
వైజాగ్‌లో రికార్డు స్థాయి పెట్టుబడులు: సీఐఐ సదస్సుకు ముందే భారీ ఒప్పందాలు
రాష్ట్రంలో పెట్టుబడుల పర్వం మొదలైంది. రేపు, ఎల్లుండి (నవంబర్ 14, 15) జరగనున్న ప్రతిష్టాత్మక 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సుకు ఒక్క రోజు ముందుగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రికార్డు స్థాయిలో ఒప్పందాలు కుదుర్చుకుంది. భాగస్వామ్య సదస్సుకంటే ముందు రోజు (నవంబర్ 13) ఏకంగా 35 సంస్థలతో రూ.3.65 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. వీటి ద్వారా రాష్ట్రంలో 1.26 లక్షల మందికి ఉపాధి లభించనుంది.
దేశీయ, అంతర్జాతీయ దిగ్గజాలతో భేటీ
సీఐఐ భాగస్వామ్య సదస్సులో పాల్గొనేందుకు విశాఖపట్నం వచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నవంబర్ 13న ఉదయం నుంచి దేశీయ,అంతర్జాతీయ పారిశ్రామిక దిగ్గజాలు, రాయబారులతో వరుసగా కీలక సమావేశాలు నిర్వహించారు. ఉదయం నోవోటెల్ హోటల్‌లో జరిగిన 'పార్ట్‌నర్స్ ఇన్ ప్రోగ్రెస్ ఇండియా-యూరప్ కోఆపరేషన్ ఫర్ సస్టైనబుల్ గ్రోత్' (సుస్థిర అభివృద్ధి కోసం భారతదేశం-యూరప్ సహకారం) అనే అంశంపై జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రీన్ షిఫ్ట్ (పర్యావరణ అనుకూల మార్పు) సుస్థిర ఆవిష్కరణలు, యూరోపియన్ పెట్టుబడుల గురించి పారిశ్రామిక ప్రతినిధులతో చర్చించారు. మధ్యాహ్నం తైవాన్, ఇటలీ, స్వీడన్, నెదర్లాండ్స్ దేశాల ప్రతినిధి బృందాలతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఎస్పీపీ పంప్స్ ఎండీ అలోక్ కిర్లోస్కర్, రెన్యూ పవర్ చైర్మన్ సుమిత్ సిన్హా, యాక్షన్ టెసా గ్రూప్ చైర్మన్ ఎన్.కె. అగర్వాల్, మురుగప్ప గ్రూప్ చైర్మన్ అరుణ్ అలగప్పన్, కోరమాండల్ ఇంటర్నేషనల్ ఎండీ శంకర్ సుబ్రహ్మణ్యన్, హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ చైర్మన్ రాహుల్ ముంజాల్ వంటి ప్రముఖ దేశీయ పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు.
ఇంధన రంగంలో భారీ పెట్టుబడులు
సీఎం చంద్రబాబు నాయుడుతో జరిగిన చర్చల అనంతరం రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన రంగంలో భారీ పెట్టుబడుల కోసం కీలక ఒప్పందాలు కుదిరాయి. ముఖ్యంగా రెన్యూ పవర్ సంస్థ (చైర్మన్ సుమంత్ సిన్హా) రూ. 82,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. గతంలో రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన ఈ సంస్థ, కూటమి ప్రభుత్వం హయాంలో తిరిగి భారీ పెట్టుబడులతో రావడం విశేషం. ఈ పెట్టుబడులలో 6 గిగావాట్ల ఇంగాట్-వేఫర్ ప్లాంట్, 2 గిగావాట్ల పంప్డ్ హైడ్రో ప్రాజెక్టు, 300 కేటీపిఏ గ్రీన్ అమ్మోనియా, 5 గిగావాట్ల హైబ్రీడ్ ప్రాజెక్టులు ఉన్నాయి. మరొక సంస్థ హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ కూడా రూ.15,000 కోట్ల వ్యయంతో అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలో 4 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ఒప్పందం చేసుకుంది. ఈ సందర్భంగా రెన్యూ పవర్ చైర్మన్ సుమంత్ సిన్హా మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడుల విషయంలో అత్యుత్తమ విధానాలు అనుసరిస్తోందని ప్రశంసించారు. అంతేకాక, భవిష్యత్తులో రాబోయే గూగుల్ డేటా సెంటర్‌కు అవసరమయ్యే విద్యుత్ డిమాండ్‌ను తీర్చడానికి తమ సంస్థ సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు.
తైవాన్ పెట్టుబడులు: ఇండస్ట్రియల్ క్లస్టర్
తైవాన్ ప్రతినిధి బృందం రాయబారి ముమిన్ చెన్ నేతృత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి రాష్ట్రంలో పలు కీలక పెట్టుబడి ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ ఒప్పందాల ప్రకారం అలీజియన్స్ గ్రూప్ కుప్పంలో రూ. 400 కోట్లతో ఇండో -తైవాన్ పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేయనుంది. అదే ప్రాంతంలో పౌ చెన్ గ్రూప్ పాదరక్షల (ఫుట్‌వేర్) తయారీ యూనిట్‌ను నెలకొల్పనుంది. ముఖ్యంగా ఇ-జౌల్ ఇండియా జాయింట్ వెంచర్ సంస్థ రూ. 19,000 కోట్లు (2.2 బిలియన్ డాలర్లు) భారీ పెట్టుబడితో 23 గిగావాట్ల సామర్థ్యం గల అడ్వాన్స్‌డ్ బ్యాటరీ తయారీ యూనిట్‌ను ఓర్వకల్లు సమీపంలో ఏర్పాటు చేయనుంది. దీనికి తోడు క్రియేటివ్ సెన్సార్ ఇంక్ సంస్థ కూడా ఓర్వకల్లులో ఇమేజ్ సెన్సార్ల ఉత్పత్తికి ఆసక్తి చూపింది.అయితే ఈ పెట్టుబడులకు పూర్తి సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా కంపెనీలకు భూములు కేటాయించడం, నైపుణ్యం గల మానవ వనరుల్ని సిద్ధం చేయడం, ఒక ప్రత్యేక తైవాన్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయడం వంటి అంశాలపై సానుకూలంగా స్పందించారు.
ఇతర కీలక ఒప్పందాలు, భేటీలు
వ్యాపార విస్తరణకు సంబంధించి పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. ప్రఖ్యాత ఎరువులు అగ్రి-ఇన్‌పుట్ సంస్థ కోరమాండల్ ఇంటర్నేషనల్ రూ.2,000 కోట్ల పెట్టుబడితో విశాఖపట్నం, కాకినాడలో ఉన్న తమ యూనిట్లను విస్తరించనుంది. దీనితో పాటుగా గ్రీన్ అమ్మోనియా-గ్రీన్ హైడ్రోజన్ తయారీ ప్రాజెక్టులపై ఈ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. మరో అంతర్జాతీయ సంస్థ స్వీడన్‌కు చెందిన జూల్ గ్రూప్ దాని వ్యవస్థాపక సీఈఓ టామ్ ఓలాండర్ ఆధ్వర్యంలో రామాయపట్నం వద్ద రూ.300 కోట్లతో అత్యాధునిక ఫర్నిచర్ తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో 500 ఎకరాల్లో ఫర్నిచర్ క్లస్టర్ సిటీ ఏర్పాటుచేసే అంశాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి వారికి సూచించారు. ఇక పాల్స్ ప్లష్ టాయ్స్ సంస్థ అధ్యక్షుడు అజయ్ సిన్హా నక్కపల్లి వద్ద టాయ్ పార్క్ ఏర్పాటు, స్థానిక మహిళలకు ఉపాధి కల్పనపై చర్చించారు. మరోవైపు ప్రముఖ ఫర్నిచర్ సంస్థ బాలాజీ యాక్షన్ బిల్డ్ వెల్ చైర్మన్ ఎన్.కె. అగర్వాల్ ముఖ్యమంత్రితో భేటీ అయ్యి రాష్ట్రంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ల నిర్వహణ కోసం రూ.1 కోటి విరాళాన్ని అందించారు.
నౌకాదళంతో సమన్వయం: నాలెడ్జ్, టూరిజం హబ్‌గా విశాఖ
విశాఖపట్నం పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఈస్ట్రన్ నావల్ కమాండ్ కమాండింగ్ ఇన్ చీఫ్ వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రక్షణ వ్యవస్థకు అవసరమైన సేవలను అందించే కంపెనీలు, స్టార్టప్‌లను రాష్ట్రానికి ఆహ్వానించడం, 'ఆత్మనిర్భర్ భారత్' (స్వయం సమృద్ధి భారత్) లక్ష్యాలకు అనుగుణంగా స్వదేశీ నౌకా నిర్మాణం వంటి అంశాలపై కీలక చర్చలు జరిగాయి. ముఖ్యమంత్రి తన దూరదృష్టిని వివరిస్తూ విశాఖపట్నాన్ని భవిష్యత్తులో నాలెడ్జ్ ఎకానమీ కేంద్రంగా మారుస్తున్నామని దీనికి నావికాదళం సహకారం అందించాలని కోరారు. అంతేకాకుండా విశాఖను అత్యుత్తమ టూరిజం సెంటర్‌గా తీర్చిదిద్దే ప్రణాళికల్లో భాగంగా, నావీ మ్యూజియం వంటివి ఏర్పాటు చేయడం ద్వారా యువతకు రక్షణ రంగంపై అవగాహన కల్పించాలని సూచించారు. నావికాదళం చేపట్టే వివిధ ప్రాజెక్టులకు అవసరమైన భూమిని ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం వైస్ అడ్మిరల్‌కు తెలిపారు. మొత్తంగా 30వ సీఐఐ సదస్సు ప్రారంభానికి ముందే రూ. 3.65 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పారిశ్రామిక రంగానికి అనుకూలమైన విధానాలను అమలు చేస్తోందని స్పష్టమైంది.
