Let's talk: editor@tmv.in
వెస్ట్ బ్యాంక్ వివాదం: ఇజ్రాయెల్ ఏకపక్ష నిర్ణయాలను ఖండించిన భారత్

వెస్ట్ బ్యాంక్ వివాదం: ఇజ్రాయెల్ ఏకపక్ష నిర్ణయాలను ఖండించిన భారత్

Shaik Mohammad Shaffee
20 ఫిబ్రవరి, 2026

వెస్ట్‌ బ్యాంక్‌లో ఇజ్రాయెల్ తన ఉనికిని అక్రమంగా విస్తరించుకోవడానికి తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలను భారతదేశం తీవ్రంగా ఖండించింది. ఇజ్రాయెల్ చర్యలను వ్యతిరేకిస్తూ ప్రపంచవ్యాప్తంగా వందకు పైగా దేశాలు, అంతర్జాతీయ సంస్థలు కలిసి విడుదల చేసిన ఉమ్మడి ప్రకటనలో భారత్ కూడా భాగస్వామి అయింది. బుధవారం ఐరాసలోని పాలస్తీనా శాశ్వత పరిశీలక మిషన్ ఈ కీలక ప్రకటనను విడుదల చేసింది.

ఆక్రమణలు వెంటనే నిలిపివేయాలి

ఇజ్రాయెల్ తన ఆక్రమిత వెస్ట్‌ బ్యాంక్ ప్రాంతంలో చేపడుతున్న భూ ఆక్రమణలు, ఇతర ఏకపక్ష చర్యలు అంతర్జాతీయ చట్టాలకు పూర్తి విరుద్ధమని ఈ 100 దేశాలు స్పష్టం చేశాయి. ఇజ్రాయెల్ తన నిర్ణయాలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ఏ రకమైన భూ ఆక్రమణనైనా తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, పాలస్తీనా భూభాగాల్లో జనాభా మార్పులు చేయడం లేదా ఆ ప్రాంతాల స్వభావాన్ని మార్చడం వంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని సంతకం చేసిన దేశాలు ఉద్ఘాటించాయి.

చివరి నిమిషంలో భారత్ మద్దతు

వాస్తవానికి ఫిబ్రవరి 17న ఇజ్రాయెల్ చర్యలను ఖండిస్తూ మొదట 85 దేశాలు మాత్రమే ప్రకటన విడుదల చేశాయి. ఆ ప్రారంభ జాబితాలో భారతదేశం పేరు లేదు. అయితే, తాజాగా ఆ సంఖ్య 100 దాటడంతో భారత్ కూడా తన పేరును ఈ ఉమ్మడి ప్రకటనలో చేర్చింది. 1967 నుంచి ఆక్రమణలో ఉన్న తూర్పు జెరూసలేం సహా ఇతర పాలస్తీనా భూభాగాల్లో యథాతథ స్థితిని మార్చే ప్రయత్నాలు శాంతియుత చర్చలకు విఘాతం కలిగిస్తాయని భారత్ అభిప్రాయపడింది.

శాంతికి ‘ద్విరాష్ట్ర పరిష్కారమే’ మార్గం

పశ్చిమాసియాలో శాంతి నెలకొనాలంటే ఐరాస తీర్మానాల ప్రకారం ఇజ్రాయెల్ ఆక్రమణలను ముగించి, ‘రెండు దేశాల విధానం (ద్విరాష్ట్ర పరిష్కారం) అమలు చేయడమే ఏకైక మార్గమని ఈ ప్రకటన పునరుద్ఘాటించింది. ఇజ్రాయెల్ పక్కనే సార్వభౌమత్వంతో కూడిన, స్వతంత్ర పాలస్తీనా దేశం ఏర్పడాలన్నదే భారతదేశం దీర్ఘకాలిక విధానం.1988లో పాలస్తీనాను ఒక దేశంగా గుర్తించిన తొలి అరబేతర దేశంగా భారత్ అరుదైన గుర్తింపు పొందింది . తాజా నిర్ణయంతో పాలస్తీనా పట్ల తన మద్దతును భారత్ మరోసారి ప్రపంచ వేదికపై చాటిచెప్పింది.

అసలేంటి వివాదం?

వెస్ట్ బ్యాంక్ వివాదం అనేది దశాబ్దాలుగా ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా మధ్య నడుస్తున్న భూపోరాటం. 1967 యుద్ధం తర్వాత జోర్డాన్ నదికి పశ్చిమ ఒడ్డున ఉన్న ఈ కీలక భూభాగాన్ని ఇజ్రాయెల్ తన సైనిక నియంత్రణలోకి తీసుకుంది. పాలస్తీనా ప్రజలు తమ భవిష్యత్తు స్వతంత్ర దేశానికి ఈ ప్రాంతమే ప్రధాన కేంద్రమని భావిస్తుండగా, ఇజ్రాయెల్ అక్కడ యూదుల కోసం కొత్త నివాసాలను నిర్మిస్తూ తన పట్టును పెంచుకుంటోంది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఈ ఆక్రమణలు అక్రమమని ఐక్యరాజ్యసమితి, మెజారిటీ ప్రపంచ దేశాలు వాదిస్తున్నాయి. పవిత్ర నగరమైన జెరూసలేం కూడా ఈ ప్రాంతంలోనే ఉండటం వల్ల, అటు మతపరంగా, ఇటు రాజకీయంగా ఈ భూమిపై ఆధిపత్యం కోసం ఇరు వర్గాల మధ్య నిరంతరం ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి.