
వేములవాడ మున్సిపల్ పోరు: కాంగ్రెస్ అభ్యర్థుల తరపున మంత్రులు జోరుగా ప్రచారం
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి మద్దతుగా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, సహచర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వార్డుల్లో పర్యటిస్తూ పార్టీ అభ్యర్థులకు ప్రజల మద్దతు కూడగట్టారు.
8వ వార్డులో సాగరం వెంకటస్వామి, 10వ వార్డులో సిరిగిరి సంగీత, 9వ వార్డులో నీలం మమత, 23వ వార్డులో నామాల ఉమ, 22వ వార్డులో ఇప్పుపూల మమత అభ్యర్థిత్వాలకు మద్దతుగా నాయకులు ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. మున్సిపాలిటీ అభివృద్ధికి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించడం అవసరమని అన్నారు.
వేములవాడ పట్టణ అభివృద్ధి, మౌలిక వసతుల మెరుగుదల, ప్రజల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని నాయకులు పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ప్రచార కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
