
వైద్య విద్యా వ్యవస్థలో భారత్ ముందడుగు : లాన్సెట్ నివేదిక
భారతదేశం తన ప్రజారోగ్య వ్యవస్థను పటిష్టం చేయడానికి అనుసరిస్తున్న వ్యూహాలు, వైద్య విద్యలో తీసుకొస్తున్న మార్పులు ఇప్పుడు ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నాయి. అంతర్జాతీయంగా పేరుగాంచిన వైద్య జర్నల్ ది లాన్సెట్'లో ప్రచురించబడిన ఒక వ్యాసం ఈ పరిణామాలను ప్రశంసించింది. చెన్నైలోని పణిమలర్ మెడికల్ కాలేజీకి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ కృష్ణ మోహన్ సూరపనేని రాసిన ఈ విశ్లేషణ దేశంలో వైద్య విద్య విస్తరణ వెనుక ఉన్న సామాజిక న్యాయం లక్ష్యాన్ని హైలైట్ చేసింది.
డాక్టర్ల తయారీలో రికార్డు: లక్ష్యం సామాజిక సేవే లక్ష్యం
ప్రస్తుతం భారతదేశం ప్రపంచంలోనే అత్యంత భారీ అండర్ గ్రాడ్యుయేట్ వైద్య విద్యా నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. దేశంలో 780 మెడికల్ కాలేజీలు ఉండగా, ప్రతి సంవత్సరం దాదాపు 1.18 లక్షల మంది వైద్య విద్యార్థులను చేర్చుకుంటున్నారు. ఈ గణనీయమైన పెరుగుదల కేవలం సంఖ్య పెరుగుదల కాదని, దేశ ఆరోగ్య సిబ్బందిని బలోపేతం చేసి, ప్రతి పౌరుడికి నాణ్యమైన వైద్యం అందేలా చేయాలనే జాతీయ వ్యూహానికి నిదర్శనం అని స్పష్టం అవుతుంది.
ప్రపంచ గుర్తింపు: ఎన్‌ఎంసీ కృషికి అద్దం
భారత వైద్య విద్య ప్రమాణాలను నియంత్రించే సంస్థ అయిన (నేషనల్ మెడికల్ కమిషన్) ఒక కీలక మైలురాయిని చేరుకుంది. 2023లో, వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్ నుండి ఎన్‌ఎంసీకి పదేళ్ల కాలానికి గుర్తింపు లభించింది. ఈ గ్లోబల్ గుర్తింపుతో భారతీయ డాక్టర్ల విద్య ప్రపంచ స్థాయికి చేరుకోవడం కాక ఇకపై మన డాక్టర్లు ప్రపంచవ్యాప్తంగా పోస్ట్-గ్రాడ్యుయేట్ కోర్సులు లేదా ఉద్యోగాలకు సులభంగా అర్హత సాధించవచ్చు.
పారదర్శకతకు పెద్ద పీట
డాక్టర్ కృష్ణ మోహన్ సూరపనేని వ్యాసంపై స్పందించిన ఎన్‌ఎంసీ చైర్‌పర్సన్ డాక్టర్ అభిజాత్ శేత్, డాక్టర్ సూరపనేని అందించిన సమతుల్య దృక్పథాన్ని ప్రశంసించారు. ప్రపంచ శాస్త్రీయ చర్చలలో వివిధ ఆరోగ్య వ్యవస్థల అభిప్రాయాలకు గౌరవం ఇచ్చేలా విద్య రంగాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి ఈ ఆర్టికల్ ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు.
అదేవిదంగా ఎన్‌ఎంసీ లేవనెత్తిన ఆందోళనలను చురుకుగా పరిష్కరిస్తూ, పారదర్శకత, జవాబుదారీతనాన్ని బలోపేతం చేయడానికి కమిషన్ కట్టుబడి ఉందని డాక్టర్ శేత్ పేర్కొన్నారు. నాణ్యతా ప్రమాణాలను స్థిరంగా ఉంచడానికి ఎన్‌ఎంసీ సమానమైన తనిఖీలు, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల వాడకం, నిబంధనలకు కట్టుబడి ఉన్న సంస్థల వివరాలను ప్రజా బహిరంగపరచడం వంటి కఠినమైన చర్యలను అమలు చేస్తోంది. భారత వైద్య విద్య నాణ్యత పట్ల నిబద్ధత చెక్కుచెదరకుండా ముందుకు సాగుతున్నామనే సందేశాన్ని ఆయన స్పష్టం చేశారు.
