
వేములవాడ రాజన్న ఆలయాభివృద్ధికి మరో రూ. 99.40 కోట్ల నిధులు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో 'దక్షిణ కాశీ'గా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం మరో రూ. 99.40 కోట్ల నిధులను మంజూరు చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో రాజన్న క్షేత్రం సరికొత్త రూపం సంతరించుకుంటోంది. తాజా నిధులతో ఆలయ సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం ఇప్పటివరకు విడుదల చేసిన మొత్తం నిధులు రూ.249.40 కోట్లకు చేరాయి.
ఇప్పటికే 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.50 కోట్లు, 2024–25 బడ్జెట్‌లో రూ.100 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం, తాజా కేటాయింపుతో అభివృద్ధి పనులకు మరింత ఊతమిచ్చింది. ఆలయ పరిసరాల అభివృద్ధి, యాత్రికులకు ఆధునిక సౌకర్యాల కల్పన, మౌలిక వసతుల విస్తరణ వంటి పనులు వేగంగా కొనసాగుతున్నాయి.
ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసిన రూ.150 కోట్లతో చేపట్టిన పనుల్లో సుమారు 45 శాతం పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. తాజాగా విడుదలైన రూ.99.40 కోట్లతో మిగిలిన పనులను మరింత వేగవంతంగా పూర్తి చేయనున్నట్లు పేర్కొన్నారు. దీంతో ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆలయ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. అదనపు నిధుల మంజూరుకు సహకరించిన మంత్రులు కొండా సురేఖ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తాజా నిధుల విడుదలతో రాజన్న ఆలయ అభివృద్ధి పనులు మరింత వేగంగా పూర్తవుతాయని భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
