
వేగం పుంజుకున్న భారత్ – న్యూజిలాండ్ మధ్య వాణిజ్య చర్చలు
భారత్–న్యూజిలాండ్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు కొత్త దశకు చేరుకున్నాయి. ఆర్థిక, వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు రెండు దేశాలు సమానంగా, సమగ్రమైన ఒప్పందం వైపు అడుగులు వేస్తున్నాయి. భారత వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ బుధవారం తన న్యూజిలాండ్ పర్యటనలో ఆ దేశ వాణిజ్య మంత్రి టాడ్ మెక్‌క్లేను కలసి చర్చలు జరిపారు. ఈసందర్భంగా కేంద్రమంత్రి గోయల్ మాట్లాడుతూ ఈ చర్చలు పరస్పర గౌరవభావంతో, స్నేహపూర్వక వాతావరణంలో జరుగుతున్నాయి. రెండు దేశాలు దీర్ఘకాల వాణిజ్య లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగుతున్నాయి అని తెలిపారు.
న్యూజిలాండ్–ఇండియా బిజినెస్ ఫోరంలో గోయల్ మాట్లాడుతూ ప్రతి వాణిజ్య ఒప్పందం ఆ దేశాల పరిమాణం, సామర్థ్యాన్ని బట్టి ఉండాలి. యూరోపియన్ యూనియన్, ఆసియన్ దేశాలతో ఉన్న ఒప్పందాలను మనం సరిగ్గా తూకం వేసి పోల్చలేం అని వివరించారు. ప్రస్తుతం రెండు దేశాల మధ్య వాణిజ్యం తక్కువగానే ఉన్నా, విస్తారమైన అవకాశాలు ఉన్నాయని గోయల్ గుర్తించారు. భారత్ న్యూజిలాండ్ నుంచి ప్రధానంగా గొర్రెల ఉన్ని, ఉక్కు, పండ్లు దిగుమతి చేసుకుంటుండగా, న్యూజిలాండ్‌కు ఫార్మస్యూటికల్ ఉత్పత్తులు, యంత్రాలు, విలువైన రాళ్లు ఎగుమతి చేస్తోంది. వ్యవసాయం, నౌకాయాన రంగం, అంతరిక్షం, రక్షణ వంటి విభాగాల్లో సహకారం పెంచే దిశగా చర్చలు జరుపుతున్నట్టు మంత్రి వివరించారు. అలాగే భారతదేశంలో ఏర్పాటు చేసే పరిశ్రమలకు అనేక రాయితీలు ఇస్తున్నాం. వేగంగా అనుమతులు జారీ చేస్తున్నాం. రెడ్ టేపిజం(అనవసర ఆలస్యం) లేదని పెట్టుబడులు పెట్టాలని ఈ సందర్భంగా కోరారు.
భారత్ మాకు వ్యూహాత్మక భాగస్వామి:టాడ్ మెక్‌క్లే
న్యూజిల్యాండ్ వాణిజ్య మంత్రి టాడ్ మెక్‌క్లే మాట్లాడుతూ భారత్ మాకు వ్యూహాత్మక భాగస్వామి. ఈ ఒప్పందం కేవలం ఈరోజు కోసం కాదు, వచ్చే 20 ఏళ్ల ఆర్థిక సంబంధాల మధ్య బాటను వేయడానికి అని అన్నారు. ఇరు దేశాల మధ్య నాలుగో రౌండ్ వాణిజ్య ఒప్పందంపై చర్చలు నవంబర్ 3న ఆక్లాండ్‌లో ప్రారంభమయ్యాయి. ఇన్నోవేషన్, టెక్నాలజీ, సస్టైనబుల్ డెవలప్‌మెంట్ రంగాల్లో కొత్త భాగస్వామ్యాలు ఏర్పరచడంపై రెండు దేశాలు దృష్టి సారించాయి. 2028 నాటికి ఎయిర్ ఇండియా–ఎయిర్ న్యూజిలాండ్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించేందుకు కూడా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.
గోయల్ మాట్లాడుతూ మా ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, సమగ్రంగా పరిశీలించిన తర్వాతే ఒప్పందం పూర్తి చేస్తాం. తొందరపడి తప్పులు చేయకుండా స్థిరమైన ఒప్పందం చేయడమే మా లక్ష్యం అని చెప్పారు. అధికారిక గణాంకాల ప్రకారం, 2023–24లో భారత్–న్యూజిలాండ్ వాణిజ్య పరిమాణం 1.75 బిలియన్ అమెరికన్ డాలర్లు. ఇందులో న్యూజిలాండ్ నుంచి భారత్‌కు ఎగుమతులు యూఎస్డీ 0.84 బిలియన్, భారత్ నుంచి దిగుమతులు యూఎస్డీ 0.91 బిలియన్లుగా ఉన్నాయి. భారత్ ప్రస్తుతం న్యూజిలాండ్ సహా దాదాపు పది దేశాలతో వాణిజ్య ఒప్పందాలపై చర్చలు సాగిస్తోంది. దీని ద్వారా దీర్ఘకాల వృద్ధి అవకాశాలు, మార్కెట్ విస్తరణ సాధించాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యంగా ఉన్నది.
