండా తిరస్కరించిన విషయం తెలిసిందే. తాజా జ్ఞానపీఠ్ పురస్కారం ప్రకటనతో మళ్లీ ఆయనపై వివాదం చెలరేగింది.
