Let's talk: editor@tmv.in
వెలుగుమట్లలో పేదోడి సొంతింటి కల సాకారం చేస్తున్నాం: డిప్యూటీ సీఎం భట్టి

వెలుగుమట్లలో పేదోడి సొంతింటి కల సాకారం చేస్తున్నాం: డిప్యూటీ సీఎం భట్టి

Gaddamidi Naveen
12 మార్చి, 2026

ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూదాన్‌ భూమిలో అర్హులకు ఇళ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఇచ్చిన మాటను కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకుంది. మార్చి 15లోపు న్యాయం చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం, అనుకున్న దానికంటే నాలుగు రోజుల ముందే అర్హులైన పేదలను గుర్తించి ఇళ్ల పట్టాలను అందజేసింది. బుధవారం ఖమ్మం కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు కలిసి లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు.

ఈ సంద‌ర్బంగా డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ, వెలుగుమట్లలో కేవలం ఇళ్లు మాత్రమే కాకుండా, అన్ని మౌలిక వసతులతో కూడిన ఒక "మోడల్ కాలనీ"ని డిసెంబర్ నాటికి నిర్మిస్తామని ప్రకటించారు. అక్షరం నేర్పే బడి, ఆరోగ్యం ఇచ్చే ఆసుపత్రి, సురక్షితమైన తాగునీటి సౌకర్యాన్ని యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేస్తామన్నారు. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన నీటి సౌకర్యాన్ని కేవలం వారం రోజుల్లోనే అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. పేదోడి సొంతింటి కల సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయ‌న పేర్కొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 4.5 లక్షల ఇళ్ల నిర్మాణానికి 22,500 కోట్లు కేటాయించడం ద్వారా దేశ చరిత్రలో రికార్డు సృష్టించామని ఆయన పేర్కొన్నారు. వెలుగుమట్ల భూ నిర్వాసితులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుని, 311 మంది అర్హులైన పేదలకు స్థలంతో పాటు ఇండ్ల మంజూరీ, ఇప్పటికే ఇంటి స్థలం ఉన్న 101 మందికి కూడా “ఇందిరమ్మ ఇల్లు” పట్టాలు ఇవ్వడం జరుగిందన్నారు.

గత పదేళ్లుగా అధికారంలో ఉండి, 2017 నుంచి వెలుగుమట్ల పేదలను పట్టించుకోని వారు ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని బీఆర్ఎస్ నేతలపై భట్టి విమర్శలు గుప్పించారు. కొందరు బ్రోకర్ల మాటలు నమ్మి పేదలు అప్పట్లో డబ్బులు పోగొట్టుకున్నారు. కానీ, హైకోర్టు, సీసీఎల్ ఆదేశాల మేరకు ప్రభుత్వం ఈ భూములను స్వాధీనం చేసుకుని, ఇప్పుడు నిజమైన పేదలకు అధికారికంగా పట్టాలు ఇస్తోందన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ ప్రజా ప్రభుత్వం పేదల ఆత్మగౌరవం కోసం పనిచేస్తోందని, డిసెంబర్ 9న లబ్ధిదారులు తమ సొంత ఇళ్లలో గృహప్రవేశం చేస్తారని ఆయన స్పష్టం చేశారు. మాయమాటల మాఫియాకు ఇక రాష్ట్రంలో తావు లేదని, పేదల పక్షాన తమ ప్రభుత్వం అండగా ఉంటుందని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు.