Let's talk: editor@tmv.in
వైద్యాశాఖలో 1,257 మంది ల్యాబ్ టెక్నీషియన్లకు నియామక పత్రాలు అందజేసిన మంత్రి దామోదర్

వైద్యాశాఖలో 1,257 మంది ల్యాబ్ టెక్నీషియన్లకు నియామక పత్రాలు అందజేసిన మంత్రి దామోదర్

Gaddamidi Naveen
14 జనవరి, 2026

తెలంగాణ వైద్యారోగ్య శాఖ చరిత్రలో మరో కీలక ఘట్టం నమోదైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం నిరుద్యోగుల ఆకాంక్షలను నెరవేరుస్తూ, ఒకేసారి 1,257 మంది ల్యాబ్ టెక్నీషియన్లకు (గ్రేడ్-2) నియామక పత్రాలను అందజేసింది. మంగళవారం కోటిలోని ఉస్మానియా మెడికల్ కాలేజీ గ్రౌండ్స్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్‌లతో కలిసి ఆయన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ, గతంలో ఎన్నడూ లేనంత వేగంగా ఈ నియామక ప్రక్రియను పూర్తి చేశామని తెలిపారు. 2024 సెప్టెంబర్ 11న నోటిఫికేషన్ విడుదల చేయగా, 2025 నవంబర్ నాటికి నియామక ప్రక్రియను పూర్తి చేయడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. మొత్తం 23,323 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకాగా, వారిలో 1,257 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారని చెప్పారు. వీరిలో డీఎంఈ పరిధిలో 764 మంది, డీపీహెచ్‌లో 300 మంది, టీవీవీపీలో 180 మంది, ఎంఎన్‌జేలో 13 మందికి పోస్టింగ్స్ ఇచ్చినట్లు వివరించారు.

ల్యాబ్ టెక్నీషియన్ల పాత్రను వివరిస్తూ మంత్రి మాట్లాడుతూ, ఒకప్పుడు రోగ లక్షణాల ఆధారంగా వైద్యం జరిగేదని, ప్రస్తుతం నిర్ధారణ తర్వాతే చికిత్స ప్రారంభమవుతోందని అన్నారు. ల్యాబ్ టెక్నీషియన్లు అందించే రిపోర్టులే వైద్యులకు ప్రామాణికమని, వైద్య వ్యవస్థకు వారు కళ్లు–చెవుల్లాంటి వారని పేర్కొన్నారు. అందువల్ల నివేదికల్లో కచ్చితత్వం అత్యంత అవసరమని, ఎన్ఏబీఎల్ ప్రమాణాలకు అనుగుణంగా ప్రభుత్వ ల్యాబ్‌లను అభివృద్ధి చేయాల్సిన బాధ్యతను టెక్నీషియన్లు స్వీకరించాలని సూచించారు.

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై మంత్రి కీలక ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం గత రెండేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 70 వేలకుపైగా ఉద్యోగాలను భర్తీ చేసిందని తెలిపారు. ఒక్క ఆరోగ్య శాఖలోనే ఇప్పటివరకు 9,572 పోస్టులు భర్తీ కాగా, మరో 7,267 పోస్టుల నియామక ప్రక్రియ చివరి దశలో ఉందన్నారు. ఆర్థిక శాఖ అనుమతి పొందిన మరో 996 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్లు విడుదల చేస్తామని, అదనంగా 2,344 పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు పంపామని వెల్లడించారు.

తెలంగాణను ఆరోగ్య రాష్ట్రంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. ఉస్మానియా ఆసుపత్రికి నూతన భవనం, ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంపు, ప్రతి జిల్లాలో ఎన్‌సీడీ క్లినిక్స్, క్యాన్సర్ డే కేర్ సెంటర్లు, ట్రాన్స్‌జెండర్ల కోసం మైత్రి క్లినిక్స్, గాంధీ ఆసుపత్రిలో ఉచిత ఐవీఎఫ్ సేవలు వంటి పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ను సెకండరీ హెల్త్ కేర్‌గా అభివృద్ధి చేస్తున్నామని, త్వరలోనే నూతన హెల్త్ పాలసీని రూపొందించి అమలు చేస్తామని మంత్రి చెప్పారు. ప్రజలకు సేవ చేసే అవకాశం ఉన్న ఆరోగ్య శాఖ బాధ్యతలు తనకు అప్పగించిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

ఉగాది నాటికి సనత్‌నగర్ టిమ్స్‌ ప్రారంభం

ఉగాది నాటికి సనత్‌నగర్‌లో ఏర్పాటు చేస్తున్న టిమ్స్ హాస్పిటల్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడించారు. సనత్‌నగర్ టిమ్స్ హాస్పిటల్ నిర్మాణ పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

హాస్పిటల్ బిల్డింగ్ నిర్మాణ పనులు దాదాపుగా పూర్తయ్యాయని తెలిపారు. కొంతమేర ఎలక్ట్రికల్ పనులు మాత్రమే మిగిలి ఉన్నాయని, అవి కూడా త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పారు. ఆపరేషన్ థియేటర్లు, డయాగ్నస్టిక్స్ విభాగాలు, ఇతర అవసరమైన మెడికల్ ఎక్విప్‌మెంట్ ఏర్పాటు చివరి దశకు చేరుకున్నాయని వెల్లడించారు. ఇప్పటికే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఎంఆర్‌ఐ వంటి భారీ యంత్రాల ఫిట్టింగ్ పూర్తయిందని తెలిపారు.

మాది ప్రచార ఆర్భాటం కాదు.. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్నదే మా లక్ష్యం అని మంత్రి స్పష్టం చేశారు. అన్ని విధాలుగా పూర్తి స్థాయి సౌకర్యాలతో ఉగాది నాటికి పేషెంట్లకు వైద్య సేవలు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. వెయ్యి పడకల సామర్థ్యంతో నిర్మిస్తున్న ఈ టిమ్స్ హాస్పిటల్‌లో అన్ని రకాల వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని మంత్రి తెలిపారు. గుండె సంబంధిత వ్యాధుల చికిత్సలకు ఇది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా నిలుస్తుందని, ఇక్కడే వైద్య పరిశోధనలు కూడా జరుగుతాయని చెప్పారు. అదేవిధంగా అత్యాధునిక ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సెంటర్‌ను కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నామని, అన్ని రకాల అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించేలా ఆపరేషన్ థియేటర్లను సిద్ధం చేస్తున్నామని మంత్రి దామోదర్ వెల్లడించారు.