Let's talk: editor@tmv.in
వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం
వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం
వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం

వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం

Gaddamidi Naveen
22 జులై, 2026

హైదరాబాద్‌లోని బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేలాదిమంది భక్తులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారి కళ్యాణాన్ని భక్తిశ్రద్ధలతో తిలకించారు.

రాష్ట్ర ప్రభుత్వం తరఫున రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అమ్మవారికి సంప్రదాయబద్ధంగా పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు, అధికారులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి తీర్థప్రసాదాలు, వేద ఆశీర్వచనాలు అందజేశారు.

కళ్యాణ మహోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీమణి గీతా రెడ్డి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సతీమణి కావ్య రెడ్డి, ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ కుటుంబ సభ్యులు, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, నవీన్ యాదవ్ తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ, తెలంగాణ ప్రజల ఆరాధ్య దైవమైన బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణోత్సవంలో పాల్గొనడం ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించిందన్నారు. తన కుమార్తె సుస్మిత పటేల్‌తో కలిసి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా దేవాదాయ శాఖ నిర్వహిస్తున్న వరుణ యాగాలు, ప్రత్యేక పూజల ఫలితంగానే దైవానుగ్రహంతో రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయని పేర్కొన్నారు. ఈ వర్షాలతో తెలంగాణ సస్యశ్యామలంగా మారి, ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని, రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వ పాలనలో రాష్ట్రం మరింత పురోగతి సాధించాలని, ప్రతి కుటుంబంలో ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, శాంతి నెలకొనాలని కోరుకున్నట్లు మంత్రి తెలిపారు. బల్కంపేట ఆలయ వైభవాన్ని మరింత పెంపొందించేందుకు దేవాదాయ శాఖ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం మార్గదర్శకాల మేరకు విస్తృత ఏర్పాట్లు చేశారు. తాగునీరు, నిరంతర విద్యుత్, వైద్య సేవలు, భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, ప్రత్యేక దర్శన ఏర్పాట్లు కల్పించారు. పిల్లలు, వృద్ధులు, దివ్యాంగులు, శివసత్తులకు ప్రత్యేక సదుపాయాలు అందుబాటులో ఉంచారు. కళ్యాణోత్సవం అనంతరం కూడా అమ్మవారి దర్శనం కోసం భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు.