
వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలు
అక్టోబర్ 21 మంగళవారం నాడు వైట్‌హౌస్‌లో జరిగిన దీపావళి వేడుకల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సందడిచేశారు. ట్రంప్ సాంప్రదాయ నూనె దీపం (దియా) వెలిగించి, దీపావళి పండుగ ప్రత్యేకత గురించి మాట్లాడారు. "చీకటిపై వెలుగు, అజ్ఞానంపై జ్ఞానం, చెడుపై మంచి" సాధించిన విజయం దీపావళి అంటూ భారతీయ సంప్రదాయాన్ని గౌరవిస్తూ మాట్లాడారు. ఈ దీపావళి వేడుకలను జరుపుకోవడానికి ట్రంప్ ఓవల్ ఆఫీస్‌లో భారతీయ అమెరికన్ వ్యాపార ప్రముఖులు, కమ్యూనిటీ నాయకులకు ఆతిథ్యం ఇచ్చారు. తరువాత ట్రంప్ భారతీయ, అమెరికన్ వ్యాపార ప్రముఖుల కృషిని ప్రశంసించారు. శంతను నారాయణ్ (అడోబ్), సంజయ్ మెహ్రోత్రా (మైక్రాన్), అరవింద్ కృష్ణ (ఐబిఎమ్ ) వంటి సిఇఓ లను ప్రస్తావిస్తూ, వారు "ప్రపంచంలోనే అతిపెద్ద" నాయకులని కొనియాడారు. ఈ కార్యక్రమానికి హాజరైన కాష్ పటేల్ (ఎఫ్ బి ఐ డైరెక్టర్) మాట్లాడుతూ తాను మొదటి తరం భారతీయ, అమెరికన్ అని, ట్రంప్ నాయకత్వంలో "మరింత మంది లక్షలాది మంది అమెరికన్లు" అమెరికన్ డ్రీమ్‌ను నెరవేర్చుకుంటున్నారని ప్రశంసించారు.
ఈ వేడుకకి అమెరికాలోని భారత రాయబారి, వినయ్ మోహన్ క్వాత్రా హాజరై, ప్రధానమంత్రి మోదీ తరపున దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ట్రంప్, ప్రధాని మోదీతో తన సంబంధాన్ని"చాలా మంచి సంబంధం"గా అభివర్ణించారు. మోదీని "గొప్ప వ్యక్తి" అని, "గొప్ప స్నేహితుడు" అని పేర్కొన్నారు.తాను మంగళవారం ఉదయమే ప్రధాని మోదీతో మాట్లాడానని, ప్రధానంగా ఇరువురం "వాణిజ్య ప్రపంచం" గురించి చర్చించామని, క్లుప్తంగా భారత-పాకిస్తాన్ సంబంధాల గురించి కూడా ప్రస్తావించామని ట్రంప్ తెలిపారు. అమెరికా, భారతదేశం "కొన్ని గొప్ప ఒప్పందాలపై" కలిసి పనిచేస్తున్నాయని అధ్యక్షుడు పేర్కొన్నారు.అలాగే ఈ వేడుకల్లోనే కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు కూడా ట్రంప్ చేశారు.
ముఖ్యంగా, అమెరికా, భారత సంబంధాలు, వాణిజ్యం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం భారతదేశ విధానాలపై ట్రంప్ చేసిన వివాదాస్పద ప్రకటనలు మళ్ళీ చర్చలకు దారితీసాయి. ట్రంప్ మాట్లాడుతూ, "తనలాగే ప్రధాని మోదీ కూడా యుద్ధం ముగియాలని కోరుకుంటున్నారని" ప్రకటించారు. భారతదేశం రష్యా నుండి చమురు కొనుగోళ్లను బాగా తగ్గించుకుందని, "ఎక్కువ చమురు కొనబోదని" పేర్కొన్నారు.
భారతీయ వస్తువులపై ట్రంప్ సుంకాన్ని రెట్టింపు చేయడంతో పాటు, భారతదేశం రష్యా చమురు కొనుగోలుకు సంబంధించి అదనంగా 25% డ్యూటీ విధించడం వల్ల ఇరు దేశాల సంబంధాలు తీవ్ర ఒత్తిడి కి లోనయ్యాయి. రష్యా చమురు కొనుగోళ్లను ఆపేందుకు ఎలాంటి హామీ ఇవ్వకుండా, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా భారతదేశం తన ఇంధన వనరులను విస్తృతం చేస్తోందని అమెరికా పేర్కొంది. అలాగే అమెరికా చర్యను అన్యాయమైన, సమర్థించలేని, అసంబద్ధమైనదిగా అప్పట్లో భారత్ అభివర్ణించింది. అయినప్పటికీ, రష్యా నుండి ముడి చమురు కొనుగోళ్లను మోడీ నిలిపివేస్తారని తనకు హామీ ఇచ్చారని ట్రంప్ బహిరంగంగా చెప్పడం . లేకపోతే భారతదేశం "భారీ సుంకాలు" ఎదుర్కోవలసి ఉంటుందని పదేపదే అనడం అమెరికా ద్వంద వైఖరిని తెలియజేస్తున్నాయి.
తెరపైకి భారత్-పాకిస్తాన్ సంబంధాలు
తాను ఇటీవల భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన సైనిక ఘర్షణను "పరిష్కరించడంలో సహాయం చేశానని" ట్రంప్ తరచుగా చేసే వివాదాస్పదమైన, వాదనను పునరావృతం చేశారు. వాణిజ్య చర్చను ఉపయోగించి తాను "పాకిస్థాన్‌తో యుద్ధాలు వద్దు" అని ఒత్తిడి చేయగలిగానని చెప్పారు. కాగా ఈ వాదనను భారతదేశం నిరంతరం తిరస్కరిస్తూనే ఉంది. పాకిస్థాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం ఆ రెండు దేశాల సైన్యాల మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్స్ మధ్య నేరుగా జరిగిన చర్చల ద్వారానే కుదిరిందని భారత్ ఇదివరకే స్పష్టం చేసింది.
ఏది ఏమైనా ఇప్పుడున్న భారత్, అమెరికా వాణిజ్య ఉద్రిక్తతల మద్య అమెరికా లోని భారతీయులను తనవైపు తిప్పుకోవడానికి ట్రంప్ భారతీయ సంప్రదాయాలను పాటిస్తూ ,దీపావళి సంబరాలను చేస్తూ భారత్, మోడీ మాకు స్నేహితులే అని చెప్పాలనుకుంటున్నాడా? లేదా భారత్ పై నిజమైన ప్రేమ కురిపిస్తున్నాడా? ఒకవైపు రష్యా చమురు కొనుగోలుకు సంబంధించి అదనంగా టారిఫ్ లు విధించి ఇప్పుడు ఉన్నపాటుగా సుంకాలు తగ్గించడం వెనుక కొత్త వ్యూహం వుందా అనే సందేహాలు ప్రపంచదేశాలు వెళ్ళబుచ్చుతున్నాయి. ఇవన్నీ ఎలావున్నా వైట్ హౌస్ లో దీపావళి సంబరాలు జరిపి మన సంస్కృతి ని ప్రపంచదేశాల ముందు గౌరవించడం మనకి గర్వకారణమే.
