
వేలిముద్రతో యూపీఏ చెల్లింపులు
యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) చెల్లింపులకు ఇప్పటివరకు పిన్ నమోదు చేస్తుండగా, ఇకపై వేలి ముద్ర, ముఖ గుర్తింపు (ఫేషియల్ రికగ్నిషన్)తోనూ లావాదేవీ పూర్తికానుంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్పీసీఐ) ఈ విధానాన్ని ఆవిష్కరించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ముంబయిలో జరుగుతున్న గ్లోబల్ ఫిన్టిక్ ఫెస్టివల్ (జీఎఫ్ఎఫ్)లో దీన్ని ప్రదర్శించారు. కొత్త సదుపాయం ఎప్పటినుంచి అందరికీ అందుబాటులోకి వస్తుందనే విషయాన్ని వెల్లడించలేదు కానీ, అయితే బుధవారం (ఈనెల 8) నుంచే కొత్త విధానాన్ని అమలు చేయాలని కేంద్రం నిర్ణయించినట్లు కొన్ని వార్తా సంస్థలు పేర్కొన్నాయి. ఆధార్ కార్డులో నమోదైన బయోమెట్రిక్ సమాచారాన్ని ఉపయోగించి ఈ వ్యవస్థ పనిచేయనుంది.
దాదాపు 25 శాతం సమయం ఆదా
పిన్ నమోదు పద్ధతిలో ప్రస్తుతం జరుగుతున్న యూపీఐ లావాదేవీలతో పోలిస్తే, కొత్త విధానం వల్ల భద్రత మరింత పటిష్ఠం అవ్వడమే కాక, లావాదేవీ సమయం 25 శాతం వరకు తగ్గుతుందని చెబుతున్నారు. మొబైల్ యాప్ ద్వారా ఏదైనా కొనుగోలు చేస్తున్నప్పుడు, పిన్ నమోదు చేయకుండానే ముఖాన్ని స్కాన్ చేయడం లేదా వేలిముద్ర ఆధారంగా చెల్లింపు పూర్తిచేయొచ్చు. డిజిటల్ చెల్లింపుల వాడకంపై మరింత నమ్మకాన్ని ఈ విధానం గ్రామీణుల్లో కల్పిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అత్యంత సురక్షితమైన ఆధార్ సమాచారం ఆధారంగా లావాదేవీలు నిర్వహిస్తారు. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం సమాచారం బయటకు రాకుండా కఠిన నిబంధనలు అమల్లో ఉన్నాయి. ఎన్పీసీఐ వీటన్నింటినీ పూర్తిస్థాయిలో పరీక్షించాకే, అమలుకు సిద్ధమయ్యిందని తెలుస్తోంది.
ఒకే బ్యాంక్ ఖాతా ఇద్దరి యూపీఐ చెల్లింపులకు
ఒకే బ్యాంక్ ఖాతాను ఇద్దరు వ్యక్తులు యూపీఐ లావాదేవీలకు ఉపయోగించుకునే వీలునూ కల్పించనున్నారు. ఒకరు లావాదేవీని ప్రారంభించి, పిన్ ఎంటర్ చేస్తే, చెల్లింపును ఆమోదించేందుకు రెండో వ్యక్తికీ నోటిఫికేషన్ వస్తుంది. లావాదేవీ పూర్తి చేసేందుకు ఇద్దరూ తమ మొబైల్ ఫోన్లలో పిన్ నమోదు చేయాలి. స్మార్ట్ గ్లాస్లతో క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి, నోటితో ఆదేశాలు ఇవ్వడం ద్వారా కూడా యూపీఐ చెల్లింపులు చేసే సదుపాయాన్ని ఎన్పీసీఐ అందుబాటులోకి తెచ్చింది.
