Let's talk: editor@tmv.in
వైద్య నిర్లక్ష్యానికి పరాకాష్ట: శస్త్రచికిత్స చేసి శరీరంలోనే సర్జికల్ బ్లేడ్

వైద్య నిర్లక్ష్యానికి పరాకాష్ట: శస్త్రచికిత్స చేసి శరీరంలోనే సర్జికల్ బ్లేడ్

Panthagani Anusha
7 డిసెంబర్, 2025

ప్రాణాలు నిలబెట్టాల్సిన ప్రభుత్వ వైద్య వ్యవస్థ, నేడు వైద్య నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలుస్తోంది. రాష్ట్రంలో కేవలం రోజుల వ్యవధిలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన భయానక ఘటనలు ఆంధ్రప్రదేశ్ వైద్య రంగాన్ని కుదిపేశాయి. పల్నాడు జిల్లా నరసరావుపేటలో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకున్న మహిళ శరీరంలో, అదేవిదంగా తునిలో రోడ్డు ప్రమాద బాధితుడికి చేసిన ఆపరేషన్‌లోనూ సర్జికల్ బ్లేడ్లను లోపలే మర్చిపోవడం ఆందోళ కలిగిస్తుంది.

ఒకటి కాదు రెండు చోట్ల జరిగిన ఒకే తరహా తప్పిదాలు మెరుగైన వైద్య సేవ , ప్రభుత్వ ఆసుపత్రుల భద్రతా విధానాలపై తీవ్ర ప్రశ్నలు సంధిస్తున్నాయి. చికిత్స పేరుతో రోగుల ప్రాణాలకు ముప్పు తెచ్చే ఇలాంటి ఘటనలు పునరావృతం కావడంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

నరసరావుపేట బాలయ్యనగర్‌కు చెందిన 22 ఏళ్ల రమాదేవి అనే మహిళా నవంబర్ 26న కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. సివిల్ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ నారాయణ స్వామి ఆమెకు శస్త్రచికిత్స నిర్వహించారు.అయితే ఆపరేషన్ అనంతరం రమాదేవి కడుపునొప్పి వస్తుదని సిబ్బందికి కి తెలియజేయడంతో ఆసుపత్రి సిబ్బంది దానిని “సహజ నొప్పిగా కొట్టిపారేసి ఇంటికి పంపారు. అయితే నొప్పి ఏమాత్రం తగ్గకపోవడంతో, అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు ఆమెను తిరిగి ఆసుపత్రికి తీసుకురాగా స్కానింగ్‌లో షాకింగ్ నిజం బయటపడింది. ఆమె తొడ భాగంలో ఒక సర్జికల్ బ్లేడ్ ఉన్నట్లు స్పష్టమైంది.

ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఉచిత వైద్యం అందిస్తున్నామంటూనే ఆపరేషన్ కోసం సిబ్బంది రూ.2,500 వసూలు చేశారని వారు ఆరోపించారు.

ఈ ఘటనపై డాక్టర్ నారాయణ స్వామి స్పందిస్తూ ఆపరేషన్ చేసి వెంటనే మరో కేసుకు వెళ్లాల్సి వచ్చింది. బ్లేడ్ లోపల మిగిలి ఉండడం నా తప్పు కాదు. క్లీనింగ్ సిబ్బంది పొరపాటు” అని చెప్పడం ప్రజల ఆగ్రహాన్ని మరింత పెంచింది. దీనిపై ఆసుపత్రి ఇన్‌చార్జి “కడుపు ఆపరేషన్‌లో చేసిన బ్లేడ్ తొడలో ఎలా వచ్చిందో ఆశ్చర్యం” అని వ్యాఖ్యానించడం మరింత అనుమానాలకు తావిచ్చింది.మరోవైపు యువతి కుటుంబసభ్యులు తమకు న్యాయం చేయాలంటూ ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు.

ఇదిలా ఉండగా ఈ ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారణకు ఆదేశించడంతో, ఆరోగ్య శాఖ డాక్టర్ నారాయణ స్వామిని తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

తునిలో మరో ఘటన

కాకినాడ జిల్లా తుని ఏరియా ఆసుపత్రిలో మరో ఘోర నిర్లక్ష్యం వెలుగుచూసింది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ యువకుడికి ఆర్థోపెడిక్ వైద్యుడు డాక్టర్ సత్యసాగర్ శస్త్రచికిత్స చేశారు. ఆపరేషన్ తర్వాత బాధితుడు కూడా పదేపదే తీవ్ర నొప్పిగా ఉందని ఫిర్యాదు చేయడంతో, నిర్వహించిన ఎక్స్‌రేలో యువకుడి శరీరంలోనూ సర్జికల్ బ్లేడ్ మిగిలిపోయిన విషయం తేలింది.

ఈ ఘటనపై బాధితుడి కుటుంబం ఫిర్యాదు చేయగా, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. విచారణలో వైద్యుడు సత్యసాగర్, నర్సు పద్మావతి నిర్లక్ష్యం స్పష్టమవడంతో, వారిద్దరినీ తక్షణమే సస్పెండ్ చేస్తూ ఆరోగ్య శాఖ కఠిన చర్యలు తీసుకుంది.

ప్రజల్లో భయం... ఆరోగ్య వ్యవస్థపై ప్రశ్నలు

శస్త్రచికిత్సల అనంతరం వినియోగించిన పరికరాల తనిఖీ, భద్రతా విధానాలు పూర్తిగా వైద్య వ్యవస్థలో జరుగుతున్న నిర్లక్షానికి ఈ రెండు ఘటనలు స్పష్టం చేస్తున్నాయని “ప్రాణాలను కాపాడాల్సిన వైద్యులే ఇలా వ్యవహరిస్తే ప్రజలు ఎవరిని నమ్మాలి?” అనే ప్రశ్న ప్రజల నుంచి బలంగా వినిపిస్తోంది.

వైద్య నిర్లక్ష్యానికి పరాకాష్ట: శస్త్రచికిత్స చేసి శరీరంలోనే సర్జికల్ బ్లేడ్ - Tholi Paluku