
వైయస్ జగన్ కు ప్రజాదరణ ఏమాత్రం తగ్గలేదు: సజ్జల రామకృష్ణారెడ్డి
ప్రజలిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జనం తలరాతలు మార్చే గొప్ప పాలన అందించిన గొప్ప నాయకులు వైయస్ జగన్ అని వైయస్సార్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశంసించారు. అందుకే పార్టీ అధికారంలో లేకపోయినా ఆయనకు ఏమాత్రం ప్రజాదరణ తగ్గలేదని స్పష్టం చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్‌రెడ్డి 53వ జన్మదిన వేడుకలు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి దివంగత మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసిన నివాళులర్పించిన అనంతరం ఈ వేడుకలను ప్రారంభించారు. పార్టీ నాయకులతో కలిసి భారీ కేకును కట్ చేశారు. అనంతరం పేదలకు చీరలు పంపిణీ చేశారు. వేడుకల అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో మాట్లాడారు.
జనం తలరాతలు మార్చిన నాయకుడు
కోట్లాది మంది తెలుగుప్రజల అభిమాన నాయకులు, జననేత వైయస్ జగన్ జన్మదిన వేడుకలు పార్టీకి పండగ రోజు. కార్యకర్తలు కాలర్ ఎగరేసి చెప్పుకునే గొప్ప లక్షణాలున్న నాయకుడాయన. ఆయన వందేళ్లపాటు ఆయురారోగ్యాలతో రాష్ట్ర ప్రజలకే కాకుండా దేశ ప్రజలకు సేవ చేసే భాగ్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను. తమ పాలన ద్వారా జనం తలరాతలు మార్చే పాలన అందించిన గొప్ప నాయకుల్లో దివంగత్ వైయస్సార్ గారి తర్వాత వైస్ జగన్ గారే గుర్తుకొస్తారు. కూటమి ఏడాదిన్నర పాలన చూసిన తర్వాత తాము ఏం కోల్పోయామో రాష్ట్ర ప్రజలు గుర్తించారు. ఐదు దశాబ్దాల్లో జరగాల్సిన అభివృద్దిని ఐదేళ్లలో చేసి చూపించారు కాబట్టే పార్టీ ఓడిపోయినా ఆయనకు ప్రజాదరణ ఏమాత్రం తగ్గలేదు. పార్టీ ఏర్పాటు చేసిన నాటి నుంచి ఎన్నో అవరోధాలు, ఓటములు పలకరించినా చెక్కుచెదరని చిరునవ్వుతో ప్రజల ఆకాంక్షల సాధనే ఎజెండాగా వైయస్ జగన్ నాయకత్వంలో వైయస్సార్సీపీ పోరాటాల చేస్తూ వస్తోంది. అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేయాలని చూడలేదు. అధికారం ఇచ్చిన ప్రజల కోసం బాధ్యతగా పనిచేసి ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి చూపించిన నాయకులు దేశంలో వైయస్ తప్ప ఇంకొకరు ఉండరని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. చేసేదే చెప్తాం.. చెప్పినవన్నీ చేస్తా అనేలా ముందుకుసాగారు. చెప్పినవే కాకుండా ఎన్నో చెప్పని హామీలు కూడా తన పాలనలో అమలు చేసి చూపించారు. పార్టీని క్రమశిక్షణతో నడుపుతూ వస్తున్నారు. అందుకే వైయస్సార్సీపీ ఏ కార్యక్రమం చేపట్టినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి పునర్విభజన తర్వాత రాష్ట్రానికి 225 సీట్లు వస్తాయి. అప్పుడు 200లకు పైగా సీట్లు గెలిచి మళ్లీ అధికారాన్ని చేపట్టి నేడు తిరోగమనంలోకి వెళ్తున్న రాష్ట్రాన్ని మళ్లీ ముందుకు తీసుకుపోతారు.
ప్రతి కుటుంబానికి అండగా ఉన్నారు
దేశంలో అత్యంత ప్రజాదరణ ఉన్న నాయకులు వైయస్ జగన్ మాత్రమే. తన ఐదేళ్ల పాలనలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రతి కుటుంబానికి అండగా నిలబడ్డారని ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు అన్నారు. కులం, మతం, పార్టీ చూడకుండా అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందజేసి నిజమైన అర్థం చెప్పిన గొప్ప నాయకులు వైయస్ జగన్ గారు. ఆయన ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, ఇంకా ఎంతోమంది పేద బడుగు బలహీన వర్గాలకు సేవలందించాలని రాష్ట్ర ప్రజంలందరి తరఫున కోరుకుంటున్నానని చెప్పారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. కార్యక్రమంలో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మురుగుడు హనుమంతరావు, కల్పలతారెడ్డి, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, తదితరులు పాల్గోన్నారు.
