Let's talk: editor@tmv.in
వైద్య విద్య పరీక్షల తీరుపై మరింత నిఘా

వైద్య విద్య పరీక్షల తీరుపై మరింత నిఘా

Panthagani Anusha
23 జనవరి, 2026

రాష్ట్రంలోని వైద్య విద్య పరీక్షల్లో పారదర్శకతను పెంచేందుకు అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం సరికొత్త సాంకేతికతను అందుబాటులోకి తెచ్చింది. విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన 'రిమోట్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇకపై వైద్య విద్యార్థుల పరీక్షల తీరును వర్సిటీ నుంచే నేరుగా పర్యవేక్షించవచ్చని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 37 ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో జరిగే యూజీ, పీజీ మెడికల్ వార్షిక, సప్లిమెంటరీ పరీక్షలను సీసీ కెమెరాల ద్వారా ఈ సెంటర్‌కు అనుసంధానించినట్లు వెల్లడించారు. దీనివల్ల కాపీయింగ్, మాల్ ప్రాక్టీస్ వంటి ఘటనలకు ఏమాత్రం అవకాశం ఉండదని ఆయన స్పష్టం చేశారు.

70 రోజుల వరకు నిక్షిప్తం

ఈ సరికొత్త నిఘా వ్యవస్థ ద్వారా విద్యార్థుల ప్రతి కదలిక కమాండ్ కంట్రోల్ రూములోని కంప్యూటర్లలో నిక్షిప్తమవుతుంది. ఇక్కడ రికార్డ్ అయ్యే దృశ్యాలు 70 రోజుల పాటు భద్రంగా ఉంటాయని ఇందుకోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని మంత్రి వివరించారు. ప్రస్తుతం ఐదు వైద్య కళాశాలల్లో ఈ పర్యవేక్షణను ప్రారంభించామని త్వరలోనే ఎంబీబీఎస్‌తో పాటు డెంటల్, ఆయుర్వేద, హోమియో, నర్సింగ్ వంటి అన్ని కోర్సుల పరీక్షలను ఈ పరిధిలోకి తీసుకువస్తామన్నారు. ఏడాదికి సుమారు 60 వేల మంది విద్యార్థులు వివిధ పరీక్షలు రాస్తున్న నేపథ్యంలో ఈ వ్యవస్థ ద్వారా మానవ వనరుల వృధా తగ్గుతుందని పరీక్షల నిర్వహణలో పాల్గొనే సిబ్బంది మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తారని ఆయన పేర్కొన్నారు.

రిమోట్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా నిఘా

సాంకేతిక వివరాలను వెల్లడిస్తూ ప్రతి కళాశాలలో సగటున 25 సీసీ కెమెరాలు ఉంటాయని వర్సిటీలోని కంట్రోల్ రూములోని ఆరు స్క్రీన్ల వీడియో వాల్ ద్వారా వీటిని నిశితంగా పరిశీలిస్తామని మంత్రి తెలిపారు. ఒకవేళ ఎక్కడైనా సీసీ కెమెరాలు పనిచేయకపోయినా లేదా ఇంటర్నెట్ కనెక్షన్ కట్ అయినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా కంట్రోల్ రూముకు వెంటనే సమాచారం అందుతుందని పేర్కొన్నారు. గతంలో మాదిరిగా పరీక్షలు ముగిశాక కాలేజీలు హార్డ్ డిస్కులను వర్సిటీకి పంపాల్సిన అవసరం లేదని అంతా రియల్ టైమ్ మానిటరింగ్ ద్వారానే జరుగుతుందని వివరించారు. సుమారు రూ. 30 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని రెండేళ్ల పాటు నిర్వహించేందుకు రూ. 1.5 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వర్సిటీ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో విసి డాక్టర్ చంద్రశేఖర్, రిజిస్ట్రార్ రాధికారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వైద్య విద్య పరీక్షల తీరుపై మరింత నిఘా - Tholi Paluku