
వేసవిలో కరెంటు కష్టాలు రావద్దు… బొగ్గు నిల్వలు పెంచండి: విజయానంద్
రాబోయే వేసవి కాలంలో రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్‌ను తట్టుకునేందుకు పవర్ యుటిలిటీలు ఇప్పటి నుంచే సమగ్ర ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే.విజయానంద్ ఆదేశించారు. అంతర్జాతీయంగా బొగ్గు దిగుమతులపై ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం కలగకుండా ముందస్తుగా బొగ్గు నిల్వలను సమీకరించుకోవాలని ఆయన సూచించారు.
సమన్వయంతోనే నిరంతర సరఫరా
మంగళవారం జరిగిన సమీక్షా సమావేశంలో విజయనంద్ మాట్లాడుతూ వేసవి నెలల్లో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరుగుతుందని దీనికి అనుగుణంగా థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పోర్టులు, రైల్వే శాఖలతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని అధికారులను కోరారు. గ్రిడ్ స్థిరత్వాన్ని కాపాడటం కోసం పీక్ డిమాండ్ సమయంలో అన్ని ఉత్పత్తి యూనిట్లు తమ పూర్తి సామర్థ్యంతో పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు కృష్ణపట్నం థర్మల్ పవర్ ప్లాంట్ అవసరాలకు సంబంధించి దిగుమతి చేసుకునే బొగ్గు పరిమాణాన్ని అంచనా వేయాలని ఏపీ జెన్కో ను ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా సరఫరా షెడ్యూళ్లను త్వరగా ఖరారు చేసి వేసవిలో నిరంతర ఉత్పత్తికి మార్గం సుగమం చేయాలని సూచించారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు విద్యుత్ ఉత్పత్తి ఖర్చులను తగ్గించి, వినియోగదారులకు తక్కువ ధరకే విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని విజయనంద్ పేర్కొన్నారు. సాధ్యమైన అన్ని మార్గాలను అన్వేషించి విద్యుత్ కొనుగోలు మరియు ఉత్పత్తి వ్యయాన్ని ఆప్టిమైజ్ చేయాలని ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఇక రాబోయే మాన్సూన్ సీజన్‌కు సంబంధించి వర్షపాతం అంచనాలు ఆశాజనకంగా లేవని, దీనివల్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తిపై ఆధారపడే పరిస్థితులు మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ముందస్తు ప్రణాళికలు, వనరుల సమర్థ వినియోగం ద్వారా విద్యుత్ డిమాండ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొని, గ్రిడ్ విశ్వసనీయతను కాపాడాల్సిన అవసరం ఉందని విజయనంద్ స్పష్టం చేశారు.
