Let's talk: editor@tmv.in
వేట్లపాలెం ఘటనపై ఉన్నత స్థాయి కమిటీ

వేట్లపాలెం ఘటనపై ఉన్నత స్థాయి కమిటీ

Dantu Vijaya Lakshmi Prasanna
6 మార్చి, 2026

కాకినాడ జిల్లా వేట్లపాలెంలో జరిగిన ఘోర బాణసంచా పేలుడు ఘటనలో మృతుల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 26 మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని ఆయన తెలిపారు. ఈ ప్రమాదంపై శాసనసభలో ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రకటన చేశారు. అనంతరం మృతులకు సంతాపంగా సభలో రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.

ఈ ప్రమాదంలో ప్రస్తుతం ఆరుగురు బాధితులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని సీఎం వెల్లడించారు. వేట్లపాలెంలోని సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ పరిశ్రమకు గత వైసీపీ ప్రభుత్వ హయాంలోనే అనుమతులు ఇచ్చినట్టు ఆయన పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా అక్కడ బాణసంచా తయారీ కొనసాగుతోందని, అనుమతించిన పరిమితికి మించి మందుగుండు సామగ్రి నిల్వ చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని తెలిపారు.

మొత్తం 30 మంది ఆ కర్మాగారంలో పనిచేస్తున్నారని, ఎక్కువ ఆర్డర్లు ఉన్నాయని చెప్పి భారీ స్థాయిలో బాణసంచా తయారు చేస్తున్నారని సీఎం వివరించారు. ఘటన సమయంలో తాను విజయనగరం జిల్లాలో పర్యటనలో ఉన్నానని, సమాచారం అందుకున్న వెంటనే ఘటన స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించినట్లు తెలిపారు. ప్రమాదం జరిగిన 30 నిమిషాల్లోనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారని చెప్పారు.

ఈ ఘటనపై సంస్థ యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సీఎం వెల్లడించారు. ప్రమాదంలో మృతి చెందిన కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చినట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.2 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించినట్లు తెలిపారు. ఇళ్లు లేని బాధిత కుటుంబాలకు ఇళ్లు కట్టించి ఇస్తామని, ప్రభుత్వ పరంగా అన్ని విధాలా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

ఈ ప్రమాదానికి బాధ్యులైన అధికారుల నిర్లక్ష్యం కూడా కారణమైందని పేర్కొంటూ ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు సీఎం తెలిపారు. పెద్దాపురం ఆర్డీఓ, పెద్దాపురం డీఎస్పీ, జిల్లా ఫైర్ ఆఫీసర్, లేబర్ అధికారులను సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు.

ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు కోసం పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ కుమార్, ఐజీ రామకృష్ణలతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ప్రభుత్వం నియమించినట్లు సీఎం తెలిపారు. లైసెన్సు తీసుకున్న సంస్థ నిబంధనల ప్రకారం అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ, దురాశతో ఎక్కువ ఉత్పత్తి చేయాలని ప్రయత్నించడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ఆయన అన్నారు.

భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు. నిందితుల ఆస్తులను సీజ్ చేసి వేలం వేసి బాధిత కుటుంబాలకు అందించే దిశగా చర్యలు తీసుకుంటామని కూడా తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు.

ఈ సందర్భంగా ప్రతిపక్ష పార్టీలపై కూడా సీఎం విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలపై ప్రతిపక్ష పార్టీ స్పందించడం లేదని, ఇలాంటి విషాద ఘటనలపై దృష్టి పెట్టకుండా రాజకీయ ఆరోపణలకే పరిమితమవుతున్నాయని అన్నారు. తిరుపతి శ్రీవారి లడ్డూ ప్రసాదం అంశాన్ని కూడా రాజకీయంగా వాడుకుంటున్నారని వ్యాఖ్యానించారు.

బాణసంచా తయారీ పరిశ్రమల్లో చిన్న పొరపాటు కూడా పెద్ద ప్రమాదాలకు దారితీస్తుందని సీఎం అన్నారు. వేట్లపాలెం ఘటనలో ఇంతమంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఆవేదన కలిగిస్తోందని పేర్కొన్నారు. మృతుల ఆత్మలకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుందని మరోసారి స్పష్టం చేశారు.