
వైకుంఠ ద్వార దర్శనం కోసం ఆఫ్లైన్ టోకెన్లు రద్దు చేసిన టీటీడీ
తిరుమల వేంకటేశ్వరస్వామి వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించిన ఏర్పాట్లలో ఈసారి టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. గతంలో భక్తులు ఆఫ్లైన్ టికెట్ల కోసం పెద్ద ఎత్తున క్యూలైన్లలో నిల్చోవడం, తొక్కిసలాట జరగడం వంటి సమస్యలు ఎదురైన నేపథ్యంలో ఈసారి పూర్తిగా ఆన్‌లైన్ వ్యవస్థకే ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. తిరుమలలో డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు జరగబోయే వైకుంఠ ద్వార దర్శనానికి టోకెన్లు కేవలం ఆన్‌లైన్ ద్వారా మాత్రమే జారీ కానున్నాయి.
గత ఏడాది తిరుపతిలోని బైరాగిపట్టేడలో ఎంజీఎం స్కూల్ వద్ద ఆఫ్లైన్ టోకెన్ల కోసం భారీగా చేరిన భక్తుల్లో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 40 మంది గాయపడ్డారు. 2024 జనవరి 8న జరిగిన ఈ సంఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఇలాంటి విషాదకర పరిస్థితులు మళ్ళీ పునరావృతం కాకుండా ముందస్తు భద్రతా చర్యగా ఈసారి టీటీడీ ఆఫ్లైన్ టోకెన్ల విధానాన్ని పూర్తిగా రద్దు చేసింది.
టిటిడి వెల్లడించిన వివరాల ప్రకారం వైకుంఠ ద్వార దర్శనం కోసం పది రోజులలో మొత్తం 8 లక్షల మంది భక్తులకు దర్శనం కల్పించగలుగుతామని తెలిపింది. మొత్తం 182 గంటల దర్శన సమయంలో 164 గంటలను పూర్తిగా సాధారణ భక్తులకు కేటాయించనున్నారు. భక్తులకు సమాన అవకాశాలు లభించేందుకు ఆఫ్లైన్ టోకెన్లు లేకుండా కేవలం ఆన్‌లైన్ బుకింగ్ ద్వారా మాత్రమే ప్రవేశం ఉండనుంది.
సాధారణ భక్తులకు మరింత ప్రాధాన్యం ఇవ్వడానికి డిసెంబర్ 30, 31 జనవరి 1 తేదీల్లో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవాణి దర్శనం టికెట్లను రద్దు చేశారు. అయితే జనవరి 2 నుంచి జనవరి 8 వరకు ప్రతిరోజూ 15,000 రూ.300 దర్శనం టికెట్లు, 1,000 శ్రీవాణి దర్శన టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి.
ఈసారి టోకెన్ల కేటాయింపులో ఈ–డిప్ విధానాన్ని అమలు చేస్తున్నారు. నవంబర్ 27 నుంచి డిసెంబర్ 1 వరకు భక్తులు ఈ–డిప్ కోసం నమోదు చేసుకోవచ్చు. డిసెంబర్ 2న లాటరీ పద్ధతిలో ఎంపిక చేసిన వారికి దర్శన టోకెన్లు జారీ చేస్తారు. ఈ టోకెన్లు టీటీడీ అధికారిక వెబ్‌సైట్, మొబైల్ యాప్,వాట్సాప్ ద్వారా అందుబాటులో ఉంటాయి.
తిరుపతి–తిరుమల స్థానికుల కోసం ప్రత్యేక కోటాను టీటీడీ ఏర్పాటు చేసింది. జనవరి 6, 7, 8 తేదీల్లో ప్రతిరోజూ 5,000 టోకెన్లు ‘ఫస్ట్ కమ్–ఫస్ట్ సర్వ్’ విధానంలో ఆన్‌లైన్ ద్వారా ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది.
ఇదిలాఉండగా, పరకమణి (హుండీ నగదు లెక్కింపు కేంద్రం) దొంగతనం కేసులో దోషులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, ఆ విషయంలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది. టీటీడీ అమరావతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రెండో ప్రాకారం నిర్మాణానికి నవంబర్ 27న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసే విషయాన్ని బోర్డు ప్రకటించింది.
బైరాగిపట్టేడ తొక్కిసలాట
గత సంవత్సరం వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుపతిలోని బైరాగిపట్టేడలో ఆఫ్లైన్ టోకెన్ల పంపిణీ సందర్భంగా తీవ్రమైన తొక్కిసలాట జరిగి రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. టోకెన్ల పంపిణీ ప్రారంభమయ్యే సమయానికి వేలాది మంది భక్తులు క్యూలైన్ల నుంచి ఒక్కసారిగా ముందుకు దూసుకురావడంతో ఈ ప్రమాదం జరిగింది. సరైన క్యూ నియంత్రణ, పోలీసు బందోబస్తు లేకపోవడమే ఈ దుర్ఘటనకు దారితీసింది. ఈ విషాదంలో ఆరుగురు భక్తులు మృతి చెందగా, ముప్పై మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనపై విస్తృత విచారణ జరిపి, బాధ్యతారహితంగా వ్యవహరించిన సిబ్బందిపై చర్యలు తీసుకున్నారు. ఈ అనుభవం కారణంగానే టీటీడీ ప్రస్తుతం ఆఫ్లైన్ టోకెన్లను పూర్తిగా రద్దు చేసింది.
