

వైభవ్ వీరవిహారం.. ఆర్సీబీని చిత్తు చేసిన రాజస్థాన్
ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తమ జోరును కొనసాగిస్తూ డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఘనవిజయం సాధించింది. శుక్రవారం జరిగిన పోరులో వైభవ్ సూర్యవంశీ విధ్వంసక ఇన్నింగ్స్, ధ్రువ్ జూరెల్ క్లాస్ బ్యాటింగ్ తోడవ్వడంతో బెంగళూరు నిర్దేశించిన 202 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ మరో రెండు ఓవర్లు మిగిలి ఉండగానే 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
సూర్యవంశీ విధ్వంసం
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్‌కు యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ (26 బంతుల్లో 78) కళ్లు చెదిరే ఆరంభాన్నిచ్చాడు. మైదానం నలుమూలలా బౌండరీల వర్షం కురిపిస్తూ బెంగళూరు బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మరోవైపు ధ్రువ్ జూరెల్ (43 బంతుల్లో 81 నాటౌట్) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో అండగా నిలిచాడు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్‌కు కేవలం 37 బంతుల్లోనే 108 పరుగుల మెరుపు భాగస్వామ్యాన్ని నెలకొల్పి గెలుపు పునాది వేశారు. ఈ క్రమంలో కృనాల్ పాండ్య (2/30) వరుస బంతుల్లో వికెట్లు తీసి రాజస్థాన్‌ను దెబ్బకొట్టే ప్రయత్నం చేసినా.. జూరెల్ పట్టువదలలేదు. చివర్లో రవీంద్ర జడేజా (24) సహకారంతో మరో 68 పరుగుల భాగస్వామ్యం జోడించి జట్టును విజయతీరాలకు చేర్చాడు.
రాణించిన పాటిదార్.. పోరాడిన బెంగళూరు
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 201 పరుగులు చేసింది. కెప్టెన్ రజత్ పాటిదార్ (63) అర్ధశతకంతో జట్టును ముందుండి నడిపించాడు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (32), చివర్లో రొమారియో షెపర్డ్ (22), ఇంపాక్ట్ ప్లేయర్ వెంకటేష్ అయ్యర్ (29) వేగంగా ఆడటంతో ఆర్సీబీ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ (2/33), రవి బిష్ణోయ్ (2/32), బ్రిజేష్ శర్మ (2/37) తలో రెండు వికెట్లు పడగొట్టి బెంగళూరును కట్టడి చేశారు. బెంగళూరు బౌలర్లలో హేజిల్ వుడ్ సైతం రెండు వికెట్లు తీసినప్పటికీ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు.
సంక్షిప్త స్కోర్లు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు:
20 ఓవర్లలో 201/8 (రజత్ పాటిదార్ 63, కోహ్లీ 32; ఆర్చర్ 2/33, బిష్ణోయ్ 2/32).
రాజస్థాన్ రాయల్స్:
18 ఓవర్లలో 202/4 (ధ్రువ్ జూరెల్ 81 నాటౌట్, సూర్యవంశీ 78; కృనాల్ పాండ్య 2/30, హేజిల్ వుడ్ 2/44).
