Let's talk: editor@tmv.in
వేములవాడ రాజన్నకే శఠగోపం పెట్టారు: కేంద్రమంత్రి బండి సంజయ్

వేములవాడ రాజన్నకే శఠగోపం పెట్టారు: కేంద్రమంత్రి బండి సంజయ్

Gaddamidi Naveen
5 ఫిబ్రవరి, 2026

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వేములవాడ పట్టణంలోని నాంపల్లి, తిప్పాపూర్, అంజనీ నగర్, మహంకాళి చౌరస్తా ప్రాంతాల్లో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ స్థానిక ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, వేములవాడ అభివృద్ధికి బీజేపీతోనే సాధ్యమని పేర్కొన్నారు.

వేములవాడ రాజన్న ఆలయానికి శఠగోపం పెట్టిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని ఆయ‌న పేర్కొన్నారు. ఆగమశాస్త్ర నిబంధనలకు విరుద్ధంగా ఆలయ నిర్మాణాలు చేపడుతూ కాంగ్రెస్ మరో పాపానికి పాల్పడుతోందని ఆయ‌న విమర్శించారు. పదేళ్లు అధికారంలో ఉండి వేములవాడకు ఏమీ చేయని బీఆర్ఎస్, అలాగే రెండేళ్ల పాలనలో ఒక్క రూపాయి కూడా ఇవ్వని కాంగ్రెస్ పార్టీలు ఇప్పుడు ఓట్లు అడిగే నైతిక హక్కు కోల్పోయాయని బండి ఆరోపించారు.

తమ కృషితో వేములవాడకు 14వ, 15వ ఆర్థిక సంఘాల ద్వారా రూ.16 కోట్ల నిధులు తీసుకొచ్చినట్టు ఆయ‌న తెలిపారు. అదేవిధంగా ఎంపీ లాడ్స్ నిధుల కింద రూ.4 కోట్లు, అమృత్ పథకం ద్వారా రూ.13 కోట్లు మంజూరు చేయించామని చెప్పారు. స్వనిధి పథకం కింద నాలుగు వేల మంది చిరు వ్యాపారులకు రూ.6 కోట్లకు పైగా ఆర్థిక సహాయం అందించామని ఆయ‌న వివరించారు.

పేద విద్యార్థుల కోసం 20 వేల సైకిళ్లు పంపిణీ చేయడంతో పాటు, పదవ తరగతి విద్యార్థుల ఫీజులు చెల్లించామని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులకు రూ.2 కోట్ల విలువైన అత్యాధునిక వైద్య పరికరాలు అందించి ప్రజలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి తీసుకొచ్చామని ఆయ‌న‌ అన్నారు.

వేములవాడ సమగ్ర అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని పేర్కొంటూ, ఈ నెల 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి బీజేపీకి మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని అప్పగించాలని ప్రజలను కోరారు. కేంద్రం నుంచి వరదలా నిధులు తెచ్చే బాధ్యత తానే తీసుకుంటానని హామీ ఇచ్చారు.