Let's talk: editor@tmv.in
వైన్ షాప్ మ‌ర‌ణాలన్నీ టీడీపీ ఖాతాలోకి!

వైన్ షాప్ మ‌ర‌ణాలన్నీ టీడీపీ ఖాతాలోకి!

FL - BRTH
12 అక్టోబర్, 2025

ఏపీలో చాలా ఏళ్లుగా ఓ సాంప్ర‌దాయం కొన‌సాగుతోంది. ఏదైనా ఓ సంఘ‌ట‌న జ‌రిగిన‌ప్పుడు.. దానితో సంబంధం లేక‌పోయినా, ఆ సంఘ‌ట‌న‌కు ముడిపెడుతూ ప్ర‌తి అంశాన్ని రాజ‌కీయం చేయ‌డం ప‌రిపాటిగా మారింది. ఇటీవ‌ల తంబ‌ళ్ల‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో వెలుగుచూసిన క‌ల్తీ మ‌ద్యం ఘ‌ట‌న‌ను వైసీపీ త‌న‌కు అనుకూలంగా మ‌లుచుకుంటోంది. లిక్క‌ర్ కేసులో అరెస్టుల‌తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వైసీపీకి క‌ల్తీ మ‌ద్యం కేసు ఊపిరిలూదింది. టీడీపీపై ఎదురుదాడికి అస్త్రంగా మారింది. టీడీపీని ఇర‌కాటంలోకి నెడుతోంది.

ముల‌క‌ల‌చెరువు క‌ల్తీ మ‌ద్యం కేసు తెర‌మీద‌కి రావడంతో వైసీపీలో జోష్ క‌నిపిస్తోంది. ఈ అవ‌కాశాన్ని అడుగ‌డునా త‌న‌కు అనుకూలంగా మార్చుకుంటోంది. ఏపీలో చాలా చోట్ల వైన్ షాపుల వ‌ద్ద మ‌ద్యం సేవిస్తూ ఇటీవ‌ల కొంద‌రు మ‌ర‌ణించారు. ఆ మ‌ర‌ణాల‌న్నీ క‌ల్తీ మ‌ద్యం మ‌రణాలే అన్న‌ది వైసీపీ వాద‌న‌. ప్ర‌చారం. ఇది టీడీపీకి త‌ల‌నొప్పిగా మారింది. లిక్క‌ర్ కేసులో జ‌గ‌న్ ని అరెస్టు చేయాల‌ని ఉవ్విళ్లూరుతున్న టీడీపీకి.. క‌ల్తీ మ‌ద్యం కేసు ముంద‌రి కాళ్ల బంధ‌నం వేసింది. వైసీపీపై విమ‌ర్శ‌లు చేయ‌లేని స్థితికి తీసుకొచ్చింది. ఇదే అదునుగా వైసీపీ ప్ర‌తి మ‌ర‌ణాన్ని క‌ల్తీ మ‌ద్యం మ‌ర‌ణంగా చిత్రీక‌రించ‌డం, టీడీపీ స‌మాధానం చెప్పుకోవాల్సిన ప‌రిస్థితిని క‌ల్పిస్తోంది.

మంత్రులు మీడియా ముందుకు వ‌చ్చి వివ‌ర‌ణ ఇవ్వాల్సి వ‌స్తోంది. వైసీపీ ఆరోప‌ణ‌ల‌ను ఖండించాల్సి వ‌స్తోంది. ఇదంతా కూడా క‌ల్తీ మ‌ద్యం కేసు వ‌ల్ల‌నే. ఆ వ్య‌వ‌హారం వెలుగులోకి రాక‌పోతే వైసీపీని చెడుగుడు ఆడుదాం అన్నది టీడీపీ వ్యూహం. కానీ క‌ల్తీ మ‌ద్యం కేసు ఒక్క‌సారిగా రాజ‌కీయ వాతావ‌ర‌ణాన్ని మార్చేసింది. స్థానాల‌ను మార్చేసింది. వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు టీడీపీ చేసిన విమ‌ర్శ‌లే.. ఇప్పుడు టీడీపీపై వైసీపీ చేస్తోంది. జ‌గ‌న్ బ్రాండ్స్ వ‌ల్ల చాలా మంది మ‌ర‌ణించార‌ని టీడీపీ గ‌తంలో ఆరోపించింది. ఇప్పుడు వైసీపీ అదే అస్త్రాన్ని టీడీపీపై ఉప‌యోగిస్తోంది. చ‌నిపోయిన వారు ఏ కార‌ణంతో చ‌నిపోయారో తేల‌కుండానే.. వైన్ షాపు వ‌ద్ద జ‌రిగిన ప్ర‌తి మ‌ర‌ణాన్ని క‌ల్తీ మ‌ద్యం అకౌంట్లోకి వైసీపీ వేస్తోంది. గ‌తంలో టీడీపీ ఇలాగే చేసింది. ఇప్పుడు వైసీపీ అదే చేస్తోంది.

రెండు పార్టీల‌కు అధికార‌మే ప‌ర‌మావ‌ధి. ప్ర‌జ‌ల ప్రాణాలు కాదు. ప్ర‌తిదీ రాజ‌కీయం చేసి ల‌బ్ధి పొంది అధికారంలోకి రావాల‌న్న కోరికే బ‌లంగా క‌నిపిస్తోంది. ప్ర‌జ‌లు త‌ర‌పున మాట్లాడుతున్న‌ట్టు క‌నిపిస్తున్న‌ప్ప‌టీ.. అంత‌ర్లీనంగా స్వ‌ప్ర‌యోజ‌నాలే ఉన్నాయి. అత‌ని కంటే ఘ‌నుడు అచంట మ‌ల్ల‌న్న అన్న‌ట్టు ఎవ‌రికెవ‌రూ తీసిపోరు. స్థానాలు మార్చుకుంటున్నారు. అంతే విధానాలు కాదు. ప్ర‌జ‌ల బ‌ల‌హీన‌త‌లే రెండు పార్టీల‌కు ఆలంబ‌న‌. అవ‌స‌రానికి త‌గ్గ‌ట్టుగా వేషాలు, వాగ్ధానాలు మార్చుకుంటూ ప్ర‌జ‌ల జీవితాల్ని అల్ల‌క‌ల్లోలం చేస్తున్నారు.