
వైద్యచరిత్రలో అద్భుతం..22 వారాల శిశువు ప్రాణం నిలిపిన ఢిల్లీ వైద్య బృందం
వివాహమై చాలా సంవత్సరాలైనా సంతానం కలగపోవడంతో ఓ జంట ఐవీఎఫ్ సెంటర్ ను ఆశ్రయించారు. వారు మొదటి సారి ఐవీఎఫ్ చేయించుకున్నాక గర్భస్రావం అయ్యింది. ఇక్కడ వారికి నిరాశే ఎదురైంది. రెండో సారి మరొక సారి ప్రయత్నించారు. ఈసారి గర్భం నిలబడింది. కానీ పెరివయబుల్ స్టేజ్(జీవించే అవకాశాలు తక్కువ ఉండే దశ)లో పాప పుట్టింది. అంటే 22 వారాల్లోపే బిడ్డకు జన్మనిచ్చింది. బరువు 500 గ్రాములపై ఉండడం, పూర్తిగా నెలలు నిండకముందే పుట్టడంతో అందరూ నిరాశ చెందారు. అయితే ఆ ప్రైవేట్ ఆసుపత్రి వైద్యుడి అనుభవం, నర్సుల సేవలు, తల్లిదండ్రుల ఆశలు వెరసి 105 రోజుల పాటు కంటికి రెప్పలా కాపాడుకుంటూ పాపకు మరో రూపం ఇచ్చారు. వైద్య రంగంలో ఒక అద్భుతాన్ని చేరుకున్నారు. దీంతో వైద్యో నారాయణో హరి అని మరోసారి నిజం చేశారు.
వివరాలు ఇలా ఉన్నాయి..
వైద్య చరిత్రలోనే అరుదైన ఘట్టం ఢిల్లీలో చోటుచేసుకుంది. గర్భదశలో కేవలం 22 వారాల 5 రోజుల్లోనే జన్మించిన పాపకు వైద్యులు ఊపిరి పోశారు. పుట్టినప్పుడు బరువు కేవలం 525 గ్రాములే. కానీ వైద్యుల నిరంతర కృషితో ఇప్పుడు ఆ పాప బరువు 2.010 కిలోలకు చేరి, ఆరోగ్యంగా ఇంటికి చేరింది. వివరాల్లోకి వెళితే పట్పర్‌గంజ్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో సీనియర్ నియోనటాలజిస్టు డాక్టర్ జయ కిశోర్ నేతృత్వంలోని ఈ బృందం ఈ అద్భుతాన్ని సాధించింది. మొత్తం 105 రోజులపాటు ఎన్ఐసీయూలో నిరంతర పోరాటం తర్వాత ఆ చిన్నారి ప్రాణం నిలబడింది.
డాక్టర్ జయ కిశోర్ మాట్లాడుతూ ఇది వైద్య నైపుణ్యం, నర్సుల బృందం అంకితభావం, తల్లిదండ్రుల అచంచల విశ్వాసంతోనే సాధ్యమైంది. 22 వారాల వయసు ఉన్న శిశువు బతికే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కానీ మేం విడిచిపెట్టలేదు. శాస్త్రం, కరుణ కలిసి పనిచేస్తే అద్భుతాలు జరుగుతాయి అని అన్నారు. ఇది యంత్రాల గెలుపు కాదు, మానవ సంకల్పం గెలుపు. మా వైద్యులు, నర్సులు, తల్లిదండ్రులు అందరూ ఒక్కటై పోరాడారు. ఇది వారందరికీ విజయం.
తల్లిదండ్రులు చాలాకాలంగా ఇన్‌ఫర్టిలిటీతో బాధపడుతూ మొదటి ఐవీఎఫ్‌లో గర్భస్రావం ఎదుర్కొన్నారు. రెండోసారి ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చగా, 22వ వారంలోనే ప్రసవ వేదనలు మొదలయ్యాయి. పరిస్థితి తీవ్రమైనప్పటికీ, వైద్యుల సూచనతో పూర్తి ఇంటెన్సివ్ కేర్ ఇవ్వాలని నిర్ణయించాం.
ఒక చుక్క ఫార్మూలా పాలను వాడలేదు
పుట్టిన తర్వాత వెంటనే పాపకు శ్వాస నాళం ద్వారా ఆక్సిజన్ అందించి అత్యవసర చికిత్స ప్రారంభించాం. మూడవ రోజుకే తల్లి పాలను అందించాం. 10వ రోజుకే శిశువును వెంటిలేటర్ నుంచి బయటకు తేవడంలో మా బృందం విజయవంతమైంది. ఎన్ఐసీయూలో ఉన్న మొత్తం కాలంలో ఒక్క చుక్క ఫార్ములా పాలను కూడా వాడలేదని డాక్టర్ కిశోర్ తెలిపారు.
తల్లి పాలు, కంగారూ మదర్ కేర్, అభివృద్ధి సపోర్టివ్ కేర్ వంటి పద్ధతులు శిశువు ఎదుగుదలలో కీలకపాత్ర పోషించాయి. క్రానియల్ అల్ట్రాసౌండ్‌లు సాధారణంగా రావడం, కంటికి జోన్-2 ప్లస్ ఆర్‌ఓపీకి లేజర్ చికిత్స విజయవంతంగా పూర్తవడం వైద్యులను ఆనందపరిచాయి.
‘కంగారూ మదర్ కేర్’
చిన్నారికి ‘కంగారూ మదర్ కేర్’ పద్ధతిని ఉపయోగించారు. అంటే తల్లి తన బిడ్డను నేరుగా చర్మానికి చర్మం తగిలేలా ఛాతీపై ఉంచడం. ఇది బిడ్డ శరీర ఉష్ణోగ్రతను కాపాడి, శ్వాసను స్థిరంగా ఉంచి, తల్లి–బిడ్డ బంధాన్ని బలపరుస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ పద్ధతిని అత్యంత సమర్థవంతమైనదిగా గుర్తించింది.
అదే విధంగా, బిడ్డ ఎదుగుదల సహజంగా జరగాలనే ఉద్దేశంతో ‘అభివృద్ధి సపోర్టివ్ కేర్’ పద్ధతిని కూడా అమలు చేశారు. ఇది ధ్వని, వెలుగు, ఉష్ణోగ్రత వంటి పరిసరాలను నియంత్రించి గర్భంలో ఉన్నట్లుగా ప్రశాంత వాతావరణం కల్పించే పద్ధతి.
అరుదైన ఘట్టం – దేశంలోనే తొలిసారి
దేశంలో గతంలో 23–24 వారాల మధ్య పుట్టిన శిశువులు కొన్ని చోట్ల బతికినా, 22 వారాలు 5 రోజుల్లో పుట్టి సురక్షితంగా ఇంటికి చేరిన ఘటన మాత్రం ఇదే తొలిసారి.
2021లో చెన్నైలో 23 వారాల బిడ్డ, 2022లో ముంబైలో 24 వారాల శిశువు బతికిన ఉదాహరణలు ఉన్నా, ఇంత తక్కువ సమయంలో జన్మించి బతికిన కేసు భారత వైద్య చరిత్రలో అరుదైనది.
