
వెలిగొండ నిర్వాసితుల త్యాగం వెలకట్టలేనిది: మంత్రి నిమ్మల
మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభ దశకు చేరుకోవడం వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రాజెక్టు కోసం భూములు, ఆస్తులు త్యాగం చేసిన నిర్వాసితుల కృషి ఉందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. వెలిగొండ ప్రాజెక్టు కోసం త్యాగాలు చేసిన నిర్వాసితులకు పేరు పేరునా పాదాభివందనాలు చేస్తున్నానని తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్న రెగ్యులేటర్ గేట్ల ఏర్పాటు పనులను బుధవారం మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ఈనెల 31న సీఎం చంద్రబాబు వెలిగొండ వద్ద జలహారతి ఇవ్వనున్న నేపథ్యంలో ఘాట్, స్థూపం, సభా ప్రాంగణం ఏర్పాట్లపై అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. అనంతరం రాత్రి నిర్వాసితుల కాలనీలను మంత్రి సందర్శించారు. కాలనీల్లో మౌలిక వసతుల కల్పనపై కలెక్టర్, సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ముంపు గ్రామాల నిర్వాసితులు ప్రస్తుతం ఎక్కడ నివసిస్తున్నారో గుర్తించి వారికి రేషన్, పింఛన్ తదితర సంక్షేమ పథకాలు ఎలాంటి ఆటంకం లేకుండా అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించారు.
7 వేల కుటుంబాల త్యాగం
వెలిగొండ ప్రాజెక్టు కోసం సుమారు 7 వేల నిర్వాసిత కుటుంబాలు చేసిన త్యాగాల ఫలితంగానే లక్షలాది ఎకరాలకు సాగునీరు, లక్షలాది మందికి తాగునీరు అందబోతున్నాయని మంత్రి పేర్కొన్నారు. నిర్వాసితుల త్యాగం వెలకట్టలేనిదని, భవిష్యత్‌లో వారికి అన్ని విధాలా ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం ఐదేళ్లపాటు నిర్వాసితులను మోసం చేసిందని మంత్రి ఆరోపించారు. నిర్వాసితులకు రూ.900 కోట్లు చెల్లించాల్సి ఉన్నప్పటికీ గత ఐదేళ్లలో ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 40 రోజుల్లోనే రూ.768 కోట్లు నిర్వాసితులకు చెల్లించామని తెలిపారు. నిర్వాసితుల ప్రతి సమస్యను పరిశీలించి, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని చెప్పారు. వెలిగొండ నుంచి నీరు అందుతున్నందుకు రైతుల కళ్లలో కనిపించే ఆనందం నిర్వాసితుల కుటుంబాల్లోనూ కనిపించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు.
కాలనీల్లో మౌలిక వసతుల కల్పన
నిర్వాసితుల కాలనీల్లో పాఠశాలలు, ఆలయాలు, మసీదులు, కమ్యూనిటీ హాళ్లు, పంచాయతీ కార్యాలయాలు, సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ వంటి మౌలిక వసతులు గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే నిర్మించినవేనని మంత్రి తెలిపారు. ప్రస్తుతం కాలనీలు రాత్రివేళల్లో విద్యుత్ దీపాలతో వెలుగుతున్నాయని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం నిర్వాసితుల కాలనీల్లో పెరిగిన తుప్పలను కూడా తొలగించలేదని విమర్శించారు. నిర్వాసిత కుటుంబాలు సొంత ఇళ్లు నిర్మించుకుని గృహ ప్రవేశాలు చేసే వరకు అధికారులు, ప్రజాప్రతినిధులు వారికి అండగా ఉంటారని మంత్రి స్పష్టం చేశారు.
