Let's talk: editor@tmv.in
వైఎస్సార్ ఆశయాలకు జగన్ తూట్లు: షర్మిల

వైఎస్సార్ ఆశయాలకు జగన్ తూట్లు: షర్మిల

Panthagani Anusha
10 ఏప్రిల్, 2026

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తనయురాలు, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సామాజిక మాధ్యమాల వేదికగా గత ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాగా దాదాపు 23 ఏళ్ల క్రితం ఏప్రిల్ 9న వైఎస్సార్ చేపట్టిన పాదయాత్ర కు సంబంధించి జగన్ చేసిన పోస్ట్ కు తీవ్ర స్థాయిలో విమర్శించారు. ప్రజాక్షేత్రంలో వైఎస్సార్ చూపిన బాట వేరని గత పాలనలో జరింగింది వేరని ఆమె ఎద్దేవా చేశారు.

ఆశయాలకు తిలోదకాలు

దాదాపు 23 ఏళ్ల క్రితం ఏప్రిల్ 9న పేదలు, దళితులు, మైనారిటీలు, మహిళల సంక్షేమం కోసమే వైఎస్సార్ పాదయాత్ర చేపట్టారని షర్మిల గుర్తు చేశారు. అప్పట్లో ఆయన అణగారిన వర్గాల గొంతుకగా నిలిచారని కానీ ఆయన పేరు చెప్పుకుని అధికారంలోకి వచ్చిన వారు అవే వర్గాలను విస్మరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఫాసిస్టు శక్తులకు తలవంచడం వ్యక్తిగత ప్రయోజనాల కోసం కేంద్రం వద్ద మోకరించడం కేసుల భయంతో ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడం వైఎస్సార్ ఆదర్శాలకు పూర్తి విరుద్ధమని ఆమె మండిపడ్డారు.

రాజన్న ఆత్మ క్షోభిస్తోంది

గడిచిన ఐదేళ్ల పాలనలో దళితులు, మైనారిటీలు మహిళలపై జరుగుతున్న దాడులు, అక్రమాలను ప్రస్తావిస్తూ షర్మిల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అరాచక శక్తులు రెచ్చిపోతుంటే ప్రభుత్వం మౌనంగా ఉండటం గమనిస్తుంటే రాజశేఖర రెడ్డి గారి ఆత్మ క్షోభిస్తుందని ఆమె పేర్కొన్నారు. సంక్షేమ రాజ్యాన్ని స్థాపిస్తామని చెప్పి క్షేత్రస్థాయిలో హింసను ప్రేరేపించడం వైఎస్సార్ వారసత్వం అనిపించుకోదని విమర్శించారు.

పాదయాత్ర కాదు.. ఆత్మవిమర్శ యాత్ర అవసరం

ప్రస్తుత తరుణంలో ప్రభుత్వానికి కావాల్సింది పాదయాత్రలు కాదని తాము చేసిన తప్పులను సరిదిద్దుకోవడానికి ‘ఆత్మవిమర్శ యాత్ర’ అవసరమని షర్మిల సూచించారు. రాజన్న రాజ్యం అంటే కేవలం పథకాల పేర్లు మార్చడం కాదని ఆయన చూపిన ధైర్యం, చిత్తశుద్ధిని ప్రదర్శించడమేనని ఆమె స్పష్టం చేశారు.