Let's talk: editor@tmv.in
వైద్య కళాశాలల ప్రైవేటు పరం ఎందుకు?

వైద్య కళాశాలల ప్రైవేటు పరం ఎందుకు?

Dr.Chokka Lingam
10 అక్టోబర్, 2025

రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఎందుకు ప్రైవేటు పరం చేస్తున్నారని, ఎవరి స్వార్థం కోసం చేస్తున్నారని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం లో నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీ భవనాన్ని ఆయన గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీ నిర్మాణం చేస్తామని చెప్పిన సీఎం చంద్రబాబు పై ఆయన మండిపడ్డారు. పేదల ప్రజలకు ఆరోగ్యం బాగోలేకపోతే ఉత్తరాంధ్ర మొత్తంలో విశాఖ కేజీహెచ్ దిక్కుగా ఉందన్నారు. పేదలకు మంచి చేయాలనే ఉద్దేశంతో తాము 17 కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. నర్సీంపట్నం లోని మెడికల్ కాలేజీకి నిధులు విడుదల చేసి నిర్మాణం పూర్తి చేస్తే పేదలకు మంచి జరుగుతుందన్నారు.

ఉత్తరాంధ్రలో బ్రిటీష్ వారు కట్టిన కేజీహెచ్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి కట్టిన ప్రభుత్వం వైద్యశాల విమ్స్ మాత్రమే పేద ప్రజలకు అందుబాటులో ఉన్నాయని జగన్ వ్యాఖ్యానించారు. తాము అధికారంలో ఉన్న సమయంలో ఉత్తరాంధ్రలో నాలుగు మెడికల్ కాలేజీలు నిర్మించేందుకు శ్రీకారం చుట్టామన్నారు. ఈ కాలేజీలకు కూటమి ప్రభుత్వం నిధులు విడుదల చేసి నిర్మాణం పూర్తి చేసి ఉంటే ఇప్పటికే తరగతులు ప్రారంభమయ్యే వన్నారు. పేదలకు భవిష్యత్ లేని కార్యక్రమాలు చంద్రబాబు చేస్తున్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు. స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పై వైయస్ జగన్ విమర్శలు గుప్పించారు. అవగాహన లేకుండా అయిన పాత్రుడు తాము ప్రారంభించిన వైద్య కళాశాల నిర్మాణంపై అర్థం లేని విమర్శలు చేశారని ఆరోపించారు.

జగన్ కు బ్రహ్మరథం *

పోలీస్ ఆంక్షలు, నిర్బంధం మధ్య గురువారం ఉదయం విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న ప్రతిపక్ష నేత వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్కు విశాఖ అనకాపల్లి జిల్లాల ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అనకాపల్లి జిల్లా తాళ్లపాలెం పరిసర ప్రాంతాల్లో జోరు వానలో వేలాదిమంది జగన్కు స్వాగతం పలికారు. జగన్ కూడా వర్షంలో తడుస్తూ తను చూసేందుకు వచ్చిన ప్రజలకు అభివాదం చేశారు. పోలీసులు ఎక్కడికి అక్కడ వైసిపి నేతలు కార్యకర్తలను అడ్డుకున్నప్పటికీ భారీగా జనం తరలిరావడం చర్చనీయాంశంగా మారింది .

వైద్య కళాశాలల ప్రైవేటు పరం ఎందుకు? - Tholi Paluku