Let's talk: editor@tmv.in
వెలిగొండ తొలి దశకు శ్రీకారం.. నల్లమలసాగర్‌లోకి కృష్ణా జలాలు

వెలిగొండ తొలి దశకు శ్రీకారం.. నల్లమలసాగర్‌లోకి కృష్ణా జలాలు

Pinjari Chand
1 సెప్టెంబర్, 2026

ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని కరువు పీడిత ప్రాంతాలకు వరప్రదాయినిగా భావిస్తున్న వెలిగొండ ప్రాజెక్టు తొలి దశను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం జాతికి అంకితం చేశారు. శ్రీశైలం జలాశయం నుంచి కృష్ణా జలాలను నల్లమలసాగర్‌లోకి విడుదల చేశారు. తక్కువ వర్షపాతం, భూగర్భ జలాలు అడుగంటడం, ఫ్లోరైడ్‌ సమస్య, సాగునీటి కొరతతో ఇబ్బందులు పడుతున్న మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కడప ప్రాంతాలకు ఈ ప్రాజెక్టు ద్వారా విస్తృత ప్రయోజనాలు కలగనున్నాయి. శ్రీశైలం జలాశయం నుంచి కృష్ణా జలాలను గ్రావిటీ ద్వారా మళ్లించి నల్లమలసాగర్‌లో నిల్వ చేస్తారు. అక్కడి నుంచి ప్రధాన కాలువల ద్వారా సాగు, తాగునీటి అవసరాలకు సరఫరా చేయనున్నారు.

1.19 లక్షల ఎకరాలకు సాగునీరు

వెలిగొండ తొలి దశ ద్వారా 10.70 టీఎంసీల కృష్ణా జలాలు నల్లమలసాగర్‌లోకి చేరనున్నాయి. దీంతో 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, 4 లక్షల మందికి తాగునీటి ప్రయోజనం కలగనుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే 30 మండలాల్లో 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, సుమారు 23 లక్షల మందికి తాగునీరు అందనుంది. ముఖ్యంగా ఫ్లోరైడ్‌ ప్రభావిత ప్రాంతాలకు తాగునీటి సమస్య నుంచి ఉపశమనం లభించనుంది.

రెండేళ్లలో రూ.2,400 కోట్లకుపైగా ఖర్చు

2024లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లలో వెలిగొండ ప్రాజెక్టుపై రూ.2,400 కోట్లకుపైగా ఖర్చు చేసి పనులను వేగవంతం చేసినట్లు చంద్రబాబు తెలిపారు. ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం రూ.10,200 కోట్లు కాగా.. తొలి దశను రూ.7,983 కోట్ల వ్యయంతో పూర్తి చేసినట్లు వెల్లడించారు. ప్రాజెక్టులో భాగంగా 18.8 కిలోమీటర్ల మేర ట్విన్‌ టన్నెల్స్‌, 21.8 కిలోమీటర్ల ఫీడర్‌ కాలువల నిర్మాణం పూర్తయిందని సీఎం తెలిపారు. శ్రీశైలం జలాశయంలోని కొల్లం వాగు నుంచి గ్రావిటీ ద్వారా నీటిని తరలించి 53 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉందన్నారు.

నిర్వాసితులకు రూ.768 కోట్ల పరిహారం

ప్రాజెక్టు కోసం భూములు కోల్పోయిన నిర్వాసిత కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం అందించిందని చంద్రబాబు తెలిపారు. 6,206 నిర్వాసిత కుటుంబాలకు 48 రోజుల్లో రూ.768 కోట్ల పరిహారం చెల్లించినట్లు చెప్పారు. పరిహారం అందని లబ్ధిదారుల కోసం మరో రూ.169 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. అలాగే కటాఫ్‌ తేదీని పొడిగించి 18 ఏళ్లు నిండిన యువతకు రూ.2 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని తెలిపారు. ప్రాజెక్టు ద్వారా ప్రయోజనం పొందుతున్న రైతులతో పాటు నిర్వాసిత కుటుంబాలు కూడా సంతోషంగా ఉండాలన్నదే తమ ఉద్దేశమని పేర్కొన్నారు.

‘వెలిగొండ స్వర్ణగిరిగా మారుతుంది’

వెలిగొండ ప్రాజెక్టు ఈ ప్రాంతంలో అభివృద్ధికి బాటలు వేస్తుందని చంద్రబాబు అన్నారు. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే ‘బంగారు కొండ’గా వెలిగొండను తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ‘మాట ఇచ్చాం.. ప్రాజెక్టును పూర్తి చేశాం.. కృష్ణా జలాలను తీసుకొచ్చాం. ఇకపై సంపద సృష్టిస్తాం’ అని సీఎం అన్నారు. దశాబ్దాలుగా కరువు, ఫ్లోరైడ్‌ సమస్యలతో పోరాడుతున్న రైతులకు కృష్ణా జలాల రాక కొత్త జీవితాన్ని ఇస్తుందని చెప్పారు. కరువును జయించాలన్న సంకల్పానికి, మూడు దశాబ్దాల పోరాటానికి వెలిగొండ ప్రతీకగా నిలిచిందన్నారు. కొండలను తొలిచి సొరంగాలు నిర్మించి కృష్ణా జలాలను కరువు నేలకు తీసుకువచ్చామని చెప్పారు. పశ్చిమ ప్రకాశంలో ఫ్లోరైడ్‌ సమస్యకు ఇక చరమగీతం పాడే సమయం వచ్చిందని పేర్కొన్నారు.

4.47 లక్షల ఎకరాలకు సాగునీరు

పూర్తిస్థాయి ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 3.36 లక్షల ఎకరాలు, నెల్లూరులో 84 వేల ఎకరాలు, కడపలో 27 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని సీఎం తెలిపారు. అదేవిధంగా తీగలేరు కాలువ కింద 62 వేల ఎకరాలు, గొట్టిపాడియా కాలువ కింద 9,500 ఎకరాలు, తూర్పు ప్రధాన కాలువ కింద 3.70 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించనున్నట్లు వెల్లడించారు. వెలిగొండ ప్రాజెక్టుతో సాగునీటి లభ్యత పెరగడంతో పంటల వైవిధ్యం, ఉద్యాన పంటలు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు అభివృద్ధి చెందడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది. భూగర్భ జలాలపై ఆధారపడటం, వలసలు కూడా తగ్గే అవకాశం ఉందని పేర్కొంది.