
వెలిగొండతో జలకళ… మార్కాపురం జిల్లాకు అభివృద్ధి: సి ఎం చంద్రబాబు
ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్కాపురం జిల్లా, యర్రగొండపాలెం నియోజకవర్గంలో పర్యటించారు. రూ.456 కోట్లతో చేపట్టనున్న వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ లైనింగ్ పనులకు దోర్నాల మండలం, గంటవానిపల్లిలో శంకుస్థాపన చేశారు. అనంతరం అమ్మిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, సురవరం గండివీరారెడ్డి అనే రైతులతో కలిసి ఫీడర్ కెనాల్ పనుల్ని పరిశీలించారు. ఈ సందర్బంగా వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు నమూనా పరిశీలన అనంతరం పనులపై అధికారులతో సమీక్షించారు. వెలిగొండ టన్నెళ్ల పనులతో పాటు క్షేత్రస్థాయిలో పనులు జరుగుతున్న వేర్వేరు ప్రాంతాల్లోని అధికారులతో వీడియోకాన్ఫరెన్సు ద్వారా సీఎం మాట్లాడారు. మార్కాపురం జిల్లా కళగా మారుతోందని, వెలిగొండ ప్రాజెక్టుతో ఈ ప్రాంతానికి జలకళ వచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
అనతరం హార్టీకల్చర్ రైతుల జీవితాల్లో మార్పు తీసుకొచ్చే ‘కళకళ’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, వేదిక వద్ద ఏర్పాటు చేసిన ర్యాంపుపై కలియతిరుగుతూ ప్రజల హర్షాతిరేకాల మధ్య ప్రసంగించారు. అభివృద్ధి, పునర్నిర్మాణమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన పేర్కొన్నారు.
గత పాలనలో రాష్ట్రం విధ్వంసానికి గురైందని, ఆ పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని బయటపడేయాలంటే ప్రజల సహకారం అవసరమని ఎన్నికల సమయంలో కోరానని సీఎం గుర్తుచేశారు. రాష్ట్ర హితాన్ని దృష్టిలో పెట్టుకొని జనసేన, బీజేపీలతో కలిసి ఎన్డీఏ కూటమిగా ఏర్పడి ప్రజల ఆశీస్సులు అందుకున్నామని తెలిపారు. గత ఎన్నికల్లో 94 శాతం స్ట్రైక్ రేట్‌తో అఖండ విజయం అందించిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
అరకు నుంచి ఉమ్మడి ప్రకాశం వరకు ప్రత్యర్థులకు ఒక్క సీటు కూడా రాలేదని సీఎం చెప్పారు. రాబోయే ఎన్నికల్లో ప్రకాశం, మార్కాపురం జిల్లా మొత్తం కూటమిని వందశాతం గెలిపించాలని ప్రజలను కోరారు. మంచి చేసే వారికి అండగా నిలిచినప్పుడే ప్రజల జీవితాలు మెరుగవుతాయని ఆయన వ్యాఖ్యానించారు.
150 కిలోమీటర్లు ప్రయాణించి ఒంగోలుకు వెళ్లాల్సిన ఇబ్బందులను తొలగిస్తూ మార్కాపురం జిల్లా ఏర్పాటు చేసి మాట నిలబెట్టుకున్నామని చంద్రబాబు తెలిపారు. మార్కాపురంతో పాటు మదనపల్లి జిల్లా, పోలవరం జిల్లాలను కూడా ఏర్పాటు చేశామని వెల్లడించారు. వెనుకబడిన ప్రాంతాలకు నీరు, మౌలిక వసతులు అందించడం తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు.
మార్కాపురానికి మరో వరంగా వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి సాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారు. గతంలో ఈ ప్రాజెక్టుకు తానే శంకుస్థాపన చేశానని, ఇప్పుడు అదే ప్రాజెక్టును పూర్తి చేసే అవకాశం తనకు రావడం అదృష్టమని అన్నారు. 2019-24 మధ్య కాలం రాష్ట్రానికి చీకటి రోజులని, ఆ సమయంలో వెలిగొండ పనులు ఒక్క అడుగు కూడా ముందుకు సాగలేదని విమర్శించారు.
ఈ ప్రాజెక్టు పూర్తయితే 4.35 లక్షల ఎకరాలు సాగులోకి వస్తాయని తెలిపారు. గిద్దలూరు, ఎర్రగొండపాలెం, కనిగిరి నియోజకవర్గాలతో పాటు ఉదయగిరి, కడప, బద్వేలు ప్రాంతాలకు కూడా నీళ్లు అందుతాయని వివరించారు. గతంలో తాను ముఖ్యమంత్రిగా కొనసాగి ఉంటే 2021లోనే ప్రాజెక్టును పూర్తి చేసి రైతులకు నీళ్లు ఇచ్చేవాళ్లమని అన్నారు.
మొత్తం ప్రాజెక్టుకు రూ.9,081 కోట్ల నిధులు అవసరమని, ఇప్పటివరకు నిర్మాణానికి రూ.5,451 కోట్లు ఖర్చు చేశామని సీఎం తెలిపారు. భూసేకరణకు రూ.484 కోట్లు, పునరావాసానికి రూ.184 కోట్లు వెచ్చించినట్టు చెప్పారు. రెండు దశల్లో ప్రాజెక్టు పూర్తి చేయాలని ప్రణాళిక రూపొందించామని, ఇంకా రూ.2,540 కోట్లు ఖర్చు చేస్తేనే వెలిగొండ పనులు పూర్తవుతాయని వెల్లడించారు.
గడచిన 20 నెలల్లో రూ.540 కోట్లు ఖర్చు చేసి పనులను వేగంగా ముందుకు తీసుకెళ్తున్నామని చంద్రబాబు చెప్పారు. రూ.456 కోట్లతో విలువైన ఫీడర్ కెనాల్ లైనింగ్ పనులకు శంకుస్థాపన చేసి బహిరంగ సభకు వచ్చినట్టు తెలిపారు. గత పాలకులు ఐదేళ్లలో కేవలం రూ.500 కోట్లు ఖర్చు చేసి పనులు పూర్తయ్యాయని ప్రచారం చేశారని, వాస్తవానికి అది ప్రజలను మోసం చేయడమేనని సీఎం విమర్శించారు.
