
వేసవి వినోదం.. డిజిటల్ వ్యసనం కాకూడదు: తల్లిదండ్రులకు సీపీ సజ్జనార్ హెచ్చరిక
వేసవి సెలవుల్లో పిల్లలు 'డిజిటల్' మాయాజాలంలో పడి తమ భవిష్యత్తును నాశనం చేసుకోకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని సైబరాబాద్ సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు. వినోదం పేరుతో మొదలయ్యే స్మార్ట్ ఫోన్ అలవాటు, క్రమంగా ప్రాణాంతక వ్యసనంగా మారుతోందని ఆయన తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఈ మేరకు 'ఎక్స్' వేదికగా తల్లిదండ్రులను ఉద్దేశించి ఆయన ఒక కీలక సందేశాన్ని విడుదల చేశారు.
ఒకప్పుడు వేసవి అంటే అమ్మమ్మ ఊరు, పల్లె గాలి, చెరువు గట్లు, మైదానాల్లో ఆటలు… పిల్లల బాల్యం ఉల్లాసంగా గడిచేదని ఆయన గుర్తుచేశారు. కానీ నేడు ఆ సుఖాలన్నీ కనుమరుగై, ఐదు అంగుళాల స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌కే పిల్లల ప్రపంచం పరిమితమైపోయిందని సజ్జనార్ ఆందోళన వ్యక్తం చేశారు.
తల్లిదండ్రులు పనుల్లో నిమగ్నమై పిల్లలకు సరైన సమయం ఇవ్వకపోవడం వల్ల, వారు డిజిటల్ మాయాజాలంలో చిక్కుకుంటున్నారని చెప్పారు. రీల్స్‌కు బానిసై గంటల తరబడి మొబైల్లో గడపడం, సోషల్ మీడియాలో అపరిచితులతో మమేకం కావడం… ఇవన్నీ పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయని హెచ్చరించారు. చిన్న చిన్న మందలింపులకు మనస్తాపం చెంది ఇల్లు విడిచి వెళ్లిపోయే ఘటనలు, ఆత్మహత్యలు చేసుకోవడం ఇటీవల హైదరాబాద్‌లో పెరిగిపోతున్నాయని, ఇది కుటుంబాలకు తీవ్ర మనోవేదన కలిగిస్తోందని పేర్కొన్నారు.
ఈ పరిస్థితుల్లో వేసవి సెలవుల్లో పిల్లలకు గ్యాడ్జెట్లకంటే తల్లిదండ్రుల సమయం పెద్ద కానుక అవుతుందని సజ్జనార్ సూచించారు. పిల్లలు ఇంటర్నెట్‌లో ఏం చూస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు అన్న విషయాలపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. పరీక్షల ఫలితాల సమయంలో వారికి ధైర్యం చెప్పి, సరైన మార్గనిర్దేశం చేయాలని కోరారు.
పిల్లల భవిష్యత్తు బంగారంలా మలచడం తల్లిదండ్రుల చేతుల్లోనే ఉందని, వారి జాగ్రత్తే నిజమైన రక్షణ కవచమని సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు.
