
‘వెలుగుమట్ల’ పై నిజ నిర్ధారణ కమిటీ: కవిత
ఖమ్మం జిల్లా వెలుగుమట్ల ప్రాంతంలో జరిగిన పేదల ఇళ్ల కూల్చివేతలపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మంగళవారం తీవ్రంగా స్పందించారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేసేందుకు ఏర్పాటు చేసిన విచారణ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరించాలని ఆమె డిమాండ్ చేశారు.
సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ..ఇళ్ల కూల్చివేతల వల్ల నష్టపోయిన కుటుంబాలకు న్యాయం జరగాలంటే కమిటీకి అవసరమైన అన్ని వివరాలు, అధికారులతో సమావేశాల అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్, కమిషనర్ వంటి అధికారులతో కమిటీ సభ్యులు భేటీ అయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇళ్లను కోల్పోయిన పేద కుటుంబాల సమస్యలను అర్థం చేసుకోవడానికి పౌర సమాజ ప్రతినిధులతో కలిసి ఖమ్మానికి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు కవిత తెలిపారు. తెలంగాణ జాగృతి, ధర్మసమాజ్ పార్టీ కలిసి ఈ సమస్యపై పోరాడుతూ, ప్రభావిత కుటుంబాలకు గృహాలు కల్పించాలని ఇప్పటికే ప్రభుత్వాన్ని కోరినట్లు ఆమె పేర్కొన్నారు. ఈ ప్రక్రియ పూర్తిస్థాయిలో అమలు కావాలని, మధ్యలో నిలిచిపోకూడదని స్పష్టం చేశారు.
జాగృతి, ధర్మసమాజ్ పార్టీ పోరాటంతో ప్రభుత్వం కొంత వెనక్కి తగ్గి 350 మందికి పట్టాలు, 110 మందికి ఇళ్ల నిర్మాణానికి సహాయం ప్రకటించినప్పటికీ, ఇంకా అనేక కుటుంబాలకు న్యాయం జరగలేదని పేర్కొన్నారు. డిసెంబర్ 9 నాటికి ఇళ్లు పూర్తవుతాయని ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో, అప్పటి వరకు బాధితుల నివాసం, అద్దె, పిల్లల చదువు వంటి బాధ్యతలు ప్రభుత్వమే తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ విషయంలో మేధావులు స్పందించాలని, ముఖ్యంగా ప్రొఫెసర్ కోదండరాం, హరగోపాల్, ఆకునూరి మురళి వంటి వారు ముందుకు రావాలని కోరారు. పేదలకు న్యాయం చేయడానికి ఇదే సరైన సమయమని కవిత స్పష్టం చేశారు.
నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు
బాధితుల పక్షాన నిలబడేందుకు రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ నేతృత్వంలో ఒక నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆమె వెల్లడించారు. ఈ కమిటీలో ఆర్మీ మాజీ మేజర్ మదన్ మోహన్, ప్రొఫెసర్లు, లాయర్లు, సీనియర్ జర్నలిస్టులు సభ్యులుగా ఉన్నారు. ప్రభుత్వం, అధికారులు ఈ కమిటీకి సంపూర్ణంగా సహకరించాలని ఆమె కోరారు.
ఖమ్మం ఇళ్ల కూల్చివేతపై ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ముగ్గురు మంత్రుల బినామీల ప్రయోజనం కోసమే దాదాపు 1,000 కుటుంబాల ఇళ్లను కూల్చివేశారని ఆయన మండిపడ్డారు. హైదరాబాద్‌లో హైడ్రా చర్యలు, మహబూబ్‌నగర్‌లో దివ్యాంగుల సమస్యలు, లగచర్ల, ఖమ్మంలో ఇళ్ల కూల్చివేతలు కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకాలకు నిదర్శనమని ఉదాహరణగా పేర్కొన్నారు.
గతంలోనే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఉద్దేశించి కవిత విమర్శలు చేస్తూ.. ప్రైవేట్ ఆస్తుల్లోకి ప్రవేశించి పేదలను ఖాళీ చేయించే ధైర్యం ఈ ప్రభుత్వానికి ఎక్కడిది? అని ప్రశ్నించారు. తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం రాజీనామా చేసి, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
