
వేములవాడలో నామినేషన్ల కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో బుధవారం నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం అధికారికంగా ప్రారంభమైంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం మొదటి రోజే ఆశావహులు, అభ్యర్థులు తమ అనుచరులతో కలిసి కార్యాలయానికి చేరుకోవడంతో సందడి నెలకొంది.
రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరీమ అగర్వాల్ వేములవాడ మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించి, నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను స్వయంగా పర్యవేక్షించారు. కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కౌంటర్లు, అభ్యర్థుల కోసం కల్పించిన మౌలిక వసతులు భద్రతా ఏర్పాట్లను ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు.నామినేషన్లు వేయడానికి వచ్చే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
నిర్ణీత సమయంలోగా ప్రక్రియ సజావుగా సాగేలా చూడాలని, కౌంటర్ల వద్ద రద్దీ పెరగకుండా క్రమబద్ధీకరించాలని సూచించారు.ఎన్నికల నియమావళిని తప్పకుండా పాటించాలని, పారదర్శకంగా నామినేషన్ల స్వీకరణ చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. వేములవాడ పురపోరులో నిలబడబోయే అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. శాంతిభద్రతల దృష్ట్యా మున్సిపల్ కార్యాలయం వద్ద భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.
