
'వేస్ట్-టు-వెల్త్' దిశగా భారత్ అడుగులు
భారతదేశం వంటి వ్యవసాయాధారిత దేశంలో, పెరుగుతున్న వ్యర్థాల ఉత్పత్తి ఒక పర్యావరణ సవాలుగా మాత్రమే కాకుండా, ఒక గొప్ప ఆర్థిక అవకాశంగా కూడా మారుతోంది. ఏటా ఉత్పత్తి అవుతున్న సుమారు 350 మిలియన్ టన్నుల వ్యవసాయ వ్యర్థాలు, పంట అవశేషాలు, పశువుల వ్యర్ధాలను కేవలం చెత్తగా చూడకుండా, వాటిని విలువైన వనరులుగా మార్చడమే ఈ "వృత్తాకార ఆర్థిక వ్యవస్థ" (సర్క్యులర్ ఏకానమి) యొక్క ప్రధాన లక్ష్యం. ప్రభుత్వం చేపట్టిన గోబర్ధన్, పంట వ్యర్థాల నిర్వహణ, వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి వంటి వినూత్న పథకాలు నేడు పల్లెల్లో కొత్త విప్లవాన్ని తీసుకువస్తున్నాయి. వ్యర్థాలను తగులబెట్టడం వల్ల కలిగే కాలుష్యాన్ని తగ్గించి, వాటి ద్వారా బయోగ్యాస్, విద్యుత్తు, సేంద్రియ ఎరువులను ఉత్పత్తి చేయడం ద్వారా అటు పర్యావరణాన్ని కాపాడుతూనే, ఇటు రైతులకు అదనపు ఆదాయాన్ని, ఉపాధి అవకాశాలను ఈ పథకాలు కల్పిస్తున్నాయి. ఇది కేవలం వ్యర్థాల నిర్వహణ మాత్రమే కాదు, భారతదేశాన్ని స్వయంసమృద్ధి, సుస్థిర అభివృద్ధి వైపు నడిపించే ఒక శక్తివంతమైన ప్రయాణం.
పర్యావరణ సవాలు నుండి ఆర్థిక అవకాశం వరకు
భారతదేశం ఒక వ్యవసాయ ప్రధాన దేశం. కోట్లాది మందికి ఆహారాన్ని అందించే ఈ రంగం, అదే స్థాయిలో వ్యర్థాలను కూడా ఉత్పత్తి చేస్తోంది. గతంలో ఈ వ్యర్థాలను ఒక భారంగా భావించేవారు, కానీ నేడు సాంకేతికత, ప్రభుత్వ విధానాల వల్ల ఇవి 'బంగారం'గా మారుతున్నాయి. ఏటా ఉత్పత్తి అవుతున్న సుమారు 350 మిలియన్ టన్నుల వ్యవసాయ వ్యర్థాలు కేవలం చెత్త కాదు, అవి మన దేశ ఇంధన, ఆర్థిక అవసరాలను తీర్చే ముడి సరుకులుగా మారుతున్నాయి. ఈ వ్యర్థాలను సరైన పద్ధతిలో నిర్వహిస్తే, అటు పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు ఇటు భారీ ఎత్తున సంపదను సృష్టించవచ్చు.
భారతదేశంలో వరి, గోధుమ, చెరకు, ఇతర పంటల ద్వారా వచ్చే గడ్డి, ఊక, పంట వ్యర్థాలు లాంటివి ప్రధాన వ్యర్థాలు. వీటిని పొలాల్లోనే తగులబెట్టడం వల్ల గాలిలో కార్బన్ మోనాక్సైడ్, మీథేన్ వంటి విష వాయువులు కలిసిపోతున్నాయి. దీనివల్ల ఢిల్లీ వంటి నగరాల్లో శీతాకాలంలో తీవ్రమైన కాలుష్యం ఏర్పడుతోంది. కేవలం గాలి మాత్రమే కాదు, నేల లోని సూక్ష్మజీవులు నశించి భూమి నిస్సారమవుతోంది. ఈ సవాలును అధిగమించడమే మన ముందున్న తక్షణ కర్తవ్యం.
వృత్తాకార ఆర్థిక వ్యవస్థ: ఒక నూతన విప్లవం
వృత్తాకార ఆర్థిక వ్యవస్థ అంటే ఒక వస్తువును వాడి పారేయడం కాకుండా, దానిని తిరిగి పునర్వినియోగించడం. దీనిని 6ఆర్ లు, (రిడ్యూస్, రీయూజ్, రీసైకిల్, రిఫర్బిష్, రికవర్, రిపేర్) సూత్రంపై నిర్మించారు. ప్రకృతిలో ఏదీ వృధా కాదు, ఒక జీవి విసర్జితం మరొక దానికి ఆహారం అవుతుంది. ఇదే సూత్రాన్ని వ్యవసాయంలో పాటిస్తే, పంట వ్యర్థాలు ఎరువులుగా మారి మళ్లీ పంటలకే బలాన్ని ఇస్తాయి. 2050 నాటికి ఈ రంగం భారతదేశంలో 2 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువను కలిగి ఉంటుందని అంచనా.
గోబర్ధన్: పల్లెల్లో ఇంధన విప్లవం
"గాల్వనైజింగ్ ఆర్గానిక్ బయో-ఆగ్రో రిసోర్సెస్ ధన్" పథకాన్ని భారత ప్రభుత్వం ఏప్రిల్ 30, 2018న స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ) ఫేజ్-2లో భాగంగా ప్రారంభించింది. దీనిని హర్యానాలోని కర్నాల్ జిల్లాలో మొట్టమొదటిసారిగా ప్రయోగాత్మకంగా మొదలుపెట్టారు. పల్లెల్లో పేరుకుపోయే పశువుల పేడ, వ్యవసాయ వ్యర్థాలను సేకరించి వాటిని బయోగ్యాస్ సేంద్రియ ఎరువులుగా మార్చడం ద్వారా గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు రైతులకు ఆదాయాన్ని చేకూర్చడం ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం. ఇది గ్రామీణ ప్రాంతాల్లో వంట గ్యాస్ కొరతను తీరుస్తూ, ఇంధన రంగంలో స్వయం సమృద్ధికి బాటలు వేసింది.
ప్రస్తుతం ఈ పథకం దేశవ్యాప్తంగా అద్భుతమైన వృద్ధిని సాధిస్తోంది. తాజా గణాంకాల ప్రకారం, దేశంలోని 51.4శాతం జిల్లాల్లో ఈ పథకం విస్తరించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు 979 బయోగ్యాస్ ప్లాంట్లు విజయవంతంగా పనిచేస్తున్నాయి. ప్రభుత్వం 2023లో ప్రవేశపెట్టిన 'యూనిఫైడ్ గోబర్ధన్ పోర్టల్' ద్వారా పారదర్శకత పెరిగింది. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఆసియాలోనే అతిపెద్ద మున్సిపల్ వ్యర్థాల ఆధారిత బయో-సిఎన్‌జి ప్లాంట్‌ను ఏర్పాటు చేయడం ఈ పథకంలో ఒక మైలురాయి. ప్రభుత్వం ఇప్పుడు 500 కొత్త 'వేస్ట్-టు-వెల్త్' ప్లాంట్ల ఏర్పాటు లక్ష్యంగా ముందుకు సాగుతోంది, ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తూ పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతోంది. ఇది రైతులకు వంట గ్యాస్ అందించడమే కాకుండా, మిగిలిన స్లర్రీని నాణ్యమైన సేంద్రియ ఎరువుగా వాడుకునేలా చేస్తోంది. దీనివల్ల రసాయన ఎరువులపై ఆధారపడటం తగ్గి, సాగు ఖర్చు తగ్గుతోంది.
పంట వ్యర్థాల నిర్వహణ, సాంకేతిక పరిష్కారాలు
పంట వ్యర్థాలను తగులబెట్టకుండా అరికట్టడానికి ప్రభుత్వం భారీ నిధులను (సుమారు రూ. 3,926 కోట్లు) కేటాయించింది. ముఖ్యంగా పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో 'కస్టమ్ హైరింగ్ సెంటర్ల' ద్వారా రైతులకు ఆధునిక యంత్రాలను అందిస్తున్నారు. ఈ యంత్రాలు గడ్డిని నేలలోనే కలిపి వేస్తాయి, లేదా బయటకు తీసి పారిశ్రామిక అవసరాలకు పంపిస్తాయి. ఇది భూసారాన్ని పెంచడంలో అద్భుతంగా పనిచేస్తోంది.
బయోచార్ : నేల ఆరోగ్యాన్ని కాపాడే అద్భుతం
ఆహార వ్యర్థాలు, పంట వ్యర్థాలను తక్కువ ఆక్సిజన్ ఉన్న చోట వేడి చేయడం ద్వారా 'బయోచార్' తయారు చేస్తారు. గృహాలు, మార్కెట్లలో వృధా అయ్యే ఆహారం మిథేన్ వంటి గ్రీన్ హౌస్ వాయువులను విడుదల చేస్తుంది. వీటిని బయోచార్ వంటి ఉపయోగకరమైన పదార్థాలుగా మార్చవచ్చు.
ఇది బొగ్గు లాంటి పదార్థం, కానీ నేలలో కలిపినప్పుడు నీటిని నిల్వ ఉంచుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది. ఇది కార్బన్‌ను నేలలోనే నిక్షిప్తం చేయడం ద్వారా గ్లోబల్ వార్మింగ్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇంజనీర్డ్ బయోచార్ ద్వారా నేల లోని విషతుల్యాలను తొలగించడం ఇప్పుడు సాధ్యమవుతోంది.
వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి
వ్యవసాయ రంగంలో మౌలిక వసతులు కల్పించడానికి రూ.15,000 కోట్ల నిధితో ఏఐఫ్ కీలక పాత్ర పోషిస్తోంది. కోల్డ్ స్టోరేజీలు, గ్రేడింగ్ యూనిట్లు, ప్రాసెసింగ్ సెంటర్ల ఏర్పాటు వల్ల పంట కోత తర్వాత జరిగే నష్టాలను అరికట్టవచ్చు. దీనివల్ల రైతులు తమ ఉత్పత్తులను ఎక్కువ కాలం నిల్వ ఉంచుకుని, మంచి ధర ఉన్నప్పుడు అమ్ముకునే వీలు కలుగుతుంది. 2025 నాటికి ఈ నిధి ద్వారా వేలాది ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తయ్యాయి.
కేవలం పంటలే కాకుండా, పశుసంవర్ధక రంగం నుండి వచ్చే వ్యర్థాలు కూడా సంపదగా మారుతున్నాయి. పశుసంవర్ధక రంగంలో వ్యర్థాల నిర్వహణ ద్వారా పశువుల మేత తయారీ మృత పశువుల భాగాలను (ఎముకలు, కొమ్ములు) శాస్త్రీయంగా ప్రాసెస్ చేసి పారిశ్రామిక ఉత్పత్తులుగా మార్చుతున్నారు. ఇది పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, పశుపోషకులకు అదనపు ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లో "వ్యర్థాల నుండి సంపద"సృష్టి
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో అమల్లో ఉన్న 'క్లీన్ ఆంధ్రప్రదేశ్' కార్యక్రమాన్ని మరింత ఆధునీకరించి, వ్యర్ధాల నుండి ఆదాయాన్ని ఆర్జించేలా పురపాలక శాఖను ఆదేశించారు. ముఖ్యంగా నగరాల్లో సేకరించిన వ్యర్థాలను విభజించి, వాటి ద్వారా విద్యుత్ సేంద్రియ ఎరువుల తయారీకి పెద్దపీట వేస్తున్నారు.
పర్యావరణ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్, రాష్ట్రంలోని పరిశ్రమల నుండి వచ్చే ప్రమాదకర వ్యర్థాల నిర్వహణకు కఠినమైన నిబంధనలను అమలు చేస్తున్నారు. విశాఖపట్నం వంటి నగరాల్లో అత్యాధునిక 'రీసైక్లింగ్ పార్కులు' ఏర్పాటు చేయాలని, తద్వారా పర్యావరణాన్ని కాపాడుతూనే యువతకు ఉపాధి కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్, గ్రామాల్లో పారిశుద్ధ్య మెరుగుదలకు 'గోబర్ధన్' వంటి కేంద్ర పథకాలను రాష్ట్ర పథకాలతో అనుసంధానం చేస్తున్నారు. గ్రామాల్లో ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాలను పునరుద్ధరించి, పశువుల పేడ, పంట వ్యర్థాల నుండి బయోగ్యాస్ ఉత్పత్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. చంద్రబాబు నాయుడు తన 'విజన్ 2047'లో భాగంగా వృత్తాకార ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహిస్తూ, నీటి శుద్ధి కేంద్రాల ద్వారా వచ్చే నీటిని పరిశ్రమలకు, సాగుకు పునర్వినియోగించేలా నూతన జల విధానాన్ని రూపొందించారు.
ఆంధ్రప్రదేశ్‌లో మొట్టమొదటి వ్యర్థాల ఆధారిత విద్యుత్ కేంద్రం గుంటూరు జిల్లాలోని నాయుడుపేట (నాయుడుపాలెం) వద్ద ఏర్పాటు చేయబడింది. దీనిని జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్‌మెంట్ సంస్థ సహకారంతో నిర్మించారు. ఈ ప్లాంట్ ప్రతిరోజూ సుమారు 1,200 టన్నుల మున్సిపల్ ఘన వ్యర్థాలను ప్రాసెస్ చేసి, 15 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. గుంటూరు, విజయవాడ నగరాలతో పాటు చుట్టుపక్కల ఉన్న ఎనిమిది మున్సిపాలిటీల నుండి సేకరించిన చెత్తను ఇక్కడకు తరలించి, పర్యావరణహితంగా విద్యుత్తును తయారు చేస్తున్నారు.
తూర్పుగోదావరి జిల్లాలో ప్రధానమైన వ్యర్థాల నిర్వహణ ప్లాంట్ రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలోని ధవళేశ్వరం (పిచ్చుకల లంక) వద్ద ఉంది. ఇక్కడ నగరంలో సేకరించిన తడి, పొడి చెత్తను వేరు చేసి, తడి చెత్త నుండి నాణ్యమైన సేంద్రియ ఎరువును తయారు చేస్తున్నారు. దీనిని స్థానిక రైతులకు అందుబాటులో ఉంచడం ద్వారా రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే, పొడి చెత్తను (ప్లాస్టిక్, పేపర్ వంటివి) రీసైక్లింగ్ యూనిట్లకు పంపి ఆదాయం సమకూర్చుకుంటున్నారు.
ఇటీవల అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ “చెత్త నుండి సంపద" నమూనాను రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తోంది. దీనిలో భాగంగా రిలయన్స్ బయో-ఎనర్జీ సంస్థతో కలిసి ప్రకాశం జిల్లా కనిగిరి వద్ద భారీ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్‌కు శ్రీకారం చుట్టారు. ఇది ఆసియాలోనే అతిపెద్ద బయోగ్యాస్ ప్లాంట్లలో ఒకటిగా నిలవనుంది. కేవలం పట్టణాల్లోనే కాకుండా, గ్రామాల్లో కూడా చెత్తను వేరుచేసి ఆదాయం సృష్టించేలా పంచాయతీ రాజ్ శాఖ ద్వారా పారిశుద్ధ్య విప్లవానికి ప్రణాళికలు సిద్ధం చేసింది.
తెలంగాణ రాష్ట్రంలో కూడా "వ్యర్థాల నుండి సంపద" హైదరాబాద్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో మొదలయ్యింది.
హైదరాబాద్ - జవహర్‌నగర్ వేస్ట్-టు-ఎనర్జీ ప్లాంట్:
తెలంగాణలో అతిపెద్ద, ప్రధానమైన ప్రాజెక్టు మేడ్చల్ జిల్లాలోని జవహర్‌నగర్లో ఉంది. ఇది దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద 'వేస్ట్-టు-ఎనర్జీ' ప్లాంట్లలో ఒకటి. ఇక్కడ ప్రతిరోజూ వేల టన్నుల నగర వ్యర్థాలను ప్రాసెస్ చేసి సుమారు 24 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు. దీని సామర్థ్యాన్ని మరో 24 మెగావాట్లకు (మొత్తం 48 మెగావాట్లు) పెంచే పనులు కూడా జరుగుతున్నాయి. హైదరాబాద్ నగరం నుండి వచ్చే దాదాపు 7,000 టన్నుల చెత్తను శాస్త్రీయంగా నిర్వీర్యం చేయడానికి ఇది ప్రధాన వనరు.
గోబర్ధన్, కంప్రెస్డ్ బయోగ్యాస్ :
తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో 'గోబర్ధన్' పథకం ద్వారా పశువుల పేడను ఇంధనంగా మారుస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ సమీపంలోని బీబీనగర్, ఇతర ప్రాంతాల్లో ప్రైవేట్ భాగస్వామ్యంతో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు అవుతున్నాయి. అంతేకాకుండా, సిద్దిపేట వంటి మోడల్ పట్టణాల్లో తడి చెత్త నుండి నాణ్యమైన కంపోస్ట్ (ఎరువు) తయారు చేసి మున్సిపాలిటీలకు ఆదాయం వచ్చేలా చేస్తున్నారు. సిద్దిపేటలోని "స్వచ్ఛ బడి" ద్వారా వ్యర్థాల నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచింది.
రాష్ట్రంలోని వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ వంటి నగరాల్లో కూడా చిన్న తరహా వ్యర్థాల నిర్వహణ యూనిట్లు ఉన్నాయి. ప్రభుత్వం ప్రతి మున్సిపాలిటీలో 'డ్రై వేస్ట్ మేనేజ్మెంట్ సెంటర్స్' ఏర్పాటు చేసి, ప్లాస్టిక్, గాజు వంటి పదార్థాలను విక్రయించడం ద్వారా కార్మికులకు ఉపాధి కల్పిస్తోంది.
నీటి నిర్వహణ, జలశక్తి మిషన్
వ్యవసాయంలో నీటి వ్యర్థాలను అరికట్టడం కూడా వృత్తాకార ఆర్థిక వ్యవస్థలో భాగమే. పరిశ్రమలు, గృహాల నుండి వచ్చే మురుగునీటిని శుద్ధి చేసి మళ్లీ సాగుకు వాడటం ద్వారా భూగర్భ జలాలపై ఒత్తిడి తగ్గుతోంది. 'హర్ ఘర్ జల్' వంటి పథకాలు గ్రామీణ ప్రాంతాల్లో నీటి భద్రతను పెంచుతూ, వ్యవసాయానికి అవసరమైన జలవనరులను కాపాడుతున్నాయి.
వ్యవసాయ వ్యర్థాల నిర్వహణ అనేది కేవలం ఒక పర్యావరణ అంశం కాదు, ఇది భారతదేశ ఆర్థిక స్వావలంబనకు ఒక సోపానం. 10మిలియన్ల కొత్త ఉద్యోగాల సృష్టి, ఇంధన దిగుమతుల తగ్గింపు, ఆరోగ్యకరమైన నేలలు మనకు ఈ విధానం ద్వారా లభిస్తాయి. ప్రభుత్వం, రైతులు, స్టార్టప్‌లు సమన్వయంతో పనిచేస్తే, భారతదేశం ప్రపంచానికే 'వృత్తాకార వ్యవసాయం'లో రోల్ మోడల్‌గా నిలుస్తుంది.
