Let's talk: editor@tmv.in
వైభవ్‌ వీర బాదుడు.. తృటిలో డబుల్‌ సెంచరీ మిస్‌

వైభవ్‌ వీర బాదుడు.. తృటిలో డబుల్‌ సెంచరీ మిస్‌

Praveen Kumar
25 డిసెంబర్, 2025

విజయ్ హజారే ట్రోఫీ ప్లేట్ గ్రూప్‌లో జరిగిన మ్యాచ్‌లో బిహార్ జట్టు క్రికెట్ చరిత్రలోనే గుర్తుండిపోయే ఆట ఆడింది. అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన ఈ పోరులో బిహార్ బ్యాట్స్‌మెన్లు విరుచుకుపడి ఆడి, 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 574 పరుగులు సాధించి ప్రపంచ రికార్డు నెలకొల్పారు.

ఈ భారీ స్కోరుకు పునాది వేసింది 14 ఏళ్ల యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ. అతడు ఆరంభం నుంచే దూకుడుగా ఆడి 84 బంతుల్లో 190 పరుగులు సాధించాడు. తన ఇన్నింగ్స్‌లో 15 సిక్సులు, 16 ఫోర్లు బాదిన వైభవ్ కేవలం 36 బంతుల్లోనే శతకం పూర్తి చేశాడు. దీంతో లిస్ట్-ఏ క్రికెట్‌లో అత్యంత చిన్న వయసులో శతకం చేసిన ఆటగాడిగా అతడు రికార్డుల్లోకి ఎక్కాడు. భారతీయులలో ఇది రెండో వేగవంతమైన శతకం కూడా.

యూఏఈలో జరిగిన అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో నిరాశపరిచిన తర్వాత కేవలం మూడు రోజుల్లోనే ఈ స్థాయి ఆట ఆడడం వైభవ్ ప్రతిభకు నిదర్శనంగా నిలిచింది.

తర్వాత కెప్టెన్ సాకిబుల్ గని రంగంలోకి దిగి అరుణాచల్ బౌలర్లపై ఆట ఆడాడు. గని 40 బంతుల్లో 128 పరుగులు చేసి, కేవలం 32 బంతుల్లోనే సెంచరీ చేసాడు. ఇది లిస్ట్-ఏ క్రికెట్‌లో భారతీయుడిగా అతడి వేగవంతమైన సెంచరీ. ఇంతకుముందు ఇదే ప్రత్యర్థిపై 35 బంతుల్లో శతకం చేసిన అన్మోల్‌ప్రీత్ సింగ్ రికార్డును గని అధిగమించాడు. గని ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 12 సిక్సులు ఉన్నాయి.

వికెట్‌కీపర్ బ్యాట్స్‌మన్ అయుష్ లోహరుకా కూడా రన్స్ వరదలో భాగమయ్యాడు. అతడు 56 బంతుల్లో 116 పరుగులు చేసి 11 ఫోర్లు, 8 సిక్సులతో మెరిశాడు. అయితే వైభవ్, గని ఆడిన అద్భుత ఇన్నింగ్స్‌ల కారణంగా అతడి సెంచరీ కొంత వెనుకబడినట్లైంది.

ఈ మూడు సెంచరీతో బిహార్ జట్టు, గతంలో 2022–23 సీజన్‌లో అరుణాచల్ ప్రదేశ్‌పై తమిళనాడు సాధించిన 506 పరుగుల పాత ప్రపంచ రికార్డును ఘనంగా చెరిపేసింది.

రాంచీలో జరిగిన ఈ మ్యాచ్‌లో మొత్తం 49 ఫోర్లు, 38 సిక్సులు నమోదవడం మైదానం బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉందని స్పష్టంగా చూపించింది. టాస్ గెలిచిన బిహార్ ముందు బ్యాటింగ్ ఎంచుకోగా, అరుణాచల్ ప్రదేశ్ బౌలింగ్ విభాగం బిహార్ దూకుడును తట్టుకోలేకపోయింది.

లిస్ట్-ఏ క్రికెట్‌లో మొత్తం వేగవంతమైన శతకాల జాబితాలో ఆస్ట్రేలియా ఆటగాడు జేక్ ఫ్రేసర్ మెక్‌గర్క్ 29 బంతుల్లో చేసిన శతకం అగ్రస్థానంలో ఉండగా, దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ 31 బంతుల్లో చేసిన శతకం రెండో స్థానంలో ఉంది.

వైభవ్‌ వీర బాదుడు.. తృటిలో డబుల్‌ సెంచరీ మిస్‌ - Tholi Paluku