Let's talk: editor@tmv.in
వేమూరులో నేడు ముఖ్యమంత్రి పర్యటన: రైతులకు పట్టాదారు పుస్తకాల పంపిణీ

వేమూరులో నేడు ముఖ్యమంత్రి పర్యటన: రైతులకు పట్టాదారు పుస్తకాల పంపిణీ

Dantu Vijaya Lakshmi Prasanna
9 ఏప్రిల్, 2026

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు (గురువారం) బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమంలో భాగంగా రైతులకు రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను ఆయన స్వయంగా అందజేస్తారు. గత ప్రభుత్వ హయాంలో రీ-సర్వేలో జరిగిన లోపాలను సరిదిద్దుతూ, భూ యజమానులకు పూర్తి భరోసా కల్పించేలా కూటమి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ముఖ్యంగా గతంలో పాస్ పుస్తకాలు, సర్వే రాళ్లపై ఉన్న రాజకీయ నాయకుల ఫోటోలను తొలగించి, అధికారిక ముద్రతో వీటిని ప్రభుత్వం జారీ చేస్తోంది.

గణాంకాలు పురోగతి:

రాష్ట్రవ్యాప్తంగా భూముల రీ-సర్వే ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. మొత్తం 16,816 గ్రామాలకు గాను ఇప్పటికే 6,976 గ్రామాల్లో సర్వే పూర్తయింది. ఈ ఏడాది జనవరి నుండి ఇప్పటివరకు 5,717 గ్రామాల్లో సుమారు 22.79 లక్షల పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. 2027 ఏప్రిల్ నాటికి రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన అన్ని గ్రామాల్లో కలిపి మొత్తం 62.04 లక్షల కొత్త పాస్ పుస్తకాలను పంపిణీ చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది.

సాంకేతిక భద్రత - బ్లాక్ చైన్ టెక్నాలజీ

భూ రికార్డుల భద్రత విషయంలో ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు చేస్తోంది. రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేయడానికి లేదా అక్రమంగా మార్చడానికి వీలు లేకుండా బ్లాక్ చైన్ టెక్నాలజీని అమలులోకి తెస్తోంది. రైతులకు తెలియకుండా రికార్డులు మార్పిడి కాకుండా ఉండేలా అత్యున్నత స్థాయి రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల భూ వివాదాలు తగ్గడంతో పాటు రైతులకు తమ ఆస్తిపై పూర్తి హక్కులు, భద్రత లభిస్తాయి.

అయితే, ముఖ్యమంత్రి పర్యటన నేటి ఉదయం 10.50 గంటలకు భట్టిప్రోలు మండలం సూరేపల్లి చేరుకోవడంతో ప్రారంభమవుతుంది. ఉదయం 11 గంటలకు అక్కడ ఏర్పాటు చేసిన ప్రజావేదిక బహిరంగ సభలో పాల్గొని రైతులకి పాస్ పుస్తకాలు అందజేసి తరువాత ప్రసంగిస్తారు. అనంతరం మధ్యాహ్నం 1.35 గంటలకు నేరుగా వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి రైతులతో ముఖాముఖి మాట్లాడతారు. మధ్యాహ్నం 2.10 గంటలకు పార్టీ శ్రేణులతో సమీక్ష నిర్వహించి, సాయంత్రం 4.05 గంటలకు తిరిగి అమరావతికి చేరుకుంటారు.

గురువారం జరిగే పంపిణీలో భాగంగా బాపట్ల జిల్లాలోని 8 మండలాల్లో 3,658 పాస్ పుస్తకాలను అందిస్తారు. అందులో ఒక్క వేమూరు నియోజకవర్గంలోనే 1,795 పుస్తకాలను రైతులకు అందజేయనున్నారు. ఈ ఏడాది చివరి నాటికి రీ-సర్వే ప్రక్రియను సంపూర్ణంగా ముగించి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేని రెవెన్యూ వ్యవస్థను అందించాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది.