Let's talk: editor@tmv.in
వైట్ హౌస్‌ వద్ద కాల్పులు.. ఉగ్ర చర్యేనన్న ట్రంప్‌

వైట్ హౌస్‌ వద్ద కాల్పులు.. ఉగ్ర చర్యేనన్న ట్రంప్‌

Shaik Mohammad Shaffee
28 నవంబర్, 2025

అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో వైట్‌హౌస్ సమీపంలో ఇద్దరు నేషనల్ గార్డ్ సైనికులపై జరిగిన కాల్పుల ఘటనపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఈ దాడిని ఆయన "భయంకరమైన దాడి”, "ఉగ్రవాద చర్య"గా అభివర్ణించారు. థాంక్స్ గివింగ్ పండుగకు ముందు రోజు ఈ ఘటన జరగడంతో దేశవ్యాప్తంగా కలకలం రేగింది. ఫెడరల్ ఏజెన్సీలు దీనిపై విచారణ కొనసాగిస్తున్నాయి.

ఆఫ్ఘన్ జాతీయుడి ప్రమేయం

దాడి చేసిన నిందితుడిని 29 ఏళ్ల రహ్మానుల్లా లకన్వాల్ అనే ఆఫ్ఘన్ జాతీయుడిగా అధికారులు గుర్తించారు. ఇతడు 2021లో అమెరికాకు వచ్చినట్లు తెలుస్తోంది. నిందితుడు ఒంటరిగానే ఈ దాడికి పాల్పడ్డాడని అధికారులు భావిస్తున్నారు.

విలేకరులతో మాట్లాడిన ట్రంప్, ఈ దాడికి మాజీ అధ్యక్షుడు జో బైడెన్ వలస విధానాలే కారణమని ఆరోపించారు. లకన్వాల్ 2021లో ఆఫ్ఘనిస్తాన్ నుండి అమెరికాలోకి వచ్చాడని ఆరోపిస్తూ, ఆ దేశాన్ని ఆయన "నరక కూపం"గా అభివర్ణించారు.

హేయమైన చర్య

కాల్పులు జరిగిన తీరును ట్రంప్ ఖండించారు. "థాంక్స్ గివింగ్ పండుగ సందర్భంగా, వైట్‌హౌస్‌కు కొద్ది అడుగుల దూరంలో ఇద్దరు వెస్ట్ వర్జీనియా నేషనల్ గార్డ్ సభ్యులపై అత్యంత సమీపం నుండి, మాటు వేసి దాడి చేశారు" అని ఆయన అన్నారు. ఈ "హేయమైన దాడి" చెడు చర్యగా, ద్వేషపూరిత చర్యగా, ఉగ్రవాద చర్యగా అభివర్ణించారు.

ఈ దాడి తమ దేశం మొత్తానికీ వ్యతిరేకంగా చేసిన నేరమని ట్రంప్ పేర్కొన్నారు. గాయపడిన సైనికులు, వారి కుటుంబాలకు అమెరికన్లందరి మద్దతు ఉంటుందని చెప్పారు. నిందితుడిని ఉద్దేశిస్తూ, ఈ దురాగతానికి పాల్పడిన జంతువుకి భారీ మూల్యం చెల్లించక తప్పదని ఆయన అన్నారు.

భద్రత కోసం అదనపు బలగాలు

ఈ ఘటన తమ దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద జాతీయ భద్రతా ముప్పును మరోసారి గుర్తుచేసిందని ట్రంప్ అన్నారు. గత పాలనలో 20 మిలియన్ల మంది తెలియని విదేశీయులను దేశంలోకి అనుమతించారని ఆరోపించారు. బైడెన్ హయాంలో వచ్చిన ప్రతి ఆఫ్ఘన్ పౌరుడి గురించి ఇప్పుడు తిరిగి పరిశీలించాలని ఆయన డిమాండ్ చేశారు. "మన దేశాన్ని ప్రేమించని లేదా మన దేశానికి ఏమాత్రం ఉపయోగపడని విదేశీయులు ఎవరైనా ఉంటే, వారిని వెంటనే తిప్పి పంపించాలి" అని స్పష్టం చేశారు.

అంతకుముందు, ట్రూత్ సోషల్ వేదికగా పోస్ట్ చేస్తూ, ఈ కాల్పుల తర్వాత వాషింగ్టన్ భద్రత కోసం అదనంగా 500 మంది గార్డ్ సిబ్బందిని మోహరించాలని ఆదేశించినట్లు ట్రంప్ తెలిపారు. దాడిలో ఇద్దరు గార్డ్ సైనికులు తీవ్రంగా గాయపడ్డారని, వారు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. నిందితుడు కూడా కాల్పుల్లో గాయపడ్డాడని తెలుస్తోంది.

అఫ్గాన్ల ఇమిగ్రేషన్‌ దరఖాస్తులు సస్పెండ్‌

ఇక, కాల్పుల నేపథ్యంలో యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) కీలక నిర్ణయం తీసుకుంది. వాషింగ్టన్ డీసీ కాల్పుల ఘటనలో నిందితుడు ఆఫ్ఘన్ వలసదారుడుగా తేలడంతో అఫ్గాన్ల ఇమిగ్రేషన్‌ దరఖాస్తులను తక్షణమే నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. దేశం, అమెరికన్ల భద్రతే తమకు అత్యంత ప్రాధాన్యమని యూఎస్‌సీఐఎస్ తెలియజేసింది.