
వెలిగొండ ప్రాజెక్టు 'జాతికి అంకితం' - జగన్ ప్రభుత్వం ఆడిన డ్రామా
వెలిగొండ ప్రాజెక్ట్ - అసంపూర్తి పనుల వాస్తవాలు పేరుతో అమరావతి సచివాలయం లో వెలిగొండ ప్రాజెక్ట్ పురోగతిపై ఏపి జలవనరుల శాఖమంత్రి నిమ్మల రామానాయుడు ఇటీవల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
గత ప్రభుత్వం వెలిగొండ ప్రాజెక్టు విషయంలో ప్రజలను ఎలా మభ్యపెట్టిందో మంత్రి నిమ్మల రామానాయుడు ఆధారాలతో సహా వివరించారు. 2024 మార్చిలో అసంపూర్తి పనులతోనే జగన్ మోహన్ రెడ్డి ఈ ప్రాజెక్టును 'జాతికి అంకితం' చేయడం కేవలం ఎన్నికల డ్రామా అని, ఇది ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల ప్రజలను వంచించడమేనని ఆయన విమర్శించారు. నిర్వాసితులకు కనీసం నష్టపరిహారం చెల్లించకుండా, 144 సెక్షన్ల మధ్య ప్రాజెక్టును ప్రారంభించడం వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట అని మంత్రి నిరూపించారు.
ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మాట్లాడుతూ, 1996లో చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు 43.58 టీఎంసీల కృష్ణా జలాలను అందించి, 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 15.25 లక్షల మందికి తాగునీరు అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, 2024 మార్చి 6న అప్పటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అనేక కీలక పనులు పెండింగ్‌లో ఉన్నప్పటికీ, కేవలం ఎన్నికల లబ్ధి కోసమే పోలీసుల పహారా మధ్య ప్రాజెక్టును 06.03.2024 న 'జాతికి అంకితం' చేశారని మంత్రి విమర్శించారు. ముఖ్యంగా టన్నెల్ హెడ్ రెగ్యులేటర్ వద్ద ఇంకా 06.03.2024 నాటికి 4,300 క్యూబిక్ మీటర్ల పని మిగిలి ఉందని, అత్యవసరమైన హాయిస్ట్ పనులు కూడా మొదలుపెట్టకుండానే అంకితం చేయడం ప్రజలను వంచించడమేనని పేర్కొన్నారు.
గత ప్రభుత్వం పలుమార్లు ప్రకటించిన తేదీకి పూర్తి కాని ప్రాజెక్ట్
తేదీ 20.02.2020 న ప్రాజెక్టును సందర్శించినప్పుడు, ప్రాజెక్ట్ పూర్తి చేయుటకు మొదటిగా ప్రకటించిన తేదీ 31.08.2020. రెండోసారి తేదీ 07.10.2021 న ఒంగోలు బహిరంగ సభలో, ప్రాజెక్ట్ పూర్తి చేయుటకు ప్రకటించిన తేదీ 31.08.2022. మూడోసారి తేదీ 24.08.2022 న చీమకుర్తి బహిరంగ సభలో, ప్రాజెక్ట్ పూర్తి చేయుటకు ప్రకటించిన తేదీ 30.09.2023. నాలుగోసారి తేదీ 12.04.2023 న మార్కాపురం బహిరంగ సభలో, ప్రాజెక్ట్ పూర్తి చేయుటకు ప్రకటించిన తేదీ 31.10.2023. ఇవన్నీ సాధ్యం కాకపోయేటప్పటికి ఎన్నికలకు ముందు 06.03.2024న అసంపూర్తిగా ఉన్న పనులతో ప్రజలను మభ్యపెట్టి జాతికి అంకితం అంటే ప్రకాశం,నెల్లూరు, కడప జిల్లాల ప్రజలకు ద్రోహం చేయడమే అని మంత్రి నిమ్మల అన్నారు.
సొరంగ మార్గాల ప్రస్తుత పరిస్థితి:
టన్నెల్-1లో ఇంకా 1,20,000 క్యూబిక్ మీటర్ల మట్టిని తొలగించాల్సి ఉందని, ఇది పూర్తి కాకుండా 3,000 క్యూసెక్కుల సామర్థ్యం మేరకు నీటిని తీసుకోవడం అసాధ్యమని మంత్రి వివరించారు. ఇక టన్నెల్-2 విషయానికి వస్తే, 2024 నుంచి కూటమి ప్రభుత్వం అత్యంత వేగంగా 4,563 మీటర్ల బెంచింగ్ పనులు, 3,708 మీటర్ల లైనింగ్ పనులు పూర్తి చేసింది. జగన్ హయాంలో 6,940 మీటర్ల లైనింగ్ పనులు పెండింగ్‌లో ఉన్నాయని, ఆ పనులు పూర్తి కాకుండా నీటిని వదిలితే సొరంగం కుప్పకూలే ప్రమాదం ఉందని (గతంలో ఎస్ఎల్‌బిసి వద్ద జరిగిన ప్రమాదం వలె) మంత్రి హెచ్చరించారు.
టీబీఎం తొలగింపు, ఫీడర్ కాలువ అడ్డంకులు
టన్నెల్-2లో 175 మీటర్ల పొడవున్న భారీ టీబీఎం యంత్రం అడ్డంగా చిక్కుకుపోయి ఉందని, దీనివల్ల కనీసం ఒక చుక్క నీరు కూడా ముందుకు వెళ్లే అవకాశం లేదని మంత్రి స్పష్టం చేశారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కాంట్రాక్టర్లు కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారని, ఆ సమస్యను పరిష్కరించకుండానే ప్రాజెక్ట్ పూర్తయిందని చెప్పడం విడ్డూరమని అన్నారు. అలాగే, ఫీడర్ కెనాల్‌ను కేవలం మట్టి కాలువలా వదిలేయడం వల్ల స్వల్ప వర్షానికే గండ్లు పడ్డాయని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రూ. 456 కోట్లతో లైనింగ్, సిమెంట్ కాంక్రీట్ వాల్స్ పనులను ప్రారంభించిందని తెలిపారు.
ముంపు గ్రామాలు, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ:
నిర్వాసితుల విషయంలో గత ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించిందని మంత్రి ఆరోపించారు. 11 ముంపు గ్రామాల్లోని 7,225 కుటుంబాలకు సుమారు రూ. 886 కోట్ల నష్టపరిహారం చెల్లించాల్సి ఉండగా, గత ఐదేళ్లలో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు. నిర్వాసితులను పోలీసు సెక్షన్లతో ఇళ్లకే పరిమితం చేసి ప్రాజెక్టును అంకితం చేయడం వారిని మోసం చేయడమేనని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే వేములకోట, దేవరాజుగట్టు పునరావాస కేంద్రాల పనులు వేగవంతం అయ్యాయని ఆయన వివరించారు.
నిధుల కేటాయింపు, ప్రస్తుత లక్ష్యం:
ప్రాజెక్ట్ పూర్తయిందని ప్రచారం చేసిన వైసీపీ నేతలే ఇప్పుడు బడ్జెట్ సరిపోదని అనడం వారి ద్వంద్వ వైఖరికి నిదర్శనమని మంత్రి ఎద్దేవా చేశారు. 2024-26 మధ్య కూటమి ప్రభుత్వం సుమారు రూ. 570.85 కోట్లు ఖర్చు చేసిందని, జూన్ 2026 నాటికి తీగలేరు మరియు తూర్పు ప్రధాన కాలువ రెగ్యులేటర్ల పనులతో సహా అన్ని కీలక పనులను పూర్తి చేసి నల్లమల్ల సాగర్‌కు నీటిని చేరుస్తామని హామీ ఇచ్చారు. అసంపూర్తిగా ఉన్న డైవర్షన్ రోడ్డు పనులు కూడా ప్రస్తుతం వేగంగా జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
జగన్ పాలనలో నాలుగుసార్లు గడువు మార్చినా పూర్తి చేయలేకపోయారని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనులు చేస్తోందని మంత్రి రామానాయుడు తెలిపారు. శ్రీశైలం నీటిమట్టం తగ్గగానే జూన్ లోపు మిగిలిన హెడ్ రెగ్యులేటర్ పనులు పూర్తి చేస్తామని, రైతులకు, ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం 2026 నాటికి వెలిగొండ కలను సాకారం చేస్తామని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
